గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅహింసాయుతంగానే ఎదుర్కొనాలి !

1 గంట క్రితం

supreme-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యార్ధుల నిరసనల వేళ పోలీసుల తీరుపై సుప్రీం వ్యాఖ్యలు

  • పెల్లెట్ల గన్స్‌పై సంపూర్ణ నిషేధానికి వెనుకంజ

న్యూఢిల్లీ : విద్యార్ధుల నిరసనలు, ఆందోళనలను ప్రభుత్వం అహింసాయుత పద్ధతుల్లో ఎదుర్కొనాలని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే వారిని ప్రభుత్వం అహింసాత్మకంగానే ఎదుర్కొనాలి తప్ప క్రూరత్వంతో కాదని పేర్కొంది. ఈ నెల 20న నీట్‌ ‌నిరసనల సందర్భంగా పోలీసుల అణచివేత చర్యల్లో కళ్లకు పెల్లెట్లు తగిలిన 19 ఏళ్ల సాహిల్‌ ‌లోచాబ్‌ ‌సహా పెల్లెట్ల బాధితుల వాదనతో సుప్రీం కోర్టు పూర్తిగా ఏకీభవించింది. న్యాయబద్ధంగా విద్యార్ధులు చేస్తున్న నిరసనలను అనైతిక శక్తులు హైజాకింగ్‌ ‌చేసి దాన్నొక హింసాత్మక ఆందోళనగా మార్చే అవకాశం వుందన్న విషయం కూడా తమకు తెలుసునని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆందోళన చేస్తున్న జన సమూహాన్ని ఎదుర్కొనాల్సి వచ్చినపుడు బల ప్రయోగంతో సహా దశలవారీగా వివిధ చర్యలు, పద్దతులను చేపట్టడానికి పోలీసులు సన్నద్ధం కావాలని కోర్టు పేర్కొంది. ప్రజలపై దాడులు చేయడానికి సంబంధించిన పరికరాలను పోలీసులకు సమకూర్చే బదులు, వారికి (పోలీసులకు) రక్షణ కల్పించే పరికరాలను సమకూర్చాలని జస్టిస్‌ ‌జోమాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. అటువంటపుడు ఆందోళనకారులపై హింసకు దిగడానికి ముందుగా ఆలోచించేందుకు పోలీసులకు విశ్వాసం లభిస్తుందని అన్నారు. నిరసనలు చేసే జన సమూహాలను ఎదుర్కొనే పోలీసుతో సహా ప్రతి ఒక్కరూ మనుషులేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చినపుడు పోలీసులకు సరైన రక్షణ కల్పించే పరికరాలు సమకూర్చాలని, అప్పడు వారికి కూడా ఒక రకమైన విశ్వాసం నెలకొంటుందని అన్నారు. ఎవరైనా లాఠీతో మీ ముందుకు వచ్చినపుడు, అది పోలీసు కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు, మీరు హెల్మెట్‌ ‌ధరించి వుంటే పరిస్థితిని అంచనా వేసేందుకు, తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు కొన్ని సెకన్లు సమయం తీసుకోవచ్చు, ఈ అంశాలను కూడా మనమిక్కడ చర్చల్లో చేర్చాల్సి వుంటుందని జస్టిస్‌ ‌బాగ్చి పేర్కొన్నారు. మాజీ ఐపిఎస్‌ అధికారి యశోవర్ధన్‌ ‌అజాద్‌, సిపిఎం రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీమ్‌, ప్రశాంత్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, షేక్‌ ఇర్షాద్‌ ‌మన్సూరి తదితరులు వేసిన పిటిషన్‌‌ను కోర్టు గురువారం విచారించింది. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళనల సమయంలో సింగ్‌, మన్సూరి పెల్లెట్ల దాడిలో గాయపడ్డారని ఆ పిటిషన్‌ ‌పేర్కొంది. ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని సత్వర కార్యాచరణ బలగాలు (ఆర్‌ఎఎఫ్‌) ‌పంప్‌ ‌యాక్షన్‌ ‌గన్‌‌లను ఉపయోగించాయని, వీటితో పెద్ద మొత్తంలో పెల్లెట్లు దూసుకువచ్చాయని పిటిషనర్లు తెలిపారు. కన్నాట్‌ ‌ప్లేస్‌ ‌వద్ద 20వ తేదీన నిరసనకారులపై ఏడు రౌండ్ల పెల్లెట్లను ప్రయోగించినట్లు పిటిషన్‌ ‌పేర్కొంది. గుంపును చెదరగొట్టడానికి పెల్లెట్‌ ‌గన్స్‌‌ను ఉపయోగించడ మనేది ఆవశ్యకత, సహేతుకతలకు సంబంధించిన రాజ్యాంగ పరీక్షల్లో విఫలమవుతాయని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 19(1)(బి) అధికరణ కింద స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కుపై దాడి చేయడమేనని, ఇది రాజ్యాంగవిరుద్ధమైన ఆంక్షల కిందకే వస్తుందని ఆ పిటిషన్‌ ‌పేర్కొంది. గుంపును చెదరగొట్టేం దుకు విధించిన ప్రామాణికాలను ఉల్లంఘించి పోలీసులు విచక్షణా రహితంగా పెల్లెట్లను ఉపయోగించిన సంఘటనలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు అనుసరించే ప్రామాణికాలు వుంటే తెలియజేయాలని సొలిసిటర్‌ ‌జనరల్ తుషార్‌ ‌మెహతాను కోర్టు కోరింది. పోలీసు బలగాలు అతిగా వ్యవహరించినట్లు తేలినా లేదా ప్రామాణిక నిబంధనలు లేకపోయినా సరైన ప్రొటోకాల్‌ ‌లేదా మార్గదర్శకాలు రూపొందించడానికి కోర్టు జోక్యం చేసుకోవచ్చని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌పేర్కొన్నారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్