ఒక పుస్తకం ఒకరి ఆలోచనను మార్చగలదు. ఒక పద్యం ఒక పిల్లవాడి జీవితంలో విలువను నాటగలదు. అలాంటి పుస్తకాలను లక్షల్లో ముద్రించి ఉచితంగా పంచుతూ, పద్యాలు నేర్పుతూ, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచేందుకు 14 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న దంపతులు పైనేని తులసినాధం నాయుడు, పుష్ప. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఈ దంపతులు తమ ఆదాయంలో ఒకరి జీతాన్ని తెలుగు భాషా సేవకు వెచ్చిస్తూ, ఇప్పటివరకు మూడు లక్షల పుస్తకాలను విద్యార్థులకు, పాఠశాలలకు ఉచితంగా అందించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన వీరు 2012లో పలమనేరులో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని స్థాపించి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పిల్లలకు చేరువ చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు.

నేటితరం విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేయాలన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం క్రమంగా విస్తరించింది. ప్రతి రెండు నెలలకొకసారి నిర్వహించే పోటీల్లో ప్రతిసారీ 50 మందికి తక్కువ కాకుండా విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, పుస్తక బహుమతులు అందిస్తున్నారు. వేమన జయంతి సందర్భంగా నిర్వహించే పద్యపోటీల్లో వందకు పైగా వేమన పద్యాలు చెప్పగలిగే పిల్లలకు రూ.1,000, 50కి పైగా పద్యాలు చెప్పే వారికి రూ.500 చొప్పున నగదు బహుమతులు అందిస్తున్నారు. అవధానాలు, కవి సమ్మేళనాలు, సాహితీ చర్చలు, పుస్తకావిష్కరణలు, ప్రసిద్ధ వ్యక్తుల పరిచయాలు, ముఖ్య దినోత్సవాలు, పుస్తక సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
మూడు లక్షల పుస్తకాల పంపిణీ
పిల్లలకు పద్యాలు నేర్పడం ద్వారా వారిలో నైతిక విలువలను పెంపొందించవచ్చన్న ఆలోచనతో 108 నీతిపద్యాలను సేకరించి, వాటికి భావాలను జోడించి, జేబులో ఇమిడే చిన్న పుస్తకంగా రూపొందించారు. 2017లో ఉచిత పుస్తక పంపిణీని ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన స్పందనతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించారు. ఇప్పటివరకు 2 లక్షల 10 వేల నీతిపద్యాల పుస్తకాలను ముద్రించి జాతీయ స్థాయిలో పంపిణీ చేశారు. పెద్దబాలశిక్ష, బొమ్మల భారతం, బొమ్మల భాగవతం, బొమ్మల రామాయణం, పంచతంత్ర కథలు, హరికిషన్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, నసీరుద్దీన్ కథలు, తెలుగు వ్యాకరణం, జంతువులు చెప్పిన కథలు, తులసాకులు, తులసి పుష్పాలు, తులసి రసాలు, జ్ఞాన దీపాలు తదితర పుస్తకాలను మరో 90 వేల వరకు విద్యార్థులకు, పాఠశాలలకు అందించారు. మొత్తంగా మూడు లక్షల పుస్తకాల ఉచిత పంపిణీని పూర్తి చేశారు.
పుస్తకాలు, పద్యాలతో పాటు పిల్లలకు ప్రత్యక్షంగా సాహిత్య, సాంస్కృతిక అనుభవం కల్పించాలన్న ఉద్దేశంతో సంస్థ కార్యక్రమాలను విస్తరించారు. ప్రారంభంలో వివిధ పాఠశాలలు, గ్రంథాలయం, లయన్స్ క్లబ్ సేవాకేంద్రం భవనం, ప్రైవేటు సమావేశ మందిరాల్లో కార్యక్రమాలు నిర్వహించేవారు. సొంతంగా ఒక కళామందిరం ఉంటే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చని భావించి, తమ సొంత స్థలంలో రూ.20 లక్షల సొంత నిధులతో 150 మంది కూర్చునేలా కళామందిరాన్ని నిర్మించారు. స్థలంతో కలిపి సుమారు రూ.50 లక్షల విలువైన ఈ కళామందిరాన్ని 2022 జూలైలో ప్రారంభించారు. నాలుగేళ్ల వ్యవధిలో అక్కడ 320కి పైగా భాషా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల వరకు
వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలుగు భాష, సంస్కృతిపై అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం నెలరోజులపాటు కళామందిరంలో ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2026 వేసవి సెలవుల్లో ఆన్‌లైన్ వేదికగా రోజుకొక పద్యం చొప్పున వందలాది మంది పిల్లలకు ఉచితంగా పద్యాలను నేర్పించారు. తెలుగు రాష్ట్రాలకే తమ సేవలను పరిమితం చేయకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ తెలుగు విద్యార్థుల్లో భాష పట్ల ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడి తెలుగు వారికి భాష, సంస్కృతుల వైభవాన్ని పరిచయం చేయడంతో పాటు విద్యార్థులకు మంచి తెలుగు పుస్తకాలను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలోత్సవాలను నిర్వహించాలన్న ఉద్దేశంతో పలమనేరు సమీపంలో మిత్రుల సహకారంతో వేలాదిమంది విద్యార్థులతో బాలోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో కళల పట్ల అభిరుచిని పెంపొందించేందుకు పలమనేరు నాట్యోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం వందలాదిమంది పిల్లలకు బహుమతులు అందిస్తున్నారు.

కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు కవి సమ్మేళనాలు, సాహితీ చర్చలు నిర్వహిస్తున్నారు. తులసినాధం నాయుడు తన తండ్రి చిన్న బుచ్చి నాయుడు పేరుతో ప్రతి సంవత్సరం ఒక రచయితకు రూ.5 వేల నగదుతో పాటు స్మారక పురస్కారాన్ని అందిస్తున్నారు. తల్లి పైనేని మునెమ్మ పేరుతో జాతీయస్థాయిలో కథల పోటీలు నిర్వహించి పదిమందికి స్మారక నగదు పురస్కారాలు అందిస్తున్నారు. వీరి స్ఫూర్తితో మరికొందరు కూడా తమ తల్లిదండ్రుల పేర్లతో స్మారక పురస్కారాలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాలన్నింటికీ, పుస్తకాల ముద్రణ, పంపిణీకి అవసరమైన నిధులను ఈ దంపతులే సమకూర్చుకోవడం విశేషం. ఇద్దరూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ఒకరి జీతాన్ని పూర్తిగా తెలుగు భాషా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ, మరొకరి జీతంతో కుటుంబాన్ని నడుపుతున్నారు. తమకు వచ్చే ఆదాయాన్ని పిల్లల్లో భాషాభిమానాన్ని పెంచేందుకు, పుస్తకాలను అందించేందుకు, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించేందుకు వెచ్చించడం వారి అంకితభావానికి నిదర్శనం.
వీరి భాషా సేవను గుర్తించిన వివిధ సంస్థలు తులసినాధం నాయుడుకు బాలబంధు, బాల సాహితీ బంధు, తెలుగు భాషా సేవారత్న, తెలుగు భాషా బంధు, తెలుగు బంధు వంటి బిరుదులతో పాటు వందలాది పురస్కారాలు అందించాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పలమనేరు నుంచి ఇతర రాష్ట్రాల వరకు సాగుతున్న ఈ ప్రయాణం ఒకే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. తెలుగు భాష పిల్లల జీవితాల్లో నిలవాలి... సాహిత్యంపై వారికి ఆసక్తి పెరగాలి... విలువలతో కూడిన తరాన్ని తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యంతో పైనేని తులసినాధం నాయుడు, పుష్ప దంపతుల సాహిత్య సేవ కొనసాగుతోంది.
- అశ్వర్థ నారాయణ,
ప్రజాశక్తి పలమనేరు విలేకరి








కామెంట్‌లు (0)