పుస్తకం అంటే మాట్లాడని ఒక మహా వక్త. నిరంతరం తోడుండే ఒక నేస్తం. అలాంటి వేలాది పుస్తకాలు యుద్ధోన్మాదానికి ధ్వంసమయ్యాయి. భవనాలు కుప్పకూలడంతో భద్రంగా ఉన్న పుస్తకాలు శిథిలాల కిందికి చేరిపోయాయి. ఇప్పుడు అలాంటి పుస్తకాలను ప్రేమగా వెలికితీసి, ఆశగా మళ్లీ పిల్లల చేతుల్లో పెడుతున్న దృశ్యాలు గాజాలో కనిపిస్తున్నాయి. జ్ఞానమే మనిషికి వెలుగు అని చాటి చెబుతున్నాయి.
2023 అక్టోబరులో గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇళ్లు, పాఠశాలలు, గ్రంథాలయాలు బాంబు దాడుల్లో నేలమట్టమయ్యాయి. అలమరల్లో అందంగా అమర్చిన పుస్తకాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు తీస్తున్న సమయంలో వాటిని బయటకు తీసే పరిస్థితి ఎవరికీ లేదు. పుస్తకాలు కూడా యుద్ధం తాలూకు విధ్వంసంలో భాగమయ్యాయి. యునిసెఫ్ అంచనా ప్రకారం ఇజ్రాయిల్ దాడుల్లో 98 శాతం పాఠశాలలు నేలమట్టమయ్యాయి. 2023 అక్టోబరు నుంచి ఏడు లక్షల మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరమయ్యారు. అదే యుద్ధంలో బెయిట్ లాహియాకు చెందిన మహ్మద్ సాద్ (54) తన జీవితకాలం సేకరించిన పుస్తకాలను కోల్పోయారు. 35 ఏళ్లుగా పుస్తకాలను సేకరిస్తున్న ఆయన యుద్ధానికి ముందు తన గ్రంథాలయంలో 50 వేల నుంచి లక్ష వరకు పుస్తకాలను భద్రపరిచారు. 2023 డిసెంబరు 7న బాంబు దాడుల్లో ఆ గ్రంథాలయం ధ్వంసమైంది. యుద్ధం కారణంగా మహ్మద్ 16 సార్లు స్థావరాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయినా పుస్తకాలపై ఆశ వదులుకోలేదు.
దాదాపు రెండేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత 2025లో కాల్పుల విరమణ పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమ ప్రాంతాలకు తిరిగి రావడం ప్రారంభించారు. పిల్లలు మళ్లీ పాఠశాలలకు వెళ్లే ప్రయత్నం మొదలైంది. ఇదే సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న పుస్తకాలను వెతికే పనీ మొదలైంది. మహ్మద్ లాహియాకు తిరిగి వచ్చిన తర్వాత తన ఇంటి శిథిలాల మధ్య పుస్తకాల కోసం వెతికారు. గుట్టలుగా పేరుకుపోయిన రాళ్లను పక్కకు తొలగిస్తూ చివరకు వాటి జాడ కనిపెట్టారు. దుమ్ము, ధూళితో కప్పబడిన పుస్తకాలు ఆయన చేతికి తగిలాయి. వాటిలో సుమారు 12 వేల పుస్తకాలను మాత్రమే కాపాడగలిగారు. మిగిలినవన్నీ పనికిరాకుండా పోయాయి.

ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మహ్మద్ మిగిలిన పుస్తకాలను కాపాడేందుకు ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దానికి ‘అథర్’ అని పేరు పెట్టారు. ‘అథర్’ అంటే ‘ప్రభావం’ అని అర్థం. మహ్మద్, ఆయన కొడుకు కలిసి దెబ్బతిన్న పుస్తకాలకు మరమ్మతులు చేశారు. చిరిగిన పేజీలను అతికించారు. ఊడిపోయిన అట్టలను సరిచేశారు. అయితే పుస్తకాలను కాపాడి దాచిపెట్టడం ఆయన లక్ష్యం కాదు. అవి అవసరమైన వారికి, ముఖ్యంగా చిన్నారులకు చేరాలన్నదే ఆయన ఆశయం. ఇప్పుడు ‘అథర్’కు పిల్లలు క్రమం తప్పకుండా వస్తున్నారు. తమకు ఇష్టమైన పుస్తకాలను చదువుకుంటూ యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి కొంతసేపైనా దూరమవుతున్నారు. మహ్మద్ వీలైనంత వరకు పుస్తకాలను ఉచితంగానే అందిస్తున్నారు. నామమాత్రపు ధరకు ఉంచినా వాటిని కొనుగోలు చేసే స్థోమత లేని కుటుంబాలు అక్కడ ఎన్నో ఉన్నాయి.
కాల్పుల విరమణ తర్వాత పుస్తకాలను కాపాడే మరో ప్రయత్నం కూడా గాజాలో మొదలైంది. యుద్ధం కారణంగా బెయిట్ హనూన్ నుంచి అనేక ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిన ఒమర్ హమద్ (30), గాజా వ్యాప్తంగా శిథిలమైన గ్రంథాలయాల కోసం వెతకడం ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న పుస్తకాలను సేకరించారు. కొంతమంది తమ సొంత గ్రంథాలయాల నుంచి కూడా పుస్తకాలను అందించారు. బాంబుదాడుల్లో మరణించిన వ్యక్తులు సేకరించిన పుస్తకాల గురించి కూడా ఒమర్ ఆరా తీశారు. ఇప్పటి వరకు ఆయన, ఆయన బృందం మూడు వేల పుస్తకాలను సేకరించింది. వాటిలో 1956లో ముద్రించిన ‘ద కాటాస్ట్రోఫ్ ఆఫ్ పాలస్తీనా’ కూడా ఉంది. శిథిలమైన ఇస్లామిక్ యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి కూడా పుస్తకాలను బయటకు తీశారు.
ఈ పుస్తకాలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడంలో 45 ఏళ్ల అనుభవం ఉన్న 71 ఏళ్ల జమీల్ మిక్దాద్ సహకరిస్తున్నారు. పుస్తకాలను శుభ్రం చేయడం, పేజీలను సరిచేయడం, బైండింగ్ చేయడం వంటి పనులను ఆయన చేస్తున్నారు. అలా సిద్ధం చేసిన పుస్తకాలతో ఒమర్ ‘ఫీనిక్స్ లైబ్రరీ’ని నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఆ పుస్తకాలలో ఒకటి ఇప్పుడు పదేళ్ల ఆయా అల్ షావా చేతిలో ఉంది. ఆరో తరగతిలో కూర్చున్న ఆమె తన చేతిలోని ఆ పుస్తకాన్ని చదువుతోంది. ఒకప్పుడు అలమరలో ఉన్న ఆ పుస్తకం.. యుద్ధం, శిథిలాలు, దుమ్ము, చిరిగిన పేజీలు దాటి చివరకు ఓ చిన్నారి చేతికి చేరింది. అయితే గాజాలో పుస్తకాలను కాపాడుతున్నవారు వాటన్నింటినీ కొత్తవాటిలా మార్చడం లేదు. బుల్లెట్ గాయాలు, యుద్ధపు మరకలు కనిపించే పుస్తకాలను అలాగే భద్రపరుస్తున్నారు. అవి విధ్వంసానికి సాక్ష్యాలుగా మిగలాలని కోరుకుంటున్నారు. యుద్ధం జీవితాల నిండా చీకటిని కుమ్మరిస్తే.. పుస్తకాలతో వెలుగును నింపుకోవడానికి అక్కడి ప్రజలు మళ్లీ సన్నద్ధమవుతున్నారు.








కామెంట్‌లు (0)