జెఎన్‌యు విద్యార్థి యూనియన్ మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్
‘ప్రశ్నించడం మా హక్కు. ప్రజాస్వామ్యయుతంగా మా గొంతు వినిపించడం మా బాధ్యత. మేము చట్టవిరుద్ధమైన పని చేయడం లేదు. భయపెట్టి ప్రశ్నలను ఆపలేరు.’ అని జెఎన్‌యు విద్యార్థి యూనియన్ మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఆమె సీనియర్ జర్నలిస్టు కృష్ణ కానూరికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు...
ప్రశ్న: ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి జెన్ జీ ని ఎలా తీసుకురావాలి?
జవాబు : రాజకీయాలపై జెన్ జీ అసంతృప్తిగా ఉండటం సహజమే. అయితే వారిని ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఏకైక మార్గం వారి జీవితాలను తాకే సమస్యలపై ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించడం. విద్య, ఉద్యోగం, ఫీజులు, సామాజిక న్యాయం వంటి వాస్తవ సమస్యలపై ఉద్యమాలు నిర్మించినప్పుడే రాజకీయాలు సానుకూల మార్పును తీసుకురాగలవనే నమ్మకం యువతలో ఏర్పడుతుంది. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో విడదీసే రాజకీయాలను పక్కకు నెట్టి, ప్రజల జీవితాలను మార్చే రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలి. సమస్యలే యువతను ఒక్కటి చేస్తాయి. ఐక్య ఉద్యమాలే ప్రజాస్వామ్య రాజకీయాలకు బాటలు వేస్తాయి.
ప్ర: రాజకీయ అధికారాన్ని ప్రజలకు జవాబుదారీగా ఎలా మార్చాలి?
జ: యువత, విద్యార్థులు ఐక్యంగా, సంఘటితంగా ఉద్యమాలు నిర్మించినప్పుడే ప్రభుత్వాలపై బలమైన ప్రజాస్వామ్య ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు, యువతతో పాటు పౌర సమాజాన్ని కూడా కలుపుకోవాలి. జంతర్ మంతర్ ఉద్యమం చూపించినది ఇదే. శాంతియుతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, ఐక్య ప్రజా ఉద్యమం అధికారాన్ని కూడా జవాబుదారీగా నిలబెట్టగలదు. ప్రజల ఐక్యత ముందు అధికార పీఠాలు శాశ్వతంగా నిలబడలేవు.
ప్ర : పేపర్ లీకులు, ఫీజులు, నిరుద్యోగం, ప్రభుత్వ విద్య క్షీణత.. ఇవి ఒకే సమస్యలో భాగమా?
జ : ఇవి వేర్వేరు సమస్యలుగా కనిపించినా వాటి మూలం ఒకటే. విద్యను ప్రజల హక్కుగా కాకుండా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, వాణిజ్యీకరణ వైపు నడిపించే విధానాలు. ప్రభుత్వ విద్యకు నిధులు తగ్గి, ప్రైవేట్ కోచింగ్ సంస్థలు, వ్యాపార ప్రయోజనాలు పెరిగినప్పుడు పేపర్ లీకులు, ఫీజుల భారం, ప్రభుత్వ పాఠశాలల బలహీనత వంటి సమస్యలు పెరుగుతాయి. భారత్ వంటి దేశంలో ప్రతి ఒక్కరికీ విద్య అందాలంటే ప్రభుత్వ విద్యపై పెట్టుబడి పెరగాలి.
ప్ర: సోషల్ మీడియాలోని క్షణిక ఆగ్రహాన్ని నిరంతర ప్రజాస్వామ్య ఉద్యమంగా ఎలా మార్చాలి?
జ: సోషల్ మీడియా ఒక శక్తివంతమైన ప్రచార సాధనం. అది ద్వేషాన్ని వ్యాప్తి చేయగలదు. అదే సమయంలో ప్రజల సమస్యలను కోట్ల మందికి చేరవేయగలదు. గతంలో కరపత్రాలు, పోస్టర్లు ఎలా ప్రజలను చైతన్యపరిచాయో, ఇప్పుడు సోషల్ మీడియాను కూడా అలాగే ఉపయోగించాలి. ఒక రోజు వైరల్ అయ్యే ఆగ్రహం మార్పును తీసుకురాదు. ఆ ఆగ్రహాన్ని సమస్యలపై చర్చగా, చర్చను సంఘటిత కార్యాచరణగా, కార్యాచరణను నిరంతర ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడే దానికి అర్థం ఉంటుంది. కంటెంట్‌లో నిజం, ప్రజా ప్రయోజనం, చైతన్యం ఉండాలి.
