పండుగ అంటే ఆర్భాటాలు, హంగులు ప్రదర్శించడం కాదు.. ప్రకృతిని స్మరించుకోవడం, సామాజిక వృత్తులను గౌరవించుకోవడం. కానీ నేటి పండుగలు బట్టలు, నగలు, పిండివంటలు, డాబు, దర్పాల ప్రదర్శనలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆసక్తిగా గమనించే కలకత్తా దుర్గాపూజ ఉత్సవాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక్కడ అమ్మవారి అలంకరణలు, నైవేద్యాల నుంచి పండళ్ల నిర్మాణం వరకు సంప్రదాయానికి సమకాలీన సామాజిక స్పృహను జోడిస్తారు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత, కార్మికుల శ్రమ, చారిత్రక వారసత్వం, జానపద కళల వంటి అంశాలను ఉత్సవాల్లో భాగం చేస్తారు.
కలకత్తా బెహాలాలోని దుర్గాపూజకు 237 ఏళ్ల చరిత్ర ఉంది. నవరాత్రుల్లో నవమి రోజున అక్కడ అమ్మవారికి ఇల్సా (హిల్సా) చేపలను నైవేద్యంగా సమర్పించడం బందోపాధ్యాయ కుటుంబం తరతరాలుగా పాటిస్తున్న సంప్రదాయం. పూర్వీకుల వంటకాల్లో ఉపయోగించే షోలా కొచు (దుంప కూర), చాల్కుమ్రో (బూడిద గుమ్మడి) వంటి కూరగాయలు స్థానికంగా లభించకపోవడంతో ఉత్తర బెంగాల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి నైవేద్యంగా పెడతారు. నవమి రోజున అమ్మవారికి ఐదు రకాల చేపల వంటకాలను సమర్పించిన తర్వాత, సరస్వతీ పూజ వచ్చేవరకు ఆ కుటుంబం చేపలను తినదు. చేపల ప్రత్యుత్పత్తి కాలంలో వాటి సంరక్షణకు పూర్వీకులు విధించిన ఈ నియమాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.
సామాజిక చైతన్య పండళ్లు
ఈ ఏడాది కూడా కలకత్తా వీధుల్లోని పలు పండళ్లు సామాజిక, పర్యావరణ సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి. భబతోష్ సుతార్ శిల్పకళతో రూపొందించిన 'ఏక్ పుకూర్ భలోబాషా' (ఒక కొలను నిండా ప్రేమ) మండపం పట్టణాల్లో కనుమరుగవుతున్న, కలుషితమవుతున్న చెరువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తోంది. చారిత్రక ప్రాధాన్యమున్న స్థానిక కొలను చుట్టూ ఏర్పాటు చేసిన ఈ మండపంలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జలచరాలు ఎదుర్కొనే ఇబ్బందులను నీటి అడుగున చిత్రీకరించిన దృశ్యాల ద్వారా చూపిస్తున్నారు. చెరువు అడుగున 18 మైక్రోఫోన్లు అమర్చి చేపల కదలికలు, ఆహారం కొరికే శబ్దాలను ప్రత్యక్షంగా వినిపిస్తున్నారు. 20 అడుగుల ఎత్తులో నిర్మించిన దుర్గాదేవి విగ్రహాన్ని నాచు రంగులో తీర్చిదిద్ది, తామరలు, కొల్మి ఆకుల వంటి సహజ నీటి మొక్కలతో అలంకరించారు. దేబాశిష్ బరుయ్ రూపొందించిన 'శోధన్' మండపం కూడా ప్రకృతి విధ్వంసం పట్ల హెచ్చరిస్తోంది. పట్టణీకరణ, చెట్ల నరికివేత, కాలుష్యం వల్ల ప్రకృతి వనరులు క్షీణిస్తున్న తీరును చూపిస్తూ, భవిష్యత్తులో కృత్రిమ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తోంది.
మహిళలపై అణచివేత, వివక్ష, సామాజిక ఉదాసీనతను ప్రశ్నించే పండళ్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 'ఐశ్వర్యీ' మండపం మహిళను శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తూనే, ఆమె స్వేచ్ఛను, స్వయంప్రతిపత్తిని అణచివేసే మూఢనమ్మకాలు, పురుషాధిక్య ధోరణులను నిలదీస్తోంది. 'హుటోమ్ ప్యాంచార్ నక్ష' (గుడ్లగూబ స్కెచ్‌బుక్) మండపం మహిళలపై నేరాల పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. ఆర్జీ కర్ ఘటనతోపాటు ఇతర విషాదాల సమయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న తీరును విమర్శిస్తోంది. మహిళలను దేవతలుగా పూజించే సమాజం వారికి నిజజీవితంలో భద్రత, సమానత్వం కల్పించడంలో ఎందుకు విఫలమవుతోందన్న ప్రశ్నను ముందుకు తెస్తోంది.
కార్మికుల శ్రమను ప్రతిబింబించేలా రాజు సర్కార్ రూపొందించిన 'పార్క్ సర్బోజనిన్' మండపాన్ని రాణిగంజ్ బొగ్గు గనుల నేపథ్యంలో నిర్మించారు. భూగర్భ గని వాతావరణాన్ని తలపించే ఈ మండపం కార్మికులు ఎదుర్కొనే ఊపిరాడని పరిస్థితులను, చీకటిమయమైన వారి జీవితాలను కళ్లకు కడుతోంది. ఇక్కడ దుర్గాదేవిని గడ్డపార చేతబూనిన రూపంలో చూపించడం ద్వారా శ్రమజీవుల కష్టాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు.
జానపద జ్ఞాపకాలు
బెంగాల్ చారిత్రక వైభవాన్ని, మరుగునపడుతున్న జానపద కళలను పరిచయం చేసే ప్రయత్నాలూ ఉత్సవాల్లో కనిపిస్తున్నాయి. అనిర్బన్ దాస్ రూపొందించిన 'బినీయ కథ' మండపం క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు బెంగాల్‌కు ఉన్న సముద్ర వాణిజ్య చరిత్రను ఆవిష్కరిస్తోంది. నౌకాశ్రయం, వాణిజ్య నౌక ఆకృతిలో నిర్మించిన ఈ మండపంలో చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ సముద్ర ప్రయాణం, అశోకుడు శ్రీలంకకు బోధివృక్షాన్ని పంపిన ఘట్టం, ద్వారకానాథ్ టాగోర్ షిప్పింగ్ వ్యాపారం వంటి చారిత్రక అంశాలను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు, సనాతన దిందా, తాపస్ దత్తా రూపొందించిన 'పంచలతిక' మండపం అంతరించిపోతున్న బెంగాల్ జానపద కళారూపమైన తోలుబొమ్మలాటను పరిచయం చేస్తోంది. యువతకు ఈ కళను చేరువ చేయడానికి ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజాము వరకు తాళ్లతో, కడ్డీలతో కదిలించే బొమ్మల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఇలా కలకత్తా దుర్గామండపాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాకుండా సమకాలీన సమస్యలపై చర్చకు, సామాజిక చైతన్యానికి వేదికలవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ నుంచి మహిళల హక్కుల వరకు, కార్మికుల జీవితాల నుంచి చారిత్రక, సాంస్కృతిక వారసత్వం వరకు అనేక అంశాలను పండుగలో భాగం చేస్తున్నాయి. ఉత్సవాల్లోనూ, ఉత్సవ కథల్లోనూ ఉన్న అంశాలకు వర్తమానపు అవగాహనను అద్దటం అనేది పర్వదినాలకు అందాన్ని, అర్థాన్ని కలిగిస్తోంది.







కామెంట్లు (0)