‘మగవాళ్లు మాత్రమే ఈ పని చేయగలరు’ అని ముద్రపడ్డ రంగంలోకి మహిళలు ప్రవేశిస్తే, అది గొప్ప ఆరంభంగా కీర్తిస్తారు. ఆ మహిళలను వేన్నోళ్ల కొనియాడతారు. చూడడానికి చాలా ఆశావాహంగా కనిపించే ఈ విషయం లోతుల్లో మాత్రం మరొకటి జరుగుతుంటుంది. అది.. ఆ మహిళలు అడుగడుగునా ఎదుర్కొనే వివక్ష. ప్రతి క్షణం వారి శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి వారి శరీరం పరిశీలనా కేంద్రంగా మారిపోతుంది.
ఇప్పుడు ఇలాంటి వాతావరణమే బీహార్ ఆర్‌టీసీ విభాగంలో కనిపిస్తోంది. గతేడాది ఈ రాష్ట్రంలో ‘పింక్ బస్’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళల సురక్షిత ప్రయాణాల కోసం మహిళా డ్రైవర్లు, కండెక్టర్లతో ఆర్‌టీసీ బస్సులు నడుపుతున్నారు. పథకం కింద 100 బస్సులను సిద్ధం చేశారు. పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వంద మంది మహిళా డ్రైవర్లు ఉండాలి. కానీ ఇప్పటికీ ఆరుగురే ఉన్నారు. మిగతా వారంతా పురుషులే. ఈ ఆరుగురు మహిళలు 20 నుంచి 30 ఏళ్ల లోపు వారు. ముసహర్ కమ్యూనిటీకి చెందిన వారు. ఆ కమ్యూనిటీలో ఆడపిల్లలు యుక్తవయసు వచ్చాక పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతారు. పెళ్లి కాని ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్తే చాలా తప్పుగా భావిస్తారు. అలాంటి కమ్యూనిటీకి చెందిన ఈ ఆరుగురూ ఇప్పుడు ఇంట్లో, సమాజంలో తమను తాము నిరూపించుకునేందుకు శ్రమిస్తున్నారు.
ఉదయం ఆరు గంటలు కూడా కాకముందే 21 ఏళ్ల రాగిణి కుమారి పాట్నా బస్ డిపోలో జీన్స్ ప్యాంటు, పింక్ కుర్తా ధరించి రైడ్ కోసం వేచి చూస్తోంది. డిపో నిండా పురుష డ్రైవర్లు ఉన్నారు. పింక్ బస్ పథకంలో నియమితులైన ఈ మొదటి బ్యాచ్ మహిళా డ్రైవర్ల బృందం ప్రతి రోజూ వారికి కేటాయించిన రూట్ల బస్ డిపోల్లో ఇలాగే వేచి ఉంటారు. బక్క పల్చగా, ఎత్తు తక్కువగా ఉన్న ఈ యువతులు బస్సు ఎక్కి స్టీరింగ్‌పై చేతులు పెట్టగానే వారికి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. “డిపో నుంచి బస్సును బయటికి తీసుకెళ్లగలరా?” అని. సహచర పురుష డ్రైవరు నుంచి ఈ ప్రశ్న రాగిణికి ఎన్నోసార్లు ఎదురైంది. దానికి ఆమె సమాధానం చెప్పకుండా తన చేతులను స్టీరింగ్‌పై మరింత బలంగా ఉంచి బస్సును ముందుకు తీసుకెళ్తుంది. “మీరు మమ్మల్ని నమ్మడం ఎప్పటి నుంచి మొదలుపెడతారు? కనీసం ఇప్పటికైనా నమ్మడానికి ప్రయత్నించండి” అని ఆవేదనగా మాట్లాడుతోంది.
కులం, పేదరికం వల్ల ఈ కమ్యూనిటీ వాళ్లు నిరంతరం వివక్షకు గురవుతూనే ఉంటారు. వీటికి తోడు సమాజంలో పేరుకుపోయిన పితృస్వామ్య భావజాలం ఈ మహిళలను ఇంకా చిన్నచూపు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ఈ ఆరుగురు మహిళలది ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఎలుకలను వేటాడి తినే ముసహర్ కమ్యూనిటీ బీహార్ రాష్ట్ర మొత్తం జనాభాలో 3.08 శాతం మంది ఉన్నారు. వారిలో 79 శాతం మంది నెలకు రూ.6 వేల వేతనాలకు పనిచేస్తూ జీవిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన ఈ మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన ఇవ్వడమే కాదు, బిజీ రోడ్లపై స్టీరింగ్ తిప్పుతూ రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలబడాలని చెమటలు చిందిస్తున్నారు.

ఆరంభం మాత్రమే!
