మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభినవ దుర్గలు.. అన్యాయంపై పిడికిళ్లు...

11 గంటల క్రితం

842611588_939576878910636_4238250225287957393_n.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 03:10 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎప్పుడు సమాజం అస్తవ్యస్తం అవుతుందో అప్పుడు, ఎప్పుడు అక్రమాలూ అన్యాయాలూ తమకు ఎదురే లేదని విర్రవీగుతాయో అప్పుడు, తమ బలిమితోనూ బలగంతోనూ ఏమైనా చేయగలుగుతామని ఆధిపత్య శక్తులు కన్నుమిన్ను గానక కండకావరం ప్రదర్శిస్తాయో అప్పుడు... ఆ విర్రవీగుడుకు, కండకావరాలకు ముకుతాడు వేసే కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. సమాజంలో సగభాగంగా వర్థిల్లే మహిళాశక్తులు ఏ కాలంలోనైనా ఆ కాలపు కర్తవ్యాన్ని తలదాల్చి, అన్యాయాలను ఎదిరిస్తాయి. అక్రమార్కులు అబద్ధాలు వల్లించినా, దాడులకు బరితెగించినా, తమ బలాన్ని ప్రయోగించి అణచివేత చర్యలకు బరితెగించినా... భయపడక, వెనుదిరక్క మున్ముందుకు పయనిస్తాయి. ప్రజాకంటకుల భరతం పట్టి జయజయధ్వానాల మధ్య విజయకేతనాలను ఎగురవేస్తాయి.

దసరా సందర్భంగా దుర్గాదేవిని శక్తికి ప్రతిరూపంగా ఆరాధిస్తాం. అన్యాయాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టిన అమ్మవారిగా కొలుస్తాం. నేటి సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న యువతులు ఆ సజీవ స్త్రీశక్తికి ప్రతిరూపాలు. 2026 జూలైలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యావ్యవస్థలోని సమస్యలపై మొదలైన యువత నిరసనలు, పార్లమెంటు వైపు సాగిన మార్చ్‌, పోలీసుల అణచివేత చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అక్టోబరులో ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై నిరసనలు మరోసారి జంతర్‌మంతర్‌ను ఉద్యమ కేంద్రంగా మార్చాయి. మహిళల భద్రత, ప్రజాస్వామ్య హక్కులు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై ఈ యువతుల పోరాటాలు దసరా పండుగలోని శక్తి ఆరాధనకు సామాజిక అర్థాన్ని చేకూరుస్తున్నాయి.

Tense Protest Crowd Confrontation.jpg

ఐషీ ఘోష్‌, నేహా బోరా...

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ ఈ ఉద్యమాల్లో ప్రముఖంగా కనిపిస్తున్న యువ తరంగం. దేశ సమైక్యత, సామరస్యం ఆవశ్యకతపైనా, మతోన్మాద శక్తుల ప్రమాదంపైనా స్పష్టమైన భావాలు వినిపిస్తారు ఐషీ. ఇది గిట్టని ఉన్మాద శక్తులు 2020 జనవరి 5న జేఎన్‌యూలో ఆమెపై దాడి చేశాయి. అయినా, ఆమె భయపడలేదు. మరింత ధైర్యంగా విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య వాతావరణం కోసం ఆమె తన గొంతును వినిపిస్తూనే ఉన్నారు. నీట్‌ అవకతవకలపైనా, ఎన్నికల సంఘం పనితీరుపైనా బలమైన ప్రశ్నలు సంధిస్తూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. బలవంతంగా నిరసనలను అడ్డుకోవడం ద్వారా ప్రజల ప్రశ్నలను ఆపలేరని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరొక ముఖ్య గళం ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, వివిధ నగరాల్లో విద్యార్థి సమూహాలను ఉత్తేజపరుస్తున్నారు. జెన్‌ జీ ఉద్యమంలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం, నిర్బంధాలను అధిగమించి ముందుకు సాగటం ప్రజాస్వామ్యవాదులకు ఉత్సాహాన్నిస్తోంది. పాలకుల ఎదురుదాడిని వారు ఎదుర్కొంటున్న తీరు కూడా ముచ్చట గొలుపుతోంది. ఒక విద్యార్థినిని పోలీసులు చుట్టుముట్టి కొడుతుంటే, ఒక అమ్మాయి అడ్డంగా నిలబడి ఆ దారుణాన్ని ఎదిరించటం, దాడి నుంచి తమను తప్పించుకోవటంగా కాక తోటివారిని రక్షించే ప్రయత్నం చేయటం, ఎంతటి అధికారానికైనా భయపడకుండా ప్రశ్నించటం వంటి ఉత్తేజకర దృశ్యాలు జెన్‌ జీ ఉద్యమానికి సరికొత్త బలాన్ని, నైతిక స్థైర్యాన్ని అందిస్తున్నాయి. బృందా కారత్‌, షబానా ఆజ్మీ, సుభాషిణి ఆలీ వంటి సీనియర్‌ నాయకులు అమ్మల్లా ఉద్యమ క్షేత్రాల్లో నలుమూలలా కలియదిరుగుతూ నవతరానికి భరోసాగా నిలవటం ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పోలీసులు నిరంకుశంగా అడ్డుకుంటూ ఉంటే ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని చేతపట్టి పరుగులు తీసిన కేరళ విద్యార్థి కార్యకర్త పవిత్ర, పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నా నినదిస్తున్న నదియా, ముంబైలో విద్యార్థులను బంధించి తీసుకుపోతున్న పోలీసు వ్యానుకు అడ్డంగా నిలబడి ఒంటిచేత్తో నిలదీసిన రియా అహిర్‌ వంటి వారు నిరంకుశాసురపై పోరాటంలో అభినవ దుర్గలుగా నిలిచిపోతారు.

Joyful Runner with SFI Flag.jpg

నిజాలను వెలికితీసి...

రెండో విడత సాగుతున్న జెన్‌ జీ ఉద్యమానికి తమ సాహసోపేత పరిశోధన ద్వారా అస్త్రాలు అందించిన మహిళా జర్నలిస్టులు రికితా చోప్రా, దామిని నాథ్‌. ఎస్‌ఐఆర్‌ అనే ప్రక్రియ దుర్మార్గమైనది, దురుద్దేశపూరితమైనదని బీహార్‌ ఎన్నికల ముందు నుంచీ విపక్షాలు చెబుతున్నప్పటికీ, ఆ ప్రమాదం ఎలా ఉంటుందో సోదాహరణంగా బట్టబయలు చేశారు వీరు. పెట్టుబడి మీడియా స్వతంత్రతను కోల్పోయి, అధికార పక్షానికి దాసోహమైపోయిందని విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. రికిత, దామిని చేసిన పరిశోధన చాలా గొప్పది. కాగా, నిరసనలను కవర్‌ చేస్తున్న మహిళా జర్నలిస్టులు పోలీసుల నుంచి అనుచిత ప్రవర్తన, వేధింపులు ఎదుర్కొంటున్నారు. అక్టోబరు 3న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన నిరసనను కవర్‌ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఢిల్లీ పోలీసు సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అక్టోబరు 8న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా ఈ ఘటనపై విచారణకు ఉపక్రమించి ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది. రానా అయ్యూబ్‌, జాగృతి త్రిషా, అనుష్క భరద్వాజ్‌ వంటి జర్నలిస్టులు ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టు లోకానికి చూపించి, పాలకుల అబద్ధపు ప్రచారాలను పూర్వపక్షం చేస్తున్నారు. అలాగే, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనడంతోపాటు, అక్కడ జరుగుతున్న పరిణామాలను చిత్రీకరించి ప్రజల ముందుకు తీసుకురావడంలోనూ అవాంశిక సింగ్‌ వంటి యువతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలను ఆధారాలతో నమోదు చేయడం ఎంత ముఖ్యమో జెన్‌ జీ తమ ఆచరణతో చాటిచెప్పింది.

అన్యాయం జరిగినప్పుడు స్పందించడం, బాధితులకు అండగా నిలవడం, నిరంకుశ నిర్బంధ చర్యలను ప్రశ్నించడం, ప్రజలకు నిజాలు తెలియజేయడం వంటి విభిన్న రూపాల్లో నేడు మహిళల పోరాట స్ఫూర్తి వ్యక్తమవుతోంది. దసరా సందర్భంగా వీరిని గుర్తుచేసుకోవడం అంటే పండుగలోని శక్తి భావనను సామాజిక బాధ్యతతో అనుసంధానించడమే! ఎందరో అభినవ దుర్గలు... వారందరికీ అభినందనలు!

Rainy Standoff with Transport Van.jpg


Indian Woman Protesting Before Delhi Bus.jpg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్