టిడిఆర్ వినియోగంలో సడలింపులు
అగ్నిప్రమాద ఎన్‌ఓసి లేకపోయినా నిర్మాణం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భవన నిర్మాణ నిబంధనలలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. విడతలవారీగా ఫైర్ క్లియరెన్స్‌లు ఇస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ బుధవారం జిఓ ఇచ్చారు. ఈ జిఓలో టిడిఆర్ బాండ్ల వినియోగంలో మరింత సడలింపులు ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగు వేసిందని అందులో పేర్కొన్నారు. అవసరం లేని పద్ధతులు, నిబంధనల భారాన్ని తొలగిస్తూ సురక్షితమైన, సమ్మేళిత, పర్యావరణ రహిత పెట్టుబడులకు అనుకూలమైన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని జిఓ లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ 'డీరెగ్యులేషన్ సెల్' మార్గదర్శకాలకు అనుగుణంగా 23 ప్రాధాన్యత రంగాలు, 5 ఐచ్ఛిక ప్రాధాన్యత రంగాలను పరిగణనలోకి తీసుకుని ఈ సవరణలు రూపొందించినట్లు పేర్కొన్నారు. స్టిల్ట్ ఫ్లోర్‌తో కలిపి 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను 'హైరైజ్ (ఎత్తైన) భవనాలు'గా నిబంధనలలో పేర్కొన్నారు. క్రెచ్‌లు (శిశు సంరక్షణ కేంద్రాలు), ఆధ్యాత్మిక/ప్రార్థనా మందిరాల భవనాలకు అధికారిక గుర్తింపును ఇచ్చారు. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల నిర్మాణ డిజైన్లు నేల మోసే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, బిల్డర్లు డెవలపర్లు నిర్మాణ సమయానికి సంబంధించిన 'ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ'ని సమర్పించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. నివాస, నిర్మాణ రంగ కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు 'సిటీ-లెవల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు'ను మూడేళ్ల వ్యవధిలో ఆరు సమాన విడతలలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. గడువు ముగిసిన భవన అనుమతుల రీ-వాలిడేషన్ తో ఎలాంటి అనిశ్చితి లేకుండా మళ్లీ అనుమతుల ప్రక్రియ చేపట్ట వచ్చని వివరించారు. ఎలాంటి వాణిజ్య అవసరాలు లేకుండా, కేవలం ఆధ్యాత్మిక/ప్రార్థనా అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే భవనాలకు భవన నిర్మాణ అనుమతి రుసుములు, ఇతర సంబంధిత ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. హైరైజ్ కాని భవనాలకు ప్లాట్ పరిమాణాన్ని బట్టి చిన్న ప్లాట్లకు ఇబ్బంది లేని విధంగా, పెద్ద నిర్మాణాలకు భద్రత, పార్కింగ్ అవసరాలను ప్రాధాన్యతగా ఉంచారు. ఎత్తైన భవనాల్లో (హైరైజ్) సెట్‌బ్యాక్‌లను నిర్ణయించడానికి భవన ఎత్తును లెక్కించేటప్పుడు ప్రత్యేక పార్కింగ్ అంతస్తులను మినహా యింపు ఇచ్చారు. ఫైర్ ఎన్‌ఓసి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, స్ట్రక్చరల్ డిజైన్ ఇతర చట్టబద్ధమైన భద్రతా అవసరాల కోసం వీటిని ఎత్తు కిందనే పరిగనించనున్నారు . స్టిల్ట్ ఫ్లోర్‌తో సహా 24 మీటర్ల ఎత్తు వరకు ప్రారంభ అనుమతి మంజూరు చేస్తారు. భవనం ఆ ఎత్తు దాటి నిర్మాణాన్ని కొనసాగించే ముందు దరఖాస్తుదారుడు ఫైర్ ఎన్‌ఓసీని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిపాదిత భవనానికి సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్, స్టెబిలిటీ పత్రాలను ముందే సమర్పించాలని, మిగిలిన అంతస్తులకు అనుమతి ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించిన తర్వాతే ఇస్తారని పేర్కొన్నారు. ఈ విధానంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను సడలించారు. భవనాల ఎత్తును బట్టి రోడ్డు వెడల్పు, చుట్టూ ఉండాల్సిన ఖాళీ స్థలం (ఓపెన్ స్పేస్) నిబంధనల్లో మార్పు చేశారు. ఖాళీ స్థలం, అనుమతించదగిన బిల్ట్-అప్ ప్రాంతం దెబ్బతినకుండా స్థలంలో ఒకవైపు నుంచి మరోవైపునకు పరిమితంగా సెట్‌బ్యాక్‌లను మార్చుకోవడానికి అనుమతించారు. ఆరు మీటర్ల ఎత్తు నుంచి పైన ఉండే అంతస్తులలో నిబంధనలకు లోబడి రెండు మీటర్ల వరకు బాల్కనీ ప్రొజెక్షన్లకు అనుమతి ఉంటుంందని అయితే, అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా చర్యలను బాల్కనీ కవర్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. 5,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ బిల్ట్-అప్ ప్రాంతం ఉన్న అన్ని కొత్త వాణిజ్య సముదాయాలు, హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు కల్పించడం తప్పనిసరి చేశారు. 100 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు ఉన్న గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులలో క్రెచ్‌లు, క్లబ్ హౌస్‌లు, కన్వీనియంట్ షాపింగ్, జిమ్‌నాషియం వంటి ఉమ్మడి వసతుల కోసం స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. 50 మందికి పైగా ఉద్యోగులున్న పెద్ద నివాస, విద్యా, వైద్య, వాణిజ్య, పారిశ్రామిక మరియు ప్రభుత్వ సంస్థలలో కూడా క్రెచ్ (శిశు సంరక్షణ) వసతి తప్పనిసరి చేశారు. కనీసం 10 అంతస్తులు ఉన్న ఎత్తైన భవనాలు గార్డెన్లు, వాకింగ్/జాగింగ్ ట్రాక్‌లు, వ్యూయింగ్ గ్యాలరీలు, వినోద సదుపాయాల కోసం 'ఎన్విరాన్‌మెంటల్ డెక్ ఫ్లోర్'ను ఏర్పాటు చేసుకోవచ్చని పెద్ద భవనాల్లో పైప్‌లైన్లు, ఇతర యుటిలిటీ లైన్ల నిర్వహణను సులభతరం చేసేందుకు 'సర్వీస్ ఫ్లోర్లకు' కూడా అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదనపు అంతస్తులు పరిమిత సెట్‌బ్యాక్ సర్దుబాట్ల కోసం 'ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ వినియోగాన్ని విస్తరించారు. ఇది రోడ్డు వెడల్పు, పార్కింగ్, ఎత్తు భద్రతా నిబంధనలకు లోబడి ఉండాలని, ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు 9 మీటర్ల కంటే తక్కువగా ఉన్న చోట టీడీఆర్ అంతస్తులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)