ప్రపంచీకరణ మనుషులను ముందుగా వినియోగదారులుగా మార్చింది. ఆ తర్వాత వారినే మార్కెట్‌లో నిత్యం వినిమయ వస్తువులుగా నిలిపింది. బతకడానికి నిరంతరం పరుగులు తీయాల్సిందేననే పరిస్థితిని సృష్టించింది. విశ్రాంతి తీసుకునే వయసులోనూ ఉపాధి కోసం శ్రమించాల్సి వస్తోంది. ఒకప్పుడు ఉద్యోగ విరమణ అంటే జీవితానికి విరామమని భావించేవారు. ఇప్పుడు మాత్రం రిటైర్ అయిన తర్వాతే మరో పోరాటం మొదలవుతోంది. పిల్లలపై ఆధారపడకుండా, అప్పుల భారాన్ని మోస్తూ, కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి అరవై, డెబ్బై ఏళ్ల వయసులోనూ వేలాది మంది సీనియర్ సిటిజన్లు గిగ్ ఎకానమీలో భాగమవుతున్నారు. ఉబెర్ ఆటోలు నడుపుతూ, అమెజాన్ పార్సిళ్లు పంపిణీ చేస్తూ బతుకు తెరువు కోసం పాట్లు పడుతున్నారు.
బెంగళూరుకు చెందిన యాభై ఆరేళ్ల రేష్మ దుస్తుల తయారీ కంపెనీలో షర్టులు కుట్టేది. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేది. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆ కంపెనీ మూతపడటంతో ఆమెకు పని లేకుండా పోయింది. కుటుంబాన్ని పోషించడానికి అమెజాన్‌లో చేరి పార్సిళ్లు డెలివరీ చేసేది. గతంలో ఆమెకు క్యాన్సర్ సోకింది. చికిత్స తీసుకుని మళ్లీ పని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కొడుకుకు మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. వైద్యం కోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. అతను మరణించాడు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. ఆమె పెళ్లి కోసం మైక్రోఫైనాన్స్ కంపెనీల నుంచి రూ.7–8 లక్షలు అప్పు తీసుకుంది. ప్రస్తుతం రోజుకు రూ.700 సంపాదిస్తున్న రేష్మకు ఇంటి అవసరాలు, అప్పులు, కూతురు పెళ్లి ఖర్చులు తీరడం కష్టంగా మారింది. ‘‘అప్పు చేసి నా కూతురికి చెవి పోగులు కొన్నా. వాటికి వడ్డీ పెరిగిపోయింది. చెల్లించలేకపోతున్నాను. ఆ పోగులను తిరిగి ఇచ్చేసే పరిస్థితి వచ్చింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు చనిపోయిన తర్వాత ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా, తాను కూడబెట్టిన కొద్దిపాటి డబ్బును సైతం మద్యానికే ఖర్చు చేస్తున్నాడని రేష్మ చెప్పింది. క్యాన్సర్, కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నా, జీవితంలోని కష్టాలను మాత్రం ఎదుర్కోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఆగని జీవనపోరాటం
61 ఏళ్ల సురేశ్‌కుమార్ 1993లో కోలార్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అతనిపైనే పడ్డాయి. తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టంతో మిగిలిన అప్పులను తీర్చడానికి చదువును మధ్యలోనే ఆపేశాడు. ఆటో కొనుక్కొని నడుపుతూ ముగ్గురు చెల్లెళ్ల చదువులు, పెళ్లిళ్లు చేశాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కూతురు ప్రైవేటు పాఠశాలలో చేరినప్పుడు యూనిఫాం, పుస్తకాలకు కూడా డబ్బు లేకపోవడంతో విద్యా హక్కు చట్టంపై అధ్యయనం చేశాడు. ‘చైల్డ్ రైట్స్ ట్రస్ట్’ నిర్వహించిన సమావేశాలకు హాజరై చట్టాన్ని తెలుసుకున్నాడు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. అతనికి మద్దతుగా తల్లిదండ్రులు నిలిచారు. ‘‘విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకోవాలంటే సురేశ్‌కుమార్‌ను సంప్రదించండి’’ అంటూ ఆటో డ్రైవర్లు తమ ఆటోలపై బ్యానర్లు కట్టి ప్రచారం చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా, రెండు రోజులు జైలులో ఉన్నాడు. ఆ సమయంలో మీడియా తనకు అండగా నిలిచిందని అతను తెలిపాడు. ప్రస్తుతం బెంగళూరు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. పెద్ద కుమార్తె ఇంటర్‌లో 91 శాతం మార్కులు సాధించగా, చిన్న కుమార్తె మెరిట్ స్కాలర్‌షిప్‌పై చదువుతోంది. అయినా వారి చదువులు, ఇంటి అవసరాల కోసం ఈ వయసులోనూ ఆటో నడుపుతున్నాడు.
మరో ఆటో డ్రైవర్ రంగస్వామి చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. రిటైర్‌మెంట్ తర్వాత అప్పులు తీర్చడానికి 66 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్నాడు. ‘‘కుటుంబ అవసరాల కోసం మైక్రోఫైనాన్స్ కంపెనీ వద్ద లక్షన్నర రూపాయలు అప్పు తీసుకున్నాను. ఈఎంఐల కోసం నెలకు రూ.7,500 కట్టాలి. తిండి, ఇంటి అద్దె, మందుల ఖర్చులు... వీటన్నింటినీ భరించడానికి నేను కష్టపడుతున్నాను. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. వారి ఖర్చులు వారికుంటాయి. మా బాధ్యతలు వారికెందుకు? అందుకే నా భార్య, నేను విడిగా ఉంటూ అప్పులు తీర్చుకుంటున్నాం’’ అని అతను చెప్పాడు. యాప్ ఆధారిత విధానంలో పనిచేస్తున్న వీరి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేసే డ్రైవర్ నెలకు రూ.50 వేలు సంపాదించినా, కమిషన్, ఇంధనం, బీమా, నిర్వహణ ఖర్చులు, వాహన ఈఎంఐలు చెల్లించిన తర్వాత చేతికి సుమారు రూ.10 వేలు మాత్రమే మిగులుతుందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఇనాయత్ అలీ తెలిపాడు.
భద్రత లేని శ్రమ
మన దేశ శ్రామికశక్తిలో గిగ్ వర్కర్ల వాటా ప్రస్తుతం 2 శాతానికి పైగా ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. రాబోయే దశాబ్దంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వయసు పైబడిన తర్వాత కూడా జీవనోపాధి కోసం శ్రమించాల్సి రావడం వ్యక్తిగత సమస్యగా చూడలేం. జీవితం చివరి దశలోనూ ఆదాయం కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థలోని అసమానతలను, సామాజిక భద్రత లోపాన్ని వెల్లడిస్తోంది. ప్రపంచీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ పేరుతో అవకాశాలు పెరిగాయని చెబుతున్నా, ఆ అవకాశాల వెనుక శ్రమించే మనుషులకు కనీస భద్రత లేకపోతే ఆ అభివృద్ధికి అర్థం ఏమిటన్నది ప్రశ్న. అభివృద్ధి అంటే మనుషులను జీవితాంతం పరుగులు పెట్టించడం కాదు.. వారు ఒక దశలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించే పరిస్థితులను కల్పించడమే నిజమైన అభివృద్ధి.







కామెంట్‌లు (0)