‘ఈ వయసులో నీకిది సాధ్యం కాదు’ అన్న మాట చాలా సాధారణంగా వింటుంటాం. జమ్ములో నివసిస్తున్న విద్యా కౌర్ కూడా అలాంటి మాటలే విన్నారు. 59 ఏళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లిన ఆమెను, వయసును అడ్డంకిగా చూపిస్తూ డ్రైవింగ్ స్కూల్ నుంచి వెనక్కి పంపించారు. అయితే నాలుగు దశాబ్దాలపాటు అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె ఆ తిరస్కరణతో నిరుత్సాహపడలేదు. అది తన పట్టుదలను మరింత పెంచింది. సొంతంగా కారు కొనుక్కున్నారు. స్వయంగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె వయసు 72 ఏళ్లు. ప్రస్తుతం జమ్ము వీధుల్లో ఈ బామ్మ ఎంచక్కా కారును తానే నడుపుకుంటూ ప్రయాణిస్తున్నారు.
బిజీ రోడ్లు, ఇరుకైన సందుల్లో కారు నడపడం సాధారణంగా చాలామందికి సవాలే. డ్రైవింగ్ నేర్పించమని స్కూలుకు వెళ్లినప్పుడు విద్యకు కూడా ఇదే కారణం చెప్పి వెనక్కి పంపించారు. కానీ డ్రైవింగ్ ఆమె చిరకాల కల. అధ్యాపకురాలిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన ఆమెకు, తన లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదని అప్పుడే అర్థమైంది. అయినా వెనక్కి తగ్గడం ఆమెకు ఇష్టం లేదు. కారు కొనుక్కొని, ఇంటి పక్కనే ఉండే వ్యక్తి సాయంతో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాలపాటు విద్యారంగంలో పనిచేస్తూ ఇతరుల భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆమె, ఇక తన కోసం, తనకు నచ్చిన జీవితాన్ని గడపాలని ఆ రోజు నుంచే నిర్ణయించుకున్నారు.
అయితే డ్రైవింగ్‌లో పట్టు సాధించడం అంత సులువేమీ కాదు. కొత్త నైపుణ్యం కావడంతో తప్పులు జరిగాయి. ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ విద్య పట్టుదల ముందు అవేవీ నిలవలేకపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే కారు తీసుకుని వీధుల్లో నడపడం మొదలుపెట్టారు. ఇప్పుడు మార్కెట్‌కు వెళ్లాలన్నా, స్నేహితులను పికప్ చేసుకోవాలన్నా, పార్కులు, సినిమాలకు వెళ్లాలన్నా, కారు తీసుకుని స్వయంగా బయలుదేరుతున్నారు.
విద్య ప్రయాణం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. జీవితంలో ఒక ప్రయాణం ముగిసిందని అనిపించినప్పుడు, మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు. అది సులభంగా ఉండకపోవచ్చు. తప్పులు జరగొచ్చు. కానీ వాటిని సరిదిద్దుకుంటూ, నిరంతరం సాధన చేస్తే కొత్త ప్రపంచం మన దగ్గరకు వస్తుంది.
59 ఏళ్ల వయసులో ఎదురైన తిరస్కరణను పట్టుదలగా మార్చుకున్న విద్య, 72 ఏళ్ల వయసులో తన చిరకాల కలను సాకారం చేసుకున్నారు. ఆమె కలను నెరవేర్చుకోవాలన్న తెగువకు ఇప్పుడు నాలుగు చక్రాలు తోడయ్యాయి. కలలకు వయసు ఉండదు. వాటిని సాధ్యం చేసుకోవాలన్న పట్టుదల ఉంటే చాలని విద్య జీవితం చెబుతోంది.








కామెంట్‌లు (0)