పాట్నా వీధుల్లో బస్సు నడుపుతున్న రాగిణి తన అనుభవాన్ని ఇలా చెప్పింది. “ఈ డ్రైవరు సీటు మా లక్ష్యానికి ఆరంభం మాత్రమే.. మేము కలలుగన్న భవిష్యత్తు ఇంకా ఉంది. ఈ స్టీరింగ్‌ను తాకిన ప్రతిసారి జీవితంలో నేను ఎదుర్కొన్న ప్రతి కష్టం గుర్తుకువస్తుంది. వాటిని అధిగమించడానికి ఈ స్టీరింగ్ నాకు ఒక ఆయుధంలా కనిపిస్తుంది. అందుకే ఎంతో ఇష్టంతో బస్సు నడుపుతాను” అంటోంది.
రాగిణితో పాటు గాయత్రి, ఆర్తీ, సరస్వతి, బేబీ, అనిత మొదటి బ్యాచ్ సభ్యులు. అయితే పథకం అమల్లో భాగంగా డ్రైవర్ శిక్షణ కోసం పిలుపు ఇచ్చినప్పుడు 16 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. విధుల్లోకి మాత్రం ఆరుగురే చేరారు. “మిగిలిన వాళ్లను కుటుంబాలు ఆపేశాయి” అని చెప్పింది ఆర్తి. “వారిలో కొంతమందికి పెళ్లిళ్లు అయ్యాయి” అని చెబుతోంది అనిత.
రాగిణి కూడా తనకెదురైన అనుభవాన్ని ఇలా గుర్తు చేసుకుంది. “శిక్షణలో 16 మంది ఉత్తీర్ణులయ్యాం. కానీ కుటుంబాలు ఇంత దూరం పంపడానికి ఇష్టపడలేదు. నాకు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. పాట్నా వచ్చి డ్రైవింగ్ చేయడం నాన్నకు ఇష్టం లేదు. అమ్మ ఒప్పించింది. ఇప్పటికీ అమ్మ మా కమ్యూనిటీ నుంచి మాటలు పడుతోంది. అవన్నీ భరిస్తూనే నాకు మద్దతుగా నిలబడింది. ‘పెళ్లీడు వచ్చిన పిల్లను అలా పంపడం ఏంటి? నువ్వేం అమ్మవు. పిల్లను ఇంటికి రమ్మని చెప్పు. త్వరగా పెళ్లి చేయి’ అన్న మాటలు అమ్మానాన్న ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు” అంటోంది.
ముసహర్ కమ్యూనిటీ గురించి 2019లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ గౌరాంగ్ సాహే సమర్పించిన నివేదికలో ఇలా రాశారు. “ఈ తరగతి ప్రజలు పుట్టిన దగ్గర నుంచీ సామాజిక వెలివేతకు, హింసకు, అవమానాలకు గురవుతున్నారు” అని. ఇంత వివక్ష నిండిన సమాజం నుంచి వచ్చిన ఈ మహిళలకు ఇప్పుడు అది మరో రూపంలో ఎదురవుతోంది.
ఈ శరీరంతో స్టీరింగ్ తిప్పుతారా!
తమ శరీరాన్ని బట్టి శక్తి సామర్థ్యాలు అంచనా వేస్తున్నారని ఆవేదన చెందుతున్న రాగిణి ఇంకా ఇలా చెప్పింది. “డిపార్ట్‌మెంట్ ఇప్పటికీ మా శక్తిసామర్థ్యాలను నమ్మడం లేదు. మా శరీరాలు నిత్యం పరిశీలనా కేంద్రాలుగా ఉంటాయి. పురుష డ్రైవర్లు ప్రతి రోజూ ‘ఈ శరీరంతో మీరు డ్రైవింగ్ చేయగలరా?’ అని ప్రశ్నిస్తుంటారు. మా ఎత్తు, బరువుపై ఎప్పుడూ అవాకులు చవాకులు పేలతారు. ‘ఒంట్లో వీసమెత్తు కండ లేదు. స్టీరింగ్ తిప్పుతావా!’ అంటూ నవ్వుతారు. డిపార్ట్‌మెంట్ కూడా పురుష డ్రైవర్ల పర్యవేక్షణలోనే మేము డ్రైవింగ్ చేయాలని చెబుతోంది. ఇలా ఎన్నాళ్లు? మాపై వాళ్ల అంచనాలు తప్పు అని చాలాసార్లు చెప్పాలనిపిస్తుంది” అంటోంది.
సరైన మౌలిక సదుపాయాలు లేకుండానే ఈ ఆరుగురు మహిళలు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వస్తే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీల్లేని దారుణ పరిస్థితులను అనుభవిస్తున్నారు. శరీరాన్ని బట్టి, కులాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి చిన్నచూపు చూసే సమాజ ధోరణి మారనంత వరకు ప్రతి క్షణం మహిళ తనను తాను నిరూపించుకోవాల్సి వస్తూనే ఉంటుంది.








కామెంట్‌లు (0)