ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రికెట్‌లో దూసుకెళ్తున్న కవిటి కుర్రాడు

12 నవంబర్, 2026

క్రికెట్‌లో దూసుకెళ్తున్న కవిటి కుర్రాడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 07:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

క్రికెట్‌ను ఇష్టపడని పిల్లలుండరు. సెలవు వచ్చిందంటే చాలు.. ప్రతి వీధిలో క్రికెట్‌ ఆడుతున్న పిల్లలు కనిపిస్తుంటారు. సరదా కోసం కొంతమంది ఆడతారు. సీరియస్‌గా ఆటలో రాణిస్తారు ఇంకొంతమంది. అయితే చాలా తక్కువ మంది మాత్రమే క్రికెటర్‌ను కెరీయర్‌గా ఎంచుకుంటారు. పేద కుటుంబాల పిల్లలకు ఆ కల అందని ద్రాక్షే. అయితే ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ప్రగడపుట్టుగకు చెందిన పిరియా శబరిగిరీష్‌ క్రికెట్‌ ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. ఎందరో గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ కవిటి కుర్రాడు ఇప్పటి వరకు 207 మ్యాచ్‌లు ఆడాడు. 5,972 పరుగులు చేశాడు. 171 వికెట్లు సాధించాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్న శబరిగిరీష్‌ సరైన ప్రోత్సాహం, పట్టుదల ఉంటే మారుమూల గ్రామాల నుంచీ క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని చాటుతున్నాడు.

శబరిగిరీష్‌ తల్లిదండ్రులు పిరియా రామ్‌కుమార్‌, రాణి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. నిర్మాణ రంగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రామ్‌కుమార్‌ తన కుమారుడిలోని క్రికెట్‌ ప్రతిభను గుర్తించారు. శిక్షణకు అధిక ఖర్చు అవుతున్నా వెనుకడుగు వేయలేదు.. కుమారుడి అభిరుచికి అండగా నిలిచారు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శబరిగిరీష్‌ కూడా సాధనపై దృష్టి పెట్టాడు. 2022 ఫిబ్రవరిలో ఆరో తరగతి చదువుతున్నప్పుడే హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఎలైట్‌ క్రికెట్‌ అకాడమీలో శబరిగిరీష్‌ శిక్షణ ప్రారంభించాడు. కోచ్‌ బిడకోటి సీతారాం వద్ద క్రికెట్‌లోని మెలకువలు నేర్చుకున్నాడు. క్రమం తప్పకుండా సాధన చేస్తూ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తనదైన శైలిని అభివృద్ధి చేసుకున్నాడు. శబరిగిరీష్‌ ఇప్పటివరకు 207 మ్యాచ్‌లు ఆడగా, 185 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన పరుగులన్నీ రికార్డులే. తొమ్మిది సెంచరీలు, 31 అర్ధసెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి. 42.96 సగటుతో పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 పరుగులు నాటౌట్‌. 199, 190, 135 పరుగులతోనూ అజేయంగా నిలిచాడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందించాడు.

బంతితోనూ మెరుపులే!

బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించే శబరిగిరీష్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఒక మ్యాచ్‌లో 15 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. మూడు సార్లు ఐదు వికెట్లు, 20 సార్లు మూడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా తన సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాడు. మైదానంలో వ్యక్తిగత ప్రతిభ చూపడమే కాకుండా జట్టును నడిపించడంలోనూ ముందుంటున్నాడు. కెప్టెన్‌గా 84 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 71.08 శాతం విజయాల రేటు నమోదు చేశాడు. అతడి సారథ్యంలో జట్టు 25 సార్లు విజేతగా నిలిచింది.

టోర్నమెంట్లలో ప్రత్యేక గుర్తింపు

తెలంగాణ స్కూల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర, అంతర్రాష్ట్ర టోర్నమెంట్లలో శబరిగిరీష్‌ పాల్గొన్నాడు. అండర్‌-16 ఇండియా–శ్రీలంక ఫ్రెండ్‌షిప్‌ కప్‌, ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాడు. 2025–26లో భువనేశ్వర్‌లో జరిగిన ఎక్సెల్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో ఇచ్చాపురం ఐసీసీ క్లబ్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇచ్చాపురంలో జరిగిన ఎన్‌బీపీఎల్‌-2 టోర్నమెంట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్‌, బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డులు సాధించాడు. హైదరాబాద్‌లో జరిగిన అండర్‌-14 వన్‌ ఛాంపియన్‌ టోర్నమెంట్‌లోనూ బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీకాకుళంలో జరిగిన ఎఫ్‌సీఎల్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏసీఈ అండర్‌-14 టోర్నమెంట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్‌, ఉత్తమ బౌలర్‌, టోర్నమెంట్‌ బెస్ట్‌ ప్లేయర్‌ గుర్తింపు పొందాడు.

ప్రోత్సాహం లభిస్తే మరిన్ని విజయాలు

ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లభించక వెనుకబడుతున్న గ్రామీణ యువతకు శబరిగిరీష్‌ ప్రస్థానం ఒక ఉదాహరణ. తండ్రి ప్రోత్సాహం, కోచ్‌ శిక్షణ, వ్యక్తిగత కృషి కలిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తన ప్రయాణం చెబుతోంది. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో తన ఆటతీరుతో గుర్తింపు పొందుతున్న ఈ యువ క్రికెటర్‌కు మరింత ప్రోత్సాహం, ఉన్నత స్థాయి అవకాశాలు లభిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది. మారుమూల ప్రాంతమైన ప్రగడపుట్టుగ నుంచి మొదలైన శబరిగిరీష్‌ క్రికెట్‌ ప్రయాణం మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం.

- పూడి సత్యనారాయణ,

ప్రజాశక్తి విలేకరి, కవిటి మండలం

శ్రీకాకుళం జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్