బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కెరీర్‌కు కామా... ఫుల్‌స్టాప్ కాదు!

1 గంట క్రితం

carrer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:20 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘మాతృత్వం వచ్చాక కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిందా?’ అని అడిగితే చాలామంది మహిళలు ‘అవును’ అనే సమాధానం చెబుతారు. ‘వంట, ఇంటి పనులు, పిల్లల సంరక్షణతోనే రోజంతా గడిచిపోతుంది. ఇక వృత్తి గురించి ఆలోచించే సమయం, అవకాశం ఎక్కడుంటుంది?’ అని ప్రశ్నిస్తారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కవల పిల్లల తల్లి సుప్రియ పంచుకున్న అనుభవం ఈ భావనను పూర్తిగా మార్చేస్తోంది. ‘కెరీర్ బ్రేక్ అనేది జీవితానికి ముగింపు కాదు. అపరాధ భావనలో మునిగిపోకుండా మనల్ని మనం మళ్లీ కనుగొనే అవకాశం’ అని ఆమె చెప్పిన మాటలు ఎందరో అమ్మలకు స్ఫూర్తినిస్తున్నాయి.

ఉద్యోగాలు చేస్తున్న మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం విరామం తీసుకోవడం సహజం. కుటుంబం, పిల్లల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉద్యోగాన్ని పక్కన పెడతారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టాలని అనుకున్నా, చాలామంది ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకురాలేక వెనక్కి తగ్గిపోతారు. అయితే నిజంగా ‘కెరీర్ బ్రేక్ అంటే విశ్రాంతి కాలమేనా?’ అని ప్రశ్నిస్తున్నారు సుప్రియ. బయటివారికి ఇది ఇంట్లో ప్రశాంతంగా గడిచే కాలంలా కనిపించొచ్చు. ‘ఇష్టమొచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునే అవకాశం’ అని కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అది ఒక మహిళలోని సహనం, బాధ్యత, సమయపాలన, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచే కీలక దశ అని ఆమె చెబుతున్నారు.

‘నాకు పదేళ్ల కవల పిల్లలు ఉన్నారు. ఒకసారి వాళ్లిద్దరినీ “పెద్దయ్యాక ఏమవుతారు?” అని అడిగాను. ఏమాత్రం ఆలోచించకుండా “మేము కూడా నీలా ఇంటి దగ్గరే సరదాగా గడుపుతాం” అని చెప్పారు. ఆ ఒక్క సమాధానం నన్ను బాగా ఆలోచింపజేసింది. పిల్లలు నా జీవితాన్ని విశ్రాంతిగా చూస్తున్నారని అప్పుడు అర్థమైంది’ అని ఆమె చెప్పారు. ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలు ఇంటికే పరిమితమై ఉండాలని కోరుకోరు. ఉన్నత చదువులు చదివి, తమ కాళ్లపై తాము నిలబడాలని కలలు కంటారు. అయితే పిల్లలు తల్లిదండ్రుల మాటలకన్నా వారి జీవితాన్నే ఎక్కువగా గమనిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం విరామం తీసుకున్న తల్లి ఆ తర్వాత తన కలలను వదిలేస్తే, పిల్లల్లో కూడా అదే భావన బలపడే ప్రమాదం ఉంది.

