- అమెరికాలో ‘నో కింగ్స్’ నిరసనలు
- మధ్యంతర ఎన్నికల ముందు ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలు, ఫెడరల్ ఇమిగ్రేషన్ అమలు చర్యలకు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అమెరికన్లు రోడ్డెక్కారు. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌నకు ఓటు వేయవద్దంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ‘నో కింగ్స్’ బ్యానర్ కింద దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. దక్షిణ కాలిఫోర్నియాలో లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌లో ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. గ్లోరియా మొలీనా గ్రాండ్ పార్క్‌లో భారీ ప్రదర్శన జరిగింది.
ఈసారి కాస్త భిన్నమైన్నంగా....
గత ఏళ్ల భారీ ప్రదర్శనలకు భిన్నంగా, ఈసారి కార్యక్రమానికి ‘‘నో కింగ్స్: వోట్ ఎర్లీ’’ అని పేరు పెట్టారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిర్వాహకులు స్థానిక స్థాయిలో ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతం పెంపుపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో అభ్యర్థులకు మద్దతు, ప్రచారం, పార్టీ అనుబంధాన్ని నిషేధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కూటమిలో 50501, ఇండివిజిబుల్, ఎసిఎల్‌యూ, మూవ్‌ఆన్, లీగ్ ఆఫ్ ఉమెన్ వోటర్స్, బ్లాక్ వోటర్స్ మ్యాటర్ ఫండ్, వోటో లాటినో, పబ్లిక్ సిటిజన్, స్టేట్ వాయిసెస్, వామపక్ష సంఘాలు, తదితర సంస్థలు ఉన్నాయి. డౌన్‌టౌన్ ర్యాలీని 50501 సోకాల్ 30కి పైగా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించింది. దేశవ్యాప్తంగా శనివారం జరిగిన వేలాది ప్రదర్శనల్లో ఇదొకటి.
ట్రంప్ ఓటమే లక్ష్యం..
ఫెడరల్ ఇమిగ్రేషన్ అమలు చర్యలపై వ్యతిరేకత, ఎన్నికల్లో జోక్యం జరగవచ్చన్న ఆందోళనలు, అర్హులైన ఓటర్లు మధ్యంతర ఎన్నికల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన అంశాలని నిర్వాహకులు తెలిపారు. ఓటింగ్ ప్రణాళిక వేసుకోవడంలో పాల్గొనేవారికి సహాయపడేలా ఓటర్ అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ‘‘మన నగరంపై దండెత్తిన అదే ప్రభుత్వం ఇప్పుడు మన ఓటు హక్కులో జోక్యం చేసుకుంటామని బెదిరిస్తోంది’’ అని 50501 సంస్థ ప్రతినిధి అజ్‌లాన్ టెనోచ్టిట్లాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 జూన్‌లో లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ ఇమిగ్రేషన్ దాడుల తర్వాత, నేషనల్ గార్డ్ దళాలు, మెరైన్లను ఈ ప్రాంతానికి పంపిన తర్వాత జరిగిన నిరసనల కొనసాగింపుగా ఈ కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు చెప్పారు.ఈ ర్యాలీలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (దక్షిణ కాలిఫోర్నియా), ఆక్స్‌ఫామ్ అమెరికా, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ గ్రాస్‌రూట్స్ ఎల్‌ఏ, పబ్లిక్ సిటిజన్, డెమొక్రాటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా–ఎల్‌ఎ, వర్కింగ్ ఫ్యామిలీస్ పార్టీ, స్థానిక వలస హక్కుల సంఘాలు పాల్గొన్నాయి.
‘నో కింగ్స్’ ఉద్యమం 2025 జూన్‌లో ఆర్మీ 250వ వార్షికోత్సవ పరేడ్, ట్రంప్ 79వ పుట్టినరోజు సందర్భంగా మొదలైంది. 2025 అక్టోబర్ 18న జరిగిన రెండో విడత నిరసనల్లో దేశవ్యాప్తంగా సుమారు ఏడు మిలియన్ల మంది పాల్గొన్నారని నిర్వాహకులు చెప్పారు. ఇటీవలి ప్రధాన 'నో కింగ్స్' ప్రదర్శన 2026 మార్చి 28న జరిగింది. అప్పుడు దేశవ్యాప్తంగా వేలాది కార్యక్రమాలు నిర్వహించారు.







కామెంట్‌లు (0)