22 ఏళ్లుగా క్రయోప్రిజర్వేషన్‌లో భద్రపరిచిన పిండం నుంచి ఓ పాప జన్మించడం వైద్యశాస్త్రంలో ఆసక్తికరమైన ఘట్టంగా నిలిచింది. గ్రీస్‌కు చెందిన 54 ఏళ్ల క్రిస్టినా, 60 ఏళ్ల కాన్‌స్టాంటినోస్ దంపతులకు ఇటీవల ఈ పాప జన్మించింది. వారి 21 ఏళ్ల కుమారుడు గతేడాది అక్టోబరులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం తర్వాత వారు 22 ఏళ్ల కిందట ఐవీఎఫ్ చికిత్సలో ఏర్పడిన పిండాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2004 మార్చి 17న భద్రపరిచిన ఆ పిండాన్ని 2025 డిసెంబరు 23న క్రిస్టినా గర్భాశయంలోకి బదిలీ చేశారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత 2026 సెప్టెంబరు 9న 3.49 కిలోల బరువున్న ఆడశిశువు జన్మించింది. కుమారుడి జ్ఞాపకార్థం ఆ పాపకు జార్జియా అని పేరు పెట్టారు. అయితే ఈ కథలో భావోద్వేగం ఎంత ముఖ్యమో, దాని వెనుక ఉన్న శాస్త్రం అంతకంటే ఆసక్తికరం.
అసలు 22 ఏళ్లపాటు ఒక పిండాన్ని ఎలా భద్రపరచగలిగారు? అంతకాలం తర్వాత అది మళ్లీ గర్భంలో అభివృద్ధి చెందడం ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం క్రయోప్రిజర్వేషన్ అనే ఆధునిక వైద్య సాంకేతికతలో ఉంది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. సాధారణంగా మహిళ శరీరంలో అండం, పురుషుడి శుక్రకణం కలిసిన తర్వాత పిండం ఏర్పడుతుంది. ఐవీఎఫ్‌లో మాత్రం ఈ ప్రక్రియను కొంతవరకు ప్రయోగశాలలో నిర్వహిస్తారు. మహిళ నుంచి అండాలను సేకరించి, వాటిని శుక్రకణాలతో కలిపి పిండాలను తయారు చేస్తారు. కొన్ని రోజుల పాటు ప్రయోగశాలలో పెంచిన తర్వాత ఆరోగ్యకరమైన పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టవచ్చు. ఒకే చికిత్సలో ఏర్పడిన అదనపు ఆరోగ్యకరమైన పిండాలను భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భద్రపరచవచ్చు. ఇక్కడే క్రయోప్రిజర్వేషన్ అవసరం వస్తుంది. పిండాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా దాని కణాల్లో జరిగే జీవరసాయన చర్యలను దాదాపు నిలిపివేస్తారు. మన శరీరంలోని కణాలు నిరంతరం శక్తిని వినియోగిస్తూ పనిచేస్తాయి. కణ విభజన జరుగుతుంది. డీఎన్‌ఏకు సంబంధించిన ప్రక్రియలు జరుగుతాయి, ప్రోటీన్లు తయారవుతాయి. ఈ కార్యకలాపాలన్నీ కొనసాగితే కాలక్రమేణా కణాల్లో మార్పులు వస్తాయి. కానీ క్రయోప్రిజర్వేషన్‌లో కణాల జీవక్రియ దాదాపు నిలిచిపోవడంతో పిండం అభివృద్ధి కూడా ఆగిపోతుంది.
మంచు స్ఫటికాలే పెద్ద శత్రువు
పిండాన్ని గడ్డకట్టించడం వినడానికి సులభంగా అనిపించినా, అది చాలా క్లిష్టమైన పని. మన కణాల్లో నీరు అధికంగా ఉంటుంది. నీటిని సాధారణంగా నెమ్మదిగా గడ్డకట్టిస్తే పెద్ద మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. అవి కణాల పొరలను, కణంలోని సున్నితమైన నిర్మాణాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల పిండాన్ని సాధారణ ఫ్రీజర్‌లో పెట్టడం సాధ్యం కాదు. ఐవీఎఫ్ కేంద్రాల్లో దీనికోసం క్రయోప్రొటెక్టెంట్ అనే రక్షణ ద్రావణాలను ఉపయోగిస్తారు. పిండాన్ని ప్రత్యేక ద్రావణాలతో సిద్ధం చేసి అత్యంత వేగంగా చల్లబరుస్తారు. దీంతో పెద్ద మంచు స్ఫటికాలు ఏర్పడకుండా పిండంలోని ద్రవం గాజులాంటి స్థితిలోకి మారుతుంది. ఈ స్థితిని గ్లాసీ స్టేట్ అంటారు. ఇందులో కణాల జీవక్రియ దాదాపు నిలిచిపోతుంది. కణ నిర్మాణాలను భద్రంగా ఉంచేలా శీతలీకరణ జరుగుతుంది. ఈ విధంగా భద్రపరిచిన పిండాన్ని ద్రవ నైట్రోజన్ ఆధారిత క్రయోస్టోరేజ్ వ్యవస్థల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. సాధారణంగా ఇది సుమారు మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో కణాల జీవక్రియ దాదాపు పూర్తిగా నిలిచిపోతుంది.
