రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు
విద్యార్థులు ఉగ్రవాదులా? : ఖర్గే
అప్రకటిత అత్యవసర పరిస్థితిని కేంద్రం విధించింది : జాన్‌బ్రిట్టాస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల అమానుష దాడిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థులపై లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించినా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 (యాంటీ పేపర్ లీక్ లా)ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం తీసుకొచ్చారు. పేపర్ల లీకులను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ వంటి దారుణ ఘటనకు అమిత్ షాదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఢిల్లీ ఘటనపై ఇప్పటికైనా అమిత్ షా నోరువిప్పాలన్నారు. నీట్ పేపర్ లీక్ ప్రభుత్వం తలదించుకోవాల్సిన అంశమని అన్నారు. 2024లోనే ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులపై తుపాకులు ఎక్కుబెట్టారని విమర్శించారు. ఆందోళన చేసిన యువత ఉగ్రవాదులు కాదు కదా? అని అన్నారు. పోలీసుల చర్యలపై ప్రధాని మోడి, హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాలని, లేదంటే మళ్లీ విద్యార్థులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విద్యా సంస్థలకు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు నేతృత్వం వహిస్తున్నారని, వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో కీలక పదవులన్నీ ఆర్ఎస్ఎస్‌తో లింకున్నవారికే దక్కుతున్నాయన్నారు. మనుస్మృతి ప్రకారం స్కూళ్లు, యూనివర్సిటీల సిలబస్‌లో మార్పులు జరుగుతున్నాయన్నారు. విద్యా వ్యవస్థలో కుల వివక్షను మనుస్మృతి ప్రోత్సహిస్తోందన్నారు. ఆ వ్యాఖ్యలను బిజెపి సభ్యులు ఖండించగా, సభలో గందరగోళం నెలకొంది. మనుస్మృతిపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని సభాపక్ష నేత జెపి నడ్డా కోరారు. రాజ్యసభ చైర్మెన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ చర్చలో మనుస్మృతి ప్రస్తావన సంబంధం లేని అంశమని, అధికారిక రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చెప్పారు.
అప్రకటిత అత్యవసర పరిస్థితిని కేంద్రం విధించింది
సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్
పేపర్ లీక్ సమస్యకు సంబంధించి పైకి కనిపించే సమస్య పరిష్కారంపైనే దృష్టి పెట్టకుండా, సమస్య మూల కారణాన్ని పరిష్కరించాలని జాన్ బ్రిట్టాస్ ప్రభుత్వాన్ని కోరారు. పేపర్ లీక్ సమస్యకు 'ఫాస్ట్-ట్రాక్' కోర్టులు లేదా కమిటీలు పరిష్కారం చూపలేవని, అసలు వ్యవస్థే ఈ సమస్యకు మూలకారణమని అన్నారు. ఆ పిల్లల (సిజెపి నిరసనకారులు) కన్నీళ్లను బాష్పవాయువుతో ఆపలేమని, వారి సంకల్పాన్ని పెల్లెట్లతో (తుపాకీ గుళ్లతో) దెబ్బతీయలేమని ఆయన పేర్కొన్నారు. జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇలా అన్నారు. "విద్యార్థులు నిరసన తెలిపినప్పుడు బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో చర్చించడం మంచిదా, లేక నిరసనల తర్వాత అత్యవసర పరిస్థితిని విధించడం మంచిదా?" అంటూ 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ప్రస్తావించారు. "మేమంతా అత్యవసర పరిస్థితిని అనుభవించాం. దానిని వ్యతిరేకించాం. కానీ, ఈ ప్రభుత్వం అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది" అని బ్రిట్టాస్ బదులిచ్చారు.
ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? : సంజయ్ రౌత్
విద్యార్థుల నిరసనల పట్ల ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతోందని శివసేన (ఠాక్రే) ఎంపి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. "లాఠీలు, బాష్పవాయువు, పెల్లెట్లతో విద్యార్థులపై దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు ఎలాంటి ప్రకటన చేయలేదు?" అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ప్రశ్నాపత్రం లీక్ చేసే ముఠాలకు శిక్షను పెంచే ఉద్దేశంతో 'పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టినప్పటికీ, అది సరిపోదని, నివారణ, పారదర్శకత, జవాబుదారీతనం మరింత ముఖ్యమని జెఎంఎం ఎంపి మహువా మాఝీ అన్నారు. గత పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 1.23 లక్షల మంది విద్యార్థులకు నివాళులర్పించడంతో తన ప్రసంగాన్ని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ప్రారంభించారు. బీహార్‌లో పోలీసులు విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారని, ప్రభుత్వం ఉగ్రవాదుల మాదిరిగా వ్యవహరించిందని అన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో పరీక్షలు నిర్వహించి, బ్లాక్ లిస్ట్ చేయబడిన ఎడ్యుటెస్ట్ సంస్థకు పక్షపాతంతో కాంట్రాక్టులు ఇస్తూ వచ్చారని విమర్శించారు.
వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలి
నీట్ ను రద్దు చేసి, వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించాలని ఎస్పీ ఎంపి రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. శిక్షలను పెంచడం మాత్రమే నేరాలు జరగకుండా ఆపలేదని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టిఎ)ని రద్దు చేయాలని ఆర్జెడి ఎంపి మనోజ్ కుమార్ ఝా డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్‌ల వల్ల గాయపడిన వారికి చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, నిరసన సమయంలో పెల్లెట్ గన్‌లను ఉపయోగించలేదంటూ బిజెపి ఎంపీ బ్రిజ్ లాల్ సభను ఎలా తప్పుదోవ పట్టించారో అర్థం కావడం లేదని డిఎంకె ఎంపి తిరుచ్చి శివ అన్నారు. ఈ బిల్లుపై చర్చలో జెడియు ఎంపి సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపి ఎంపి ప్రఫుల్ పటేల్, శివసేన ఎంపి మిలింద్ దేవరా, బిజెపి ఎంపి సుధాన్షు త్రివేది, టిడిపి ఎంపి భాష్యం రామకృష్ణ, వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి, బిఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, బిజెడి ఎంపి సంతృప్తి మిశ్రా, టిఎంసి ఎంపి సాగరిక ఘోష్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపి చౌదరి మహ్మద్, స్వతంత ఎంపి కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనలతో ఉభయ సభల్లో గందరగోళం
ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అణచివేతకు ఆదేశించినందుకు హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఉభయ సభలలోనూ నిరసన తెలిపాయి. జంతర్ మంతర్ వద్ద పోలీసుల అరాచకాలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై చర్చ జరపాలని, సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరుతూ సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై పోలీసుల అరాచకాలు, ఎకెజి భవన్‌లో ఢిల్లీ పోలీసులు జరిపిన అరాచకాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపి వి. శివదాసన్ కూడా రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. అయోధ్య రామమందిరంలో లూటీపై అమిత్ షా సమాధానం చెప్పాలని కోరుతూ ఉభయ సభల సభ్యులు నినాదాలు చేశారు. పార్లమెంటులో నిరసనను తీవ్రతరం చేయాలని ఇండియా బ్లాక్ ఎంపిల సమావేశం నిర్ణయించింది.
రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు
అమిత్‌షాపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బుధవారం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రివిలేజ్ (సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు, సభా ధిక్కరణ నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
ప్రతిపక్షాల వినూత్న ఆందోళన
విద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్య రామ మందిరంలో చందాల చోరీకి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపిలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రామ మందిరంలో విరాళాల చోరీని తెలిపేలా... హుండీలో ఎంపిలు డబ్బులు వేస్తూ నిరసన తెలిపారు. ‘అధికార దొంగలు’, ‘చందాల దొంగలు’, ‘కేంద్ర హోం మంత్రి సభకు రావాలి’, విద్యార్థులకు దాడికి ఆదేశాలు ఎవరిచ్చారు’ అని నినాదాలతో హోరెత్తించారు. 'అయోధ్యలో దోపిడీపై యుపి ప్రభుత్వ విచారణ కేవలం ఒక బూటకం' అని డింపుల్ యాదవ్ విమర్శించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ, ఎస్పీ ఎంపి ధర్మేంద్ర యాదవ్, సిపిఎం ఎంపిలు జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎఎ రహీం, టిఎంసికి చెందిన సాగరిక ఘోష్, జెఎంఎం ఎంపి మహువా తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)