వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలతో కుదుర్చుకున్న కృత్రిమ మేధ (ఏఐ) భద్రతా ఒప్పందాన్ని మంగళవారం విడుదల చేశారు. వాషింగ్టన్‌లో టెక్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమైన అనంతరం ఈ పత్రంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఒక పేజీగా ఉన్న ఈ ఒప్పందాన్ని ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికపై పోస్ట్ చేశారు. ఏఐ నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో స్వతంత్రంగా పరిశీలించేందుకు బాహ్య ఆడిటర్లు లేదా మూల్యాంకన సంస్థల సహకారం తీసుకోవాలని ఒప్పందం సూచించింది. అంతర్గత, బాహ్య ఆడిటర్ల నివేదికలను పరిశీలించేందుకు కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. సైబర్ సెక్యూరిటీ, బయోసెక్యూరిటీ, రసాయన ముప్పులు వంటి కీలక రంగాల్లో ఏఐ మోడళ్ల సామర్థ్యాలు, భద్రతను పర్యవేక్షించేందుకు అంతర్గత నియంత్రణలు ఉండాలని తెలిపింది. ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా సాంకేతిక వ్యవస్థలను హ్యాక్ చేయకుండా లేదా అనధికారికంగా యాక్సెస్ చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ ఒప్పందంపై ట్రంప్‌తో పాటు గూగుల్, ఆంత్రోపిక్, మెటా, ఓపెన్‌ఏఐ, ఎక్స్, ఎన్విడియా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. భవిష్యత్తులో ఈ చర్యలను చట్టాలు లేదా నిబంధనలుగా మార్చే అవకాశం ఉందని వైట్‌హౌస్ పేర్కొంది. ఏఐ భద్రతకు సంబంధించిన ప్రమాణాలు, ఉత్తమ విధానాల రూపకల్పన కోసం పాల్గొన్న కంపెనీలు క్రమం తప్పకుండా సమావేశమవుతాయని తెలిపింది.







కామెంట్‌లు (0)