ప్ర: రాజకీయ పార్టీల సాధనంగా మారకుండా విద్యార్థి ఉద్యమ స్వతంత్రతను ఎలా కాపాడాలి?
జ: విద్యార్థి సంఘానికి స్వతంత్రత అత్యంత అవసరం. మేము భిన్నమైన అభిప్రాయాలు కలిగిన విద్యార్థులందరికీ వేదికగా ఉండాలి. విద్యార్థుల సమస్యలను ముందుకు తీసుకెళ్లడమే మా ప్రధాన బాధ్యత. ఎస్‌ఎఫ్‌ఐకి స్వతంత్ర రాజ్యాంగం, సంస్థాగత నిర్మాణం, మహాసభల వంటి ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాయి.
ప్ర: కేసులు, నిఘా, పోలీసు చర్యలు యువతను భయపెడతాయా?
జ : విద్యార్థులపై కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడం, వారి భవిష్యత్తును, కెరీర్‌ను దెబ్బతీయడం తీవ్రమైన విషయం. ప్రభుత్వం విద్యార్థులను భవిష్యత్ సమాజ నిర్మాతలుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడకూడదు. ఇలాంటి చర్యలు కొంత భయాన్ని కలిగించవచ్చు, కానీ ప్రశ్నించడం మా హక్కు. ప్రజాస్వామ్యయుతంగా మా గొంతు వినిపించడం మా బాధ్యత. మేము చట్టవిరుద్ధమైన పని చేయడం లేదు. భయపెట్టి ప్రశ్నలను ఆపలేరు. అణచివేత పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్య ప్రతిఘటనకు అవసరం మరింత పెరుగుతుంది.
ప్ర : రాజకీయ అధికారాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య సంస్థలను ఎలా కాపాడాలి?
జ: ముందుగా క్యాంపస్ ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలి. విద్యార్థులు తమ సమస్యలను, తమ రాజకీయాలను స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశం ఉండాలి. బయట నుంచి వచ్చే రాజకీయ జోక్యం క్యాంపస్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. జేఎన్‌యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి సంస్థలు విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉండటంతో పాటు చురుకైన రాజకీయ చర్చలకు వేదికలుగా నిలిచాయి. విద్యార్థుల భాగస్వామ్యం పెరిగినప్పుడే విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్యం బలపడుతుంది. స్వేచ్ఛను మరింత విస్తరింపజేయడమే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక మార్గం
ప్ర: కులం, మతం, భాష, ప్రాంతాలకు అతీతంగా జెన్ జీని ఏకం చేసేది ఏమిటి?
జ: యువతను కులం, మతం, భాష పేరుతో ఎన్నిసార్లు విభజించినా వారి అసలు సమస్యలు మారలేదు. ఉద్యోగం కావాలి, మంచి విద్య కావాలి, సామాజిక న్యాయం కావాలి, మహిళలకు భద్రతతో కూడిన అవకాశాలు కావాలి. ఇవి అందరి సమస్యలు. అస్థిత్వ రాజకీయాలు మనుషులను విడదీయవచ్చు కానీ వాటితో నిరుద్యోగం పోదు, ఫీజులు తగ్గవు, విద్య అందుబాటులోకి రాదు. అందుకే యువత తమ ఉమ్మడి భవిష్యత్తును కేంద్రంగా చేసుకున్న రాజకీయాలను ఎంచుకోవాలి.
ప్ర: కేవలం ఓటు వేయడమే కాకుండా, ప్రజాస్వామ్య భాగస్వాములుగా జెన్ జీ ఎలా మారాలి?
జ: ప్రజాస్వామ్యమంటే ఐదేళ్లకోసారి ఓటు వేసి ఐదేళ్లూ మౌనంగా ఉండటం కాదు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ప్రారంభం మాత్రమే. ప్రజాస్వామ్య భాగస్వామ్యం అనేది నిరంతర ప్రక్రియ. మేనిఫెస్టోలను యువత చదవాలి, ప్రభుత్వ విధానాలను పరిశీలించాలి, ఎవరు ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారో ప్రశ్నించాలి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజల భాగస్వామ్యం పెరగాలి. యువత కేవలం ఓటర్లుగా కాకుండా విధానాలను ప్రభావితం చేసే, ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టే శక్తిగా మారాలి.
ప్ర: నేటి యువతకు మీ ప్రయాణం చెప్పే ముఖ్యమైన పాఠం ఏమిటి?
జ: ప్రశ్నించే ధైర్యం, ఐక్యంగా నిలబడే శక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిబద్ధత... ఈ మూడింటినీ విడదీయలేం. యువత కేవలం ప్రేక్షకులుగా ఉండకూడదు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చర్చించాలి. ప్రశ్నించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి.






కామెంట్‌లు (0)