ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతంలో కనీస స్వేచ్ఛ, హక్కులు లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న వేలాది మంది ఉన్నారంటే సిగ్గుపడాల్సిందే. మౌలిక వసతులు, గౌరవప్రద జీవితం కాదు కదా.. కనీసం తమ శరీరాలపై తామే నిర్ణయం తీసుకునే హక్కు కూడా లేని మహిళలు మధ్యప్రదేశ్‌లోని 'నవలి' ప్రాంతంలో జీవిస్తున్నారు. ఇది స్వతంత్ర భారతం నుదుటిపై చెరగని మచ్చ. ఇకనైనా మారాల్సిన అమానవీయ వాస్తవం.
ఈ ప్రాంతంలోని 78 గ్రామాల్లో సుమారు 25 వేల మంది నివసిస్తున్నారు. వారిలో మహిళలే ఎక్కువ. బంచాడా ఆదివాసీ తెగకు చెందిన కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకుంటారు. మిఠాయిలు పంచుకుంటారు. బాణాసంచా కాలుస్తారు. మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ పోషకాహారం పెడతారు. వివాహం జీవితాంతం బంధనమని చిన్నప్పటి నుంచే వారి మనసుల్లో నాటుతారు. ఇదంతా ఆడపిల్లల పట్ల ప్రేమ వల్ల కాదు. కుటుంబానికి ఆదాయం తెచ్చే సాధనంగా వారిని తీర్చిదిద్దడానికే. బ్రిటీష్ పాలనలో బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడిన ఈ తెగ మహిళలు నేటికీ అదే దురాచార వ్యవస్థలో చిక్కుకుని జీవిస్తున్నారు. కౌమార దశలోనే ఆడపిల్లలను జాతీయ రహదారి పక్కన నిలబెట్టి ఖాతాదారులను ఆకర్షించేలా కుటుంబ సభ్యులే ప్రోత్సహిస్తారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల సమాచారం ప్రకారం మాందసౌర్, నీముచ్, రాత్లామ్ జిల్లాల్లోని ఈ గ్రామాల్లో ఒక్క నీముచ్ జిల్లాలోనే దాదాపు 10 వేల మంది మహిళలు, వారిలో మూడు వేల మంది బాలికలు ఈ దుర్భర జీవితంలో చిక్కుకున్నారు. ఎనిమిదో, తొమ్మిదో తరగతి తర్వాత అక్కడి ఆడపిల్లలు దాదాపుగా చదువు కొనసాగించరు. కమ్యూనిటీ పెద్దలే ఈ ఆచారాన్ని సంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు.
వ్యభిచారంలోకి నెట్టబడిన రాధిక (పేరు మార్చబడింది) తన అనుభవాన్ని ఇలా వివరిస్తుంది. "బాల్యం నుంచే కుటుంబాన్ని పోషించాల్సింది ఆడపిల్లలేనని చెబుతారు. తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపి నేనూ ఇందులోకి వచ్చాను. ఎవరైనా వ్యతిరేకిస్తే కుటుంబ సభ్యులే కొట్టి మరీ ఈ వృత్తిలోకి దింపుతారు" అని ఆమె చెబుతుంది.
జాతీయ రహదారి సాక్షిగా...
156వ జాతీయ రహదారి ఈ మూడు జిల్లాలను కలుపుతుంది. పగటిపూట ప్రశాంతంగా కనిపించే గ్రామాలు రాత్రి పడితే పూర్తిగా రూపు మార్చుకుంటాయి. ఇళ్ల ముందు మంచాలపై కూర్చునే వృద్ధ మహిళలు, ఆరుబయట ఆడుకునే పిల్లల మధ్యే రాత్రివేళ అమ్మాయిలతో బేరసారాలు చేసే పురుషులు, రేట్లు చెబుతూ కార్ల వెంట నడిచే మహిళలు కనిపిస్తారు. అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేసే కుటుంబాలు