పిల్లల్ని ఎలా పెంచాలి? అనే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పిల్లల పెంపకంలో ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? ఎప్పుడు వెనక్కి తగ్గాలి? అనేది గుర్తించడం ముఖ్యమని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ ఒబామా అంటున్నారు. పిల్లలు తమపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే తీర్చిదిద్దుకునేలా చేయడమే తల్లిదండ్రుల అంతిమ లక్ష్యం కావాలని ఆమె సూచిస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ జే షెట్టి నిర్వహించే 'ఆన్ పర్పస్' కార్యక్రమంలో ఆమె పిల్లల పెంపకంపై మాట్లాడారు.
స్కూల్‌కు వెళ్లే వయసులో పిల్లలకు షూ లేస్లు కట్టడం దగ్గర నుంచి చిన్న చిన్న పనుల్లో తల్లిదండ్రులు సహాయం చేస్తారు. కానీ పిల్లలు తమపై ఆధారపడకుండా, ఇంటి నుంచి బయటకు వెళ్లేలోపే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా పెంచాలి. పెద్దయ్యాక అన్నీ వాళ్లే నేర్చుకుంటారనుకోవడం పొరపాటు. చిన్న వయసు నుంచే బిల్లులు కట్టడం, బయట నుంచి ఇంటికి అవసరమైన వస్తువులు తెప్పించడం వంటి బాధ్యతలు అప్పగించాలి. ఇవి చిన్న పనులుగా కనిపించినా బాధ్యతను నేర్పుతాయి. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వకుండా, అవసరమైన హద్దులు కూడా విధించాలని మిచెల్ సూచించారు.
చిన్నప్పటి నుంచే బాధ్యత
పిల్లలకు చిన్న వయసులోనే పరిమితులను నేర్పాలి. ఐదేళ్లు ఉన్నప్పుడే వారు అడిగినదల్లా చేయకుండా అవసరమైన చోట 'నో' చెప్పాలి. పరిమితులను పాటించడం అలవాటు చేసుకున్న పిల్లలు భవిష్యత్తులో కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని, నైపుణ్యాలను పెంచుకుంటారని మిచెల్ అన్నారు. అప్పటివరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుని, 18 ఏళ్లు రాగానే స్వతంత్రంగా ఉండమంటే వారికి కష్టం. అందుకే చిన్నప్పటి నుంచే బాధ్యతతో మెలగడం నేర్పాలని ఆమె సూచించారు. పిల్లలు 10, 13 ఏళ్ల వయసుకు వచ్చేసరికి వారు చేస్తున్న తప్పుల గురించి వారితో మాట్లాడాలి. తల్లిదండ్రులు వారి తరఫున ప్రతి నిర్ణయం తీసుకోకుండా, క్రమంగా ఆ బాధ్యతను పిల్లలకే అప్పగించాలి. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ వారి నిర్ణయాలను వారినే తీసుకోనివ్వాలి. తన కూతుళ్ల నిర్ణయాలను తాను అంగీకరించాల్సి వచ్చిందని మిచెల్ గుర్తు చేసుకున్నారు.
చదువుకునే స్కూల్, కాలేజీ లేదా జీవిత భాగస్వామి ఎంపిక వంటి విషయాల్లో పిల్లలు తీసుకునే నిర్ణయాలు తల్లిగా తనకు నచ్చకపోవచ్చు. అయినా అవి వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలని, వాటిని వారికే వదిలేయాలని ఆమె అన్నారు. ఏళ్ల తరబడి పిల్లలను తప్పులు చేయకుండా కాపాడుతూ వచ్చి, ఒక్కసారిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోమంటే తల్లిదండ్రులు భయపడవచ్చు. కానీ పిల్లల్లో ధైర్యం నింపడానికి ఇదొక మార్గమని మిచెల్ సూచించారు.
పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే మందలించకుండా, ఆ తప్పు ఎందుకు జరిగిందో ప్రశాంతంగా వారితో మాట్లాడాలి. దాని పర్యవసానాలను వారు స్వయంగా అనుభవించినప్పుడే ఆ అనుభవం నుంచి నేర్చుకుంటారు. 'తప్పు ఎందుకు చేశావు?' అని ప్రశ్నించడం కంటే, 'దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు?' అని అడగాలని మిచెల్ సూచించారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే వారు చేసే ప్రతి పనికీ మద్దతు ఇవ్వడం కాదు. వారి నిర్ణయాలను వారికే వదిలేస్తూ, అవసరమైనప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
జీవితంలో వైఫల్యాలు లేకుండా ఉండవు. పిల్లలు ఎప్పుడూ విఫలం కాకుండా కాపాడటం సాధ్యం కాదు. అందుకే తమ పనులను తామే చేసుకునేలా, నిర్ణయాలు స్వయంగా తీసుకునేలా వారిని పెంచాలి. 'దీన్ని నేనే చేశాను' అని పిల్లలు చెప్పగలిగితే, వారు స్వతంత్రంగా ఎదుగుతున్నట్లే అని మిచెల్ ఒబామా చెప్పారు. ఏ తప్పూ చేయని పౌరులుగా పిల్లల్ని పెంచడం కంటే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, అవి విఫలమైనప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొని నిలబడేలా చేయడమే తల్లిదండ్రుల చివరి లక్ష్యం అని ఆమె అన్నారు.








కామెంట్‌లు (0)