పాఠాన్ని చదువుతున్నప్పుడు అంతా అర్థమైనట్టే అనిపిస్తుంది. కానీ, పుస్తకం మూసేసి చెప్పమంటే మాత్రం కొన్ని విషయాలే గుర్తుకొస్తాయి. చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్య ఇది. దీనికి కారణం జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం కాదు; మనం చదివే పద్ధతిలో ఉన్న లోపం అంటున్నారు విద్యావిషయక నిపుణులు. ఒకే విషయాన్ని పదేపదే చదవడం, అండర్‌లైన్ చేయడం, ముఖ్యమైన అంశాలను బట్టీ పట్టడం మాత్రమే సరిపోవు. చదివిన విషయాన్ని పుస్తకం చూడకుండా గుర్తుచేసుకునే అలవాటు కూడా అవసరం. మనోవిజ్ఞానశాస్త్రంలో దీనిని 'యాక్టివ్ రీకాల్' (Active Recall) అంటారు. అంటే ఒక పాఠాన్ని చదివిన తర్వాత పుస్తకం మూసేసి, అందులోని విషయాలను మన జ్ఞాపకశక్తి ఆధారంగా తిరిగి గుర్తుచేసుకోవడం. ఈ పద్ధతి చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
యాక్టివ్ రీకాల్‌ను ఆచరించడం చాలా సులభం. ఒక పాఠాన్ని శ్రద్ధగా చదివిన తర్వాత పుస్తకాన్ని మూసేయాలి. అందులోని ముఖ్యమైన అంశాలు ఏమిటి? ప్రధాన భావాలు ఏమిటి? ఏయే విషయాలు వివరించారు? అనే ప్రశ్నలు వేసుకోవాలి. వీలైనంతవరకు సమాధానాలను పుస్తకం చూడకుండా చెప్పాలి లేదా రాయాలి. ఉదాహరణకు సైన్స్‌లో ఒక ప్రక్రియను చదివితే దాని దశలను క్రమంగా గుర్తుచేసుకోవాలి. ఒక ఫార్ములా చదివితే దానిని చూడకుండా రాసి, అందులోని సంకేతాల అర్థాలను వివరించాలి. చరిత్ర పాఠమైతే ముఖ్యమైన సంఘటనలు, వాటి తేదీలు, కారణాలు, ఫలితాలను గుర్తుచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఏ అంశాలు బాగా గుర్తున్నాయి, దేనిపై ఇంకా శ్రద్ధ పెట్టాలో తెలుస్తుంది. మళ్లీ మళ్లీ చదవడం కంటే చదివిన విషయాన్ని జ్ఞాపకం నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయడం మెదడుకు మంచి వ్యాయామం. ఈ ప్రక్రియనే 'రిట్రీవల్ ప్రాక్టీస్' (Retrieval Practice) అంటారు.
యాక్టివ్ రీకాల్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి 'బ్లాంక్ పేజ్ మెథడ్' (Blank Page Method) అనే విధానం ఉంది. ఒక పాఠం చదివిన తర్వాత ఖాళీ కాగితం తీసుకుని, ఆ పాఠంలో మనకు గుర్తున్న విషయాలన్నింటినీ సొంత మాటల్లో రాయాలి. తర్వాత పుస్తకం తెరిచి మనం రాసినదానితో పోల్చుకోవాలి. ఏ అంశాలు మర్చిపోయాం? ఎక్కడ తప్పుగా రాశాం? ఏ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం? అనేది పరిశీలించాలి. గుర్తులేని అంశాలను మరోసారి చదివి, మళ్లీ రాసే ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో మనకు మనమే పరీక్ష పెట్టుకున్నట్టవుతుంది. దీనివల్ల చదివిన విషయం ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు గుర్తుందో స్పష్టంగా తెలుస్తుంది.
