గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమళ్లీ బాంబుల మోత

1 గంట క్రితం

G--us attack.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇరాన్‌పై అమెరికా ఎడతెగని దాడులు

  • వారం విరామం తర్వాత ఉధృతం

  • జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ ప్రతి దాడి

టెహ్రాన్‌/ వాషింగ్టన్‌ : సుమారు వారం రోజుల విరామం తర్వాత అమెరికా, ఇరాన్‌పై మళ్లీ భారీ స్థాయిలో బాంబుల మోత ప్రారంభించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి అట్టుడికిపోయింది. గురువారం తెల్లవారుజామునుండి అమెరికా దళాలు టెహ్రాన్‌ ‌లక్ష్యంగా వైమానిక దాడులతో తెగబడింది. ఇరాన్‌‌లోని క్షిపణి-డ్రోన్‌ స్థావరాలు, తీర గస్తీ ప్రాంతాలు సహా అనేక ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా కమాండ్‌ సెంటర్‌ ప్రకటించింది. ఖుజెస్థాన్‌ రాష్ట్రంలోని అనేక నగరాలు, ఖెష్మ్‌ దీవిపై దాడులు జరిగాయని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా వివరించింది. ఖుజెస్థాన్‌లోని అబాదన్‌, షాదెగాన్‌, అర్వంద్‌కెనార్‌, అహ్వజ్‌ నగరాలు దాడులతో దద్దరిల్లాయి. మరోవైపు ఇరాక్‌లో కూడా దాడులు జరిగాయి. ఖెష్మ్‌ దీవిలోని నివాస భవనంపై అమెరికా వైమానిక దాడి జరిపిందని, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని హార్మోజ్‌గన్‌ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ చెప్పారు. ఈ ఘటనలో రెండు సంవత్సరాల చిన్నారి, తల్లిదండ్రులు చనిపోయారని తెలిపారు. ఐఆర్‌‌జిసికి చెందిన ముగ్గురు సభ్యులు కూడా అమెరికా క్షిపణి దాడిలో మరణించారని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఇరాన్‌ ‌ప్రతి దాడులకు దిగింది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసింది. ఇరాన్‌ ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకున్నామని జోర్డాన్‌ సైన్యం గురువారం ఉదయం తెలిపింది. ఈజిప్ట్‌లో ఓ అమెరికా ట్యాంకర్‌ సహా రెండు నౌకలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ రెండు నౌకలు హర్మూజ్‌ జలసంధిలో సురక్షితం కాని మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఐఆర్‌జిసి తెలిపింది. చైనా కంపెనీకి చెందిన ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ జరిపిన దాడిలో ఒక కార్మికుడు మరణించగా భవనం బాగా దెబ్బతిన్నదని కువైట్‌ సైన్యం తెలియజేసింది.

​ ఇరాన్‌‌కు చైనా ఆయుధాలు? : ట్రంప్‌

పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు చైనా భారీ క్షిపణులను సరఫరా చేస్తోందని, తద్వారా గగనతలాన్ని పటిష్టం చేసుకుంటుందన్న అంతర్జాతీయ మీడియా కథనాలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘చైనా అలా చేస్తే నేను చాలా నిరుత్సాహపడతా’ అని అన్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించిందని, జిన్‌ ‌పింగ్‌ ఆ పని చేయనని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇరాన్‌‌పై భీకర దాడులు కొనసాగుతాయని అన్నారు. ఇరాన్‌‌కు ఆయుధాల సరఫరా కథనాన్ని చైనా తిరస్కరించింది. ఈ నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని, శాంతి పునరుద్దరణకు, ఘర్షణలను ముగించేందుకు చైనా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

​హర్మూజ్‌‌పై ఒమన్‌‌తో చర్చలు : ఇరాన్‌

అమెరికా - ఇజ్రాయెల్ దాడుల కారణంగా హర్మూజ్‌ జలసంధి మూసివేశామని, ఈ రెండు దేశాల తీరుతో అంతర్జాతీయ నౌకా రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి పేర్కొన్నారు. మార్చి 28 నుంచి కొనసాగుతున్న ‘‘సైనిక దురాక్రమణ’’కు ఇది పర్యవసానమన్నారు. ఒమన్ అధికారులతో హర్మూజ్‌ జలసంధి అంశంపై చర్చలు తెహ్రాన్‌లో కొనసాగుతున్నాయని ‌బఘాయి తెలిపారు. ఇరాన్‌కు చెందిన రెండు సంస్థలపై యుఎస్‌ ట్రెజరీ శాఖ బుధవారం కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.

ఒకవైపు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ, మరోవైపు వాషింగ్టన్ - టెహ్రాన్‌ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ‌తెలిపారు. గురువారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హార్మూజ్‌ జలసంధి, ఉద్రిక్తతల తగ్గింపుపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఇప్పటికీ చాలా బలంగా ఉందని, 13 రోజుల బాంబు దాడుల తర్వాత కూడా ఆ జలమార్గంలో నౌకా రాకపోకలు దాదాపు నిలిచిపోయాయని క్విన్సీ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రిటా పార్సీ మీడియాకు తెలిపారు. ఇరు దేశాల సైనిక దాడులు ఉదృతమవుతున్నందున చర్చలకు అనుకూల పరిస్థితి లేదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్