ఏళ్ల తర్వాత ఈ పిండాన్ని బయటకు తీసినప్పుడు మరో కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. దాన్ని థావింగ్ లేదా వార్మింగ్ అంటారు. గడ్డకట్టిన పిండాన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడం కూడా ఎంతో జాగ్రత్తగా చేయాలి. కణాల్లోని క్రయోప్రొటెక్టెంట్లను కూడా నియంత్రిత విధానంలో తొలగించాలి. పిండం కరిగిన తర్వాత ప్రయోగశాలలో దాని నిర్మాణాన్ని పరిశీలిస్తారు. సక్రమంగా ఉందా, అభివృద్ధి కొనసాగించగలదా వంటి అంశాలను పరీక్షిస్తారు. అనుకూలంగా ఉంటే ప్రత్యేకమైన పలుచని కాథెటర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అక్కడ పిండం గర్భాశయ గోడకు అంటుకోవడాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ విజయవంతమైతే పిండం నుంచి భ్రూణం అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత గర్భధారణ, శిశువు పెరుగుదల సాధారణంగానే కొనసాగుతుంది.
వైజ్ఞానిక అద్భుతం!
దీర్ఘకాలం నిల్వ చేసిన పిండాల నుంచి జనన రేటు ఎలా ఉంటుందన్న అంశంపై పరిశోధనలు జరిగాయి. ఒక పెద్ద సిస్టమాటిక్ రివ్యూలో 18 వేలకుపైగా పిండాల సమాచారాన్ని పరిశీలించారు. నిల్వ కాలం పెరగడం వల్ల జనన రేటు తగ్గుతుందని ఆధారాలేవీ కనిపించలేదు. అయితే పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. సరైన పరిస్థితుల్లో భద్రపరిచిన పిండం దీర్ఘకాలం తర్వాత కూడా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని నిలుపుకోవచ్చు. ఏథెన్స్ ఘటన ఈ సామర్థ్యానికి అత్యంత ఆసక్తికరమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ సాంకేతికత భవిష్యత్తు వైద్యానికి కూడా ఎంతో ప్రాధాన్యమైనది. ఒక ఐవీఎఫ్ చికిత్సలో ఏర్పడిన అదనపు పిండాలను వెంటనే ఉపయోగించాల్సిన అవసరం లేకుండా భద్రపరచుకోవచ్చు. తరువాతి సంవత్సరాల్లో మరోసారి గర్భధారణ కోరుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి చికిత్సల వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉన్నవారికి ముందుగానే పిండాలను భద్రపరచుకోవడం ఒక ముఖ్యమైన ఎంపికగా మారింది. ఈ మొత్తం ప్రక్రియలో అద్భుతం ఏమిటంటే, జీవాన్ని సృష్టించడం మాత్రమే కాదు; జీవం అభివృద్ధి చెందే ప్రక్రియను ఒక దశలో దాదాపు నిలిపివేసి, కొన్ని సంవత్సరాల తర్వాత కొనసాగించటం. 22 ఏళ్ల క్రితం ప్రయోగశాలలో ఏర్పడిన కొన్ని కణాలు ఇంతకాలం నిలిచిపోయి, తిరిగి తల్లి గర్భంలో అభివృద్ధి చెంది పాపగా జన్మించాయి. అందుకే ఇది ఒక కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చిన కథ మాత్రమే కాదు; కాలాన్ని జీవశాస్త్ర స్థాయిలో ఎలా ‘నిలిపివేయవచ్చో’ చూపించిన ఆధునిక పునరుత్పత్తి శాస్త్రం గొప్పతనం కూడా!







కామెంట్‌లు (0)