విరామం తర్వాత ఉద్యోగంలోకి తిరిగి రావాలనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు వెంటాడతాయి. ‘ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అందుతుందా?’, ‘స్కిల్స్ తగ్గిపోయాయేమో?’, ‘పని ఒత్తిడిని తట్టుకోగలనా?’, ‘కుటుంబం, ఉద్యోగాన్ని ఒకేసారి ఎలా చూసుకుంటాను?’ వంటి భయాలు ముందడుగు వేయకుండా అడ్డుకుంటాయి. కానీ ఇవే మహిళల నిజమైన సామర్థ్యాన్ని కప్పిపెడతాయని సుప్రియ అంటున్నారు. ‘ప్రతి మహిళలో ఒక “రీసెట్ బటన్” ఉంటుంది. కానీ చాలామంది దానిని తామే ఆఫ్ చేసుకుంటారు. మళ్లీ కెరీర్ ప్రారంభించాలంటే ముందు ఆ బటన్‌ను ఆన్ చేయాలి. చిన్నచిన్న అడుగులతో మొదలు పెట్టాలి. ముందుగా రెజ్యూమ్‌ను నవీకరించాలి. ఆ తర్వాత మాతృత్వం మీకు నేర్పిన నైపుణ్యాలను గుర్తు చేసుకోవాలి. రాత్రుళ్లు నిద్ర లేకపోయినా పిల్లలను చూసుకోవడం, ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడం, ఎంత ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వుతో ఉండడం... ఇవన్నీ ఏ ఉద్యోగంలోనైనా అవసరమైన నైపుణ్యాలే. మాతృత్వం మిమ్మల్ని బలహీనులను చేయదు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది’ అని ఆమె చెప్పారు.

నిజానికి మాతృత్వం ఒక మహిళ కెరీర్‌కు అడ్డంకి కాదు. నాయకత్వం, ఓర్పు, సమయపాలన, సమస్యల పరిష్కారం వంటి ఎన్నో నైపుణ్యాలను అది మరింత మెరుగుపరుస్తుంది. అలాంటి తల్లిని ప్రతిరోజూ గమనించే పిల్లలు కూడా కష్టాలను ఎదుర్కోవడం, లక్ష్యాల కోసం శ్రమించడం నేర్చుకుంటారు. అందుకే ‘కెరీర్ బ్రేక్’ అంటే సామర్థ్యానికి విరామం కాదు. అది జీవితంలోని ఒక చిన్న కామా మాత్రమే. ఆ తర్వాత కూడా ఎన్నో అవకాశాలు, విజయాలు ఎదురుచూస్తూనే ఉంటాయి. మాతృత్వం మహిళలను వెనక్కి లాగదు... మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. ఆ బలాన్ని గుర్తించి మరోసారి అడుగు వేయడమే మిగిలింది.


కెరీర్ బ్రేక్.. తరువాత

* భారతదేశంలో కెరీర్ బ్రేక్ తర్వాత సుమారు 70 లక్షల మంది మహిళలు తిరిగి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా, 74 నుంచి 80 శాతం మంది మహిళలు తమ జీవితంలో ఏదో ఒక దశలో కెరీర్ విరామం తీసుకుంటున్నట్లు టాలెంట్ అడ్వైజరీ సంస్థ ‘లాంగ్ హౌస్ కన్సల్టింగ్’ నివేదిక పేర్కొంది.

* పిల్లల సంరక్షణ, వ్యక్తిగత కుటుంబ బాధ్యతల కారణంగా 44 నుంచి 45 శాతం మంది మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు.

* వృద్ధులైన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడం కోసం 24 శాతం మంది కెరీర్‌లో బ్రేక్ తీసుకుంటున్నారు.

* సరైన టైమ్ ఫ్లెక్సిబిలిటీ (సమయ సౌలభ్యం) లేకపోవడం వల్ల తిరిగి విధుల్లోకి చేరలేకపోతున్న వారు 15 శాతం మంది ఉన్నారు.

* బ్రేక్ తర్వాత తిరిగి విధుల్లోకి చేరేటప్పుడు ప్రారంభంలో పాత వేతనంలో కేవలం 60–75 శాతం మాత్రమే అందుకోగలుగుతున్నారు.

* అయితే 18–36 నెలల్లోనే నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ పాత వేతన స్థాయికి చేరుకుంటున్నారు.

* పెద్ద కంపెనీలు మహిళల పునఃప్రవేశం కోసం ప్రత్యేకంగా రిటర్న్‌షిప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్