స్కూల్లో టీచర్ తనతో ప్రేమగా మాట్లాడిందా? లేక చెప్పిన పాఠాన్ని చదవలేకపోతే తిట్టిందా? తనకిష్టమైన స్నేహితులతో ఎలా ఆడుకున్నదీ.. లంచ్ బాక్సులో పెట్టిన స్నాక్స్ నలుగురికీ పెట్టి తను తిన్నదీ.. ఇలా స్కూల్లో జరిగిన ప్రతి విషయాన్ని చిన్నారులు ఇంటికొచ్చి తమ తల్లిదండ్రులతో చెబుతారు. ఒకవేళ పనిలో ఉండి వాళ్లు వినకపోతే వినేదాకా వెంటపడతారు. అలాంటి చిన్నారులు ఇప్పుడు తల్లిదండ్రులు వారికి సమయం ఇవ్వకపోవడంతో.. వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆశ్రయిస్తున్నారు. స్కూలు నుంచి వచ్చీ రాగానే సెల్‌ని చేతిలో పెట్టుకుని వారికిష్టమైనట్టుగా ఎఐతో మాట్లాడేస్తున్నారు. దీనివల్ల సాంకేతికతకు మరింత దగ్గరై వారి తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. చిన్నారులు మానసిక రుగ్మతలకు గురవుతారు. ఇలా ఉంటే భవిష్యత్తులో చిన్నారులతో సహా పెద్దలు కూడా తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సైకాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు.
ఉదాహరణకు ఓ చిన్నారి తన సమస్యను స్నేహితునితో పంచుకుంటే.. వారి సంభాషణ వల్ల ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. అలాగే పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో టీచర్ చెప్పిన పాఠాల్ని మళ్లీ చదవకపోవడం వల్ల పరీక్ష ఎలా రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నప్పుడు తన స్నేహితులే ధైర్యం చెబుతారు. పరీక్షల్ని ఎలా రాయాలో.. ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ముందే ఊహించి వారిని సన్నద్ధుల్ని చేస్తారు. పరీక్షల్లో స్నేహితుడు మంచి మార్కులు సాధించడానికి మరో స్నేహితుడు బాధ్యత వహిస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎంతో బాధ్యతాయుతంగా, ప్రేమగా పెంచే క్రమంలో వారిని నిర్లక్ష్యం చేస్తారు. పిల్లలు చెప్పేది వినరు. వారి భయాందోళనలను లెక్కపెట్టరు. దీనివల్ల పిల్లలు తమ భావాల్ని పంచుకోవడానికి ఒక మనిషి ఉంటే చాలనుకుని వెంటనే ఎఐని వినియోగిస్తున్నారు. దీనివల్ల ఎఐ వారి ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుని తక్షణమే స్పందించి.. సలహాలిస్తుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పిల్లలు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచేది తల్లిదండ్రులే. చాట్ జిపిటిలు వారి సమస్యను అర్థం చేసుకోలేవు. వారి స్థానాన్ని ఇవి ఎప్పటికీ భర్తీ చేయలేవు అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఎఐని పిల్లలు ఎలా ఉపయోగించాలి?
టెక్నాలజీని పిల్లలు అస్సలు ఉపయోగించకూడదని కాదు. దాన్ని ఉపయోగించే పద్ధతి పెద్దలే పిల్లలకి నేర్పాలి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎఐని వినియోగించుకోవచ్చు.
కొన్నిసార్లు తమ భావాలను వ్యక్తీకరించడానికి పిల్లలకు పదాలు తెలియవు. భావాలకు సరైన పదాలను కనుగొనడానికి ఎఐని ఉపయోగించుకోవచ్చు.
ఎఐ వల్ల చదువుకుని మెరుగుపరుచుకోవచ్చు. పాఠ్యాంశాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఎఐ వల్ల ఉపయోగాలే ఉన్నాయి.
తల్లిదండ్రులెలా ప్రవర్తించాలి?
తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర కఠినంగా ప్రవర్తించకూడదు. వారితో సున్నితంగా మాట్లాడాలి. ఓ స్నేహితుల్లా మెలగాలి. ప్రత్యేకించి వారి దగ్గర ఎలా మాట్లాడుతున్నారు.. భాష తీరును పరిశీలించుకోవాలి. పిల్లలకు చెప్పేటప్పుడు ఓ పాఠంలా చెప్పకూడదు.
పిల్లలు చెప్పేటప్పుడు పెద్దలు వినాలి. విమర్శించకూడదు. ఒకవేళ వినకపోతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నిజాయితీగా ప్రవర్తించరు.
బాధ కలిగినప్పుడు ఎఐ సలహాలనిస్తుంది కానీ.. మానసికంగా ధైర్యానివ్వదు. చేతిలో చెయ్యి వేసి 'నేనున్నా నీకు' అనే భరోసానివ్వదు. తల్లిదండ్రుల స్పర్శే పిల్లలకు మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. ప్రతి సందర్భంలోనూ చేయిపట్టి నడిపించేందుకు మేమున్నామనే భరోసా తల్లిదండ్రులు పిల్లలకివ్వాలని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడ్డారు.
మెరుగైన విద్య, మంచి బట్టలు, సౌకర్యాలు తల్లిదండ్రులు కల్పించినా 'బల్లి గోడపైనే ఎందుకు పాకుతుంది? చేప నీటిలో ఎందుకీదుతుంది? వారి కంటికి కనిపించేవి అలానే ఎందుకు?' అనే ప్రశ్నను పిల్లలు తమ దగ్గర అడిగేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలని సైకాలజిస్టులు సూచించారు.
రాత్రిపూట పిల్లలతో కలిసి భోజనం చేయడం, టీవీ చూడడం, పక్కనే ఉండి నిద్రపుచ్చితే పిల్లలు ఫోన్లకు దూరంగా ఉంటారు. ఒకవేళ వాడినా ఎక్కువసేపు వాటిని ఉపయోగించరు.
ఆందోళనలు, పొరపాట్లు, భయాలు, విమర్శలకు భయపడకుండా ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణం కల్పించాలి. ‘ఈ విషయం చెప్పి నాతో మంచి పని చేశావ్’ అన్న మాట కూడా పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాంటి మెచ్చుకోలు మాటలు కూడా తల్లిదండ్రులు చెప్పడం అవసరం. పిల్లలు ఎఐతో సులభంగా మాట్లాడవచ్చు. కానీ ప్రేమ, నమ్మకం ఎఐ ఇవ్వదు. తల్లిదండ్రులకెదురైన అనుభవాలతో పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. దానికెప్పుడూ ఎఐ సాటికాదు అని సైకాలజిస్టులు చెప్పారు.








కామెంట్లు (0)