ఆరు రోజుల్లో 6 సాంకేతిక విపత్తులు
వరుస అంతరాయాలతో అమెరికా అతలాకుతలం
బుధవారం నిలిచిన ఆపిల్ సేవలు
వాషింగ్టన్: రోజూ వాడే స్మార్ట్‌ఫోన్ సేవల నుంచి అత్యంత రహస్య ప్రభుత్వ నెట్‌వర్క్‌ల వరకు ఈ వారం సాంకేతిక వ్యవస్థలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈనెల 12 నుంచి 17 మధ్య మైక్రోసాఫ్ట్ 365, ఎఫ్ఎఎ, చేజ్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఆపిల్, ఎన్ఎస్ఎ, మారియట్ సహా తొమ్మిది కీలక అంతరాయాలు నమోదుకావడం గమనార్హం. అయితే ఈ ఘటనలు పరస్పరం సంబంధం లేనివిగా కనిపిస్తున్నాయని, సమన్వయంతో జరిగిన సైబర్ దాడి సంకేతాలు లేవని అధికారులు తెలిపారు.
సాంకేతిక వ్యవస్థల్లో వరుస వైఫల్యాలు
ఈనెల మొదటి వారంలో మైక్రోసాఫ్ట్ 365లో ప్రపంచవ్యాప్త అంతరాయం ఏర్పడి, ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ వంటి సేవలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపార సంభాషణలు, రోజువారీ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌లో నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ కారణమని ఒక విశ్లేషణ పేర్కొంది. అలాగే, శుక్రవారం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ ప్రకటించింది. పలు ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వైఫల్యాల కారణంగా ఇది నాలుగు గంటలకు పైగా కొనసాగింది. వందలాది విమానాలకు ఆటంకం కలిగింది. జెపిమోర్గన్ చేజ్‌లో ఆన్-ప్రెమిస్ హార్డ్‌వేర్ వ్యవస్థలోని సాఫ్ట్‌వేర్ బగ్ వల్ల లావాదేవీలు ఆలస్యమయ్యాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో వినియోగదారులూ ఆన్‌లైన్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఇది సాంకేతిక లోపమే తప్ప సైబర్ దాడి కాదని చేజ్ సంస్థ తెలిపింది. సాంకేతిక వైఫల్యంతో విమానాల బయలుదేరడం సుమారు 90 నిమిషాలు నిలిచిపోయింది. విమాన బరువును లెక్కించే వ్యవస్థలో సమస్య వల్ల సుమారు 150 విమానాలు ఆలస్యమయ్యాయని మరో నివేదిక పేర్కొంది. అదే రోజున వెబ్‌సైట్ల పనితీరును పరీక్షించి మెరుగుపరిచే ఆప్టిమైజ్లీ ప్లాట్‌ఫామ్ ద్వారా హానికర జావాస్క్రిప్ట్ కోడ్ వ్యాపించింది. భద్రతా పరిశోధకుడు స్కాట్ హెల్మ్ (రిపోర్ట్ యుఆర్ఐ) ప్రకారం, 1,611 ఆప్టిమైజ్లీ స్నిప్పెట్లను పరిశీలిస్తే, 178 సంస్థలకు చెందిన 188 స్నిప్పెట్లలో హానికర కోడ్ కనిపించింది. జూమ్, బిబిసి, సిఎన్ఎన్, సేల్స్‌ఫోర్స్, గిట్‌ల్యాబ్, ఐకియా, హెచ్‌ఎస్‌బిసి, ఈక్విఫాక్స్ వంటివి ఈ జాబితాలో ఉండటంతో ఆందోళన కలిగించింది.
స్తంభించిన ఆపిల్ సేవలు..
ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే, ఆపిల్ మ్యూజిక్ సహా పలు సేవలు బుధవారం ఆగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కొత్త డివైజ్‌లను యాక్టివేట్ చేయలేక, ఖాతాల్లోకి లాగిన్ కాలేక అయోమయానికి గురయ్యారు. ఉద్యోగులు కూడా అంతర్గత సాఫ్ట్‌వేర్ బిల్డ్‌లు డౌన్‌లోడ్ చేయడం, క్యాలెండర్లు చూడటం, కాన్ఫరెన్స్ రూమ్‌లు బుక్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఆపిల్ దీన్ని సైబర్ దాడిగా కాకుండా, తమ అంతర్గత అప్‌డేట్ కారణంగా తలెత్తిన సమస్యగా వివరించింది. అదే రోజు సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని సంస్థ తెలిపింది. అలాగే, ఏజెన్సీ ఉద్యోగులు రహస్య సమాచారం పంచుకోవడానికి వాడే అంతర్గత నెట్‌వర్క్ ‘‘ఎన్ఎస్ఏనెట్’’ మంగళవారం పనిచేయలేదు. పేరు వెల్లడించని ఒక రక్షణ అధికారి ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. మారియట్ హోటళ్ల వెబ్‌సైట్, యాప్‌లలో అంతరాయం వల్ల బుకింగ్‌లకు ఆటంకం కలిగడం గమనార్హం.
అసలు కారణాలేంటి?
కంపెనీలు తమ సమస్యలకు వేర్వేరు కారణాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌లో నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, ఎఫ్ఏఏలో కొత్త రౌటర్లు, చేజ్‌లో సాఫ్ట్‌వేర్ విడుదల, ఎన్ఎస్ఎలో నిర్వహణ పనులు, ఆపిల్‌లో అంతర్గత అప్‌డేట్. అయితే, అమెరికా నిఘా విభాగాధిపతి ఈ వారం అంతరాయాలు మొత్తంగా కృత్రిమ మేధ గుర్తించిన లోపాలను సరిదిద్దే ప్యాచ్‌ల వల్ల జరిగాయని కాంగ్రెస్ సభ్యులకు చెప్పినట్లు నివేదికలున్నాయి. ఇది ఇంకా నిర్ధారణ కాని వాదన. కంపెనీల సొంత వివరణలు వేరే కారణాలను చెబుతున్నాయి. ఆపిల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, బ్యాంకుల నుంచి ప్రభుత్వ సంస్థల వరకు అన్నీ ఒకే తరహా సాంకేతిక వేదికలు, థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడుతున్నాయి. ఒక చిన్న సాఫ్ట్‌వేర్ లోపం లేదా ఒకే సరఫరాదారుపై దాడి జరిగినా కోట్లాది మంది జీవితాలు, వ్యాపారాలు స్తంభించే ప్రమాదం ఉందని ఈ వరుస ఘటనలు హెచ్చరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లపై కఠిన పరీక్షలు, ప్రత్యామ్నాయ వ్యవస్థలు, థర్డ్ పార్టీ స్క్రిప్టులపై కట్టుదిట్టమైన నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)