ఈ అభ్యసన పద్ధతులకు సంబంధించి మరో ఆసక్తికరమైన విధానం 'ఫేన్మన్ టెక్నిక్' (Feynman Technique). అమెరికాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫేన్మన్ 1965లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. క్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సైతం చాలా సరళంగా వివరించడం ఆయన ప్రత్యేకత. ఒక విషయాన్ని నిజంగా అర్థం చేసుకున్నామంటే దాన్ని సాధారణ భాషలో మరొకరికి వివరించగలగాలని ఆయన అభ్యసన విధానం తెలియజేస్తుంది. ఈ స్ఫూర్తితో ప్రాచుర్యంలోకి వచ్చిన ఫేన్మన్ టెక్నిక్‌లో ఒక అంశాన్ని చదివిన తర్వాత దాన్ని మనకు అర్థమైన భాషలో వివరించాలి. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) గురించి చదివితే, మొక్కలు ఆహారాన్ని ఎలా తయారుచేసుకుంటాయో అర్థమయ్యేలా చెప్పగలగాలి. వివరించేటప్పుడు ఎక్కడైనా తడబడితే ఆ అంశంపై మనకు ఇంకా పూర్తి అవగాహన రాలేదని గుర్తించి, తిరిగి చదవాలి. ఇలా క్లిష్టమైన విషయాలను సరళంగా వివరించే ప్రయత్నం చేస్తే వాటిపై మంచి పట్టు ఏర్పడుతుంది.

ఏడు రోజులు... ఇలా చేయండి!
ఈ పద్ధతులను ఒకేసారి అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. రోజుకు కొంత సమయం కేటాయిస్తూ ఏడు రోజులపాటు ఈ ప్రణాళికను అనుసరించండి.
1వ రోజు : ఒక చిన్న పాఠాన్ని ఎంచుకోండి. దాన్ని శ్రద్ధగా చదవండి. అర్థంకాని పదాలు, భావాలను గుర్తించండి. ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోండి.
2వ రోజు : ముందురోజు చదివిన పాఠాన్ని మళ్లీ చూడకుండా అందులోని ముఖ్యాంశాలను గుర్తుచేసుకోండి. మీకు మీరే ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకోండి. ఇదే యాక్టివ్ రీకాల్.
3వ రోజు : పాఠాన్ని చూడకుండా అందులోని ముఖ్యమైన విషయాలను ఒక తెల్ల కాగితంపై రాయండి. ఆ తర్వాత పుస్తకంతో పోల్చి తప్పులు, మర్చిపోయిన అంశాలను గుర్తించండి.
4వ రోజు : చదివిన అంశాన్ని మీ స్నేహితుడికో, తల్లిదండ్రులకో చెబుతున్నట్లు వివరించండి. ఎక్కడైనా చెప్పలేకపోతే ఆ భాగాన్ని మళ్లీ చదవండి. ఫేన్మన్ టెక్నిక్‌లోని ప్రధాన ఉద్దేశం ఇదే.
5వ రోజు : పాఠంలోని ముఖ్యాంశాల ఆధారంగా మీరే ప్రశ్నలు తయారుచేసుకోండి. పుస్తకం చూడకుండా వాటికి సమాధానాలు రాయండి. ఫార్ములాలు, నిర్వచనాలు, ముఖ్యమైన తేదీలను ప్రత్యేకంగా సాధన చేయండి.
6వ రోజు : పుస్తకం, నోట్సు పక్కన పెట్టి ఆ పాఠంపై మీకు మీరే పరీక్ష పెట్టుకోండి. గుర్తున్న అంశాలు, తప్పుగా రాసిన సమాధానాలు, ఇంకా సాధన చేయాల్సిన విషయాలను గుర్తించండి.
7వ రోజు : వారం రోజులుగా నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తుచేసుకోండి. మర్చిపోయిన విషయాలను తిరిగి చదవండి. వాటిని చూడకుండా చెప్పడానికి, రాయడానికి ప్రయత్నించండి.
ఈ ఏడు రోజుల ప్రణాళికను ప్రతి కొత్త పాఠానికి అనుగుణంగా మార్చుకుని అనుసరించవచ్చు. పాఠం పరిమాణాన్ని బట్టి రోజుకు 15 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. అలాగే ఒకే రోజులో అన్నీ గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నించకుండా, చదివిన విషయాలను మరుసటి రోజు, మూడు రోజుల తర్వాత, వారం తర్వాత తిరిగి గుర్తుచేసుకోవడం మంచిది. దీనిని 'స్పేస్డ్ రిపిటిషన్' (Spaced Repetition) అంటారు. అంటే నిర్ణీత విరామాలతో పునరావృతం చేయడం అన్నమాట. పుస్తకాన్ని ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. అందులోని విషయాలు మనకు ఎంతవరకు గుర్తున్నాయన్నదే ముఖ్యం.








కామెంట్‌లు (0)