ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సముద్రంపై సరికొత్త ప్రయాణం

09 నవంబర్, 2026

సముద్రంపై సరికొత్త ప్రయాణం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నెలల తరబడి సముద్రంపై ప్రయాణం.. కుటుంబానికి, ఇంటికి దూరంగా జీవితం.. మహిళలకు ఇదంతా సాధ్యమయ్యే పని కాదని చాలామంది భావిస్తారు. కానీ బీహార్‌కు చెందిన రీతూ కుమారి ఆ అభిప్రాయాన్ని మార్చారు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నౌకాయాన రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ‘ది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ’ చరిత్రలో కెప్టెన్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న రోజుల్లో నౌకాయాన రంగంలోకి వస్తానని రీతూ కలలో కూడా ఊహించలేదు. అయితే ఆ పరీక్షలో సాధించిన ర్యాంకుతో ముంబయిలోని టి.ఎస్. చాణక్య నాటికల్ శిక్షణా సంస్థలో ప్రవేశం లభించింది. నాటికల్ సైన్స్‌లో శిక్షణ పూర్తిచేసుకుని సముద్రయాన రంగంలో అడుగుపెట్టారు. మొదట్లో ఈ రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, శిక్షణ సమయంలో లభించే యూనిఫామ్‌, వసతులు ఆమెను ఆకర్షించాయి. ఆ తర్వాత మహిళలకు తగిన సౌకర్యాలు, అవకాశాలు పరిమితంగా ఉన్న రంగంలో తనదైన గుర్తింపు కోసం కృషి చేశారు.

బీహార్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన రీతూ, శిక్షణ సమయంలో తన బ్యాచ్‌లో ఏకైక మహిళ. ఈ పరిస్థితి ఎన్నోసార్లు ఒంటరితనానికి గురిచేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. పురుషాధిక్య రంగంలో మహిళలు నిలదొక్కుకోలేరనే అభిప్రాయాన్ని తన పనితీరుతో తప్పని నిరూపించాలనుకున్నారు. 2009లో నాటికల్ సైన్స్ శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె, సీర్లాండ్, స్కార్పియో షిప్ మేనేజ్‌మెంట్, హఫ్నియా ట్యాంకర్స్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ వంటి పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 16 ఏళ్ల అనుభవం తర్వాత కెప్టెన్‌గా ఎదిగారు.

ఓడ నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సరుకు రవాణా, లోడింగ్, ట్యాంకుల శుభ్రత వంటి పనులకు ఒక్కోసారి తొమ్మిది నెలల సమయం కూడా పడుతుంది. ప్రయాణంలో అనుకోని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతాయి. రీతూ కెరీర్‌లో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఓడ ప్రయాణిస్తుండగా గైరో కంపాస్ పనిచేయడం ఆగిపోయింది. ఇరుకైన సముద్ర మార్గాన్ని దాటాల్సిన పరిస్థితి. చుట్టూ ఇతర నౌకలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మాగ్నెటిక్ కంపాస్ సాయంతో, పరిసరాలను నిరంతరం గమనిస్తూ ఓడను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు.

మరో ప్రయాణంలో ఐదు రకాల సరుకులను ఐదు పోర్టుల్లో ఐదుగురు రిసీవర్లకు చేరవేయాల్సి వచ్చింది. పోర్టుల మధ్య కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటల వ్యవధి మాత్రమే ఉండేది. దీంతో సుమారు 15 రోజులపాటు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సమయపాలన, సమన్వయం, నైపుణ్యంతో బాధ్యతలు నిర్వహించేవారు. ఆమె క్రమశిక్షణ, అనుభవం, పనితీరుకు గుర్తింపుగా ‘మారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా’ శక్తి రత్న పురస్కారంతో సత్కరించింది.


ఓడే నా నివాసం

సముద్రంపై జీవించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అంటారు రీతూ. సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండటంతోపాటు, వివిధ ప్రాంతాలకు చెందిన సిబ్బందితో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం నిత్యజీవితంలో భాగమవుతాయని చెబుతారు. ‘నేను ఓడలో పనిచేయడం మాత్రమే కాదు.. అక్కడే జీవిస్తున్నాను’ అని తన అనుభవాన్ని వివరిస్తారు. నౌకాయాన రంగంపై గ్రామీణ ప్రాంతాల యువతులకు అవగాహన తక్కువగా ఉందని రీతూ అంటారు. ‘ఈ రంగం గురించి నాకు కూడా మొదట్లో ఏమీ తెలియదు. అయినా ఇందులో అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఇందుకు 16 ఏళ్లు పట్టింది. యువతులు కూడా తమకు పరిచయం లేని విభిన్న రంగాలను ఎంచుకోవాలి. సవాళ్లను ఎదుర్కొంటూ నైపుణ్యాలను పెంచుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి’ అని ఆమె సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్