- తయారు చేసిన టిబిఎఎల్
ప్రజాశక్తి - హైదరాబాద్: భారత ఏరోస్పేస్ తయారీ రంగంలోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టిబిఎఎల్) హైదరాబాద్ ప్లాంట్‌లో 400వ ఎహెచ్-64ఇ అపాచీ అటాక్ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేసింది. బోయింగ్–టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (టిఎఎస్‌ఎల్) సంయుక్త భాగస్వామ్యంతో 2016లో ఏర్పాటైన ఈ సంస్థ.. భారత్‌లో తయారు చేసిన ఫ్యూజ్‌లేజ్ (హెలికాప్టర్ ప్రధాన బాడీ భాగం)లను అమెరికా సహా వివిధ దేశాలకు సరఫరా చేసే అపాచీ హెలికాప్టర్లలో అనుసంధానిస్తోంది. ఫిబ్రవరి 2025 నాటికి 300వ ఫ్యూజ్‌లేజ్‌ను డెలివరీ చేసిన టిబిఎఎల్ ఆ తర్వాత సుమారు 18 నెలల్లో మరో 100 ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ పూర్తి చేయడం విశేషం. దేశీయ రక్షణ ఉత్పత్తి, అంతర్జాతీయ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో భారత్ పాత్రను విస్తరించే క్రమంలో ఈ తయారీ కేంద్రం ప్రాధాన్యం సంతరించుకుందని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత వాయుసేనలో 22, భారత సైన్యంలో 6 కలిపి 28 అపాచీ హెలికాప్టర్లు సేవల్లో ఉన్నాయి. ఇదే సమయంలో రక్షణ రంగంలో విస్తరిస్తున్న టిఎఎస్‌ఎల్ భారత్‌లో జావెలిన్ క్షిపణుల ఉమ్మడి ఉత్పత్తికి రేథియాన్–లాక్‌హీడ్ మార్టిన్ జాయింట్ వెంచర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది.








కామెంట్‌లు (0)