టెహ్రాన్ : అమెరికాతో తమ దేశం పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితిలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. టెహ్రాన్‌లో జరిగిన హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో మాట్లాడుతూ ... ప్రస్తుతం జరుగుతున్నది కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదని, ఇరాన్‌పై శత్రువు హైబ్రిడ్ యుద్ధాన్ని సాగిస్తున్నాడని పేర్కొన్నారు. సైనిక దాడులతో ఇరాన్ ప్రజలను లొంగదీసుకోలేమని శత్రువు గ్రహించాడని అన్నారు.
శత్రువుతో కొనసాగుతున్న ఘర్షణలో ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధి అత్యంత కీలక రంగాలుగా మారాయని పెజెష్కియాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సామాజిక ఆస్తులను రక్షించడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని సూచించారు. జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో అమెరికాతో జరిగిన చర్చల్లో ఇరాన్ జాతీయ హక్కులు, ప్రయోజనాలను తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిరక్షించిందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా .... వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా గత వారం అమెరికా ఇరాన్ దక్షిణ ప్రావిన్సులపై వరుస దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర సైనిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు జరిపింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తుది ఒప్పందానికి చేరుకునేందుకు 60 రోజుల వ్యవధిలో చర్చలు కొనసాగాల్సి ఉండగా, ఈ పరిణామాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
మరోవైపు, ఇరాన్‌పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున దక్షిణ, మధ్య ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ కౌంటీలతో పాటు సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని చాబహార్, కొనారక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.








కామెంట్‌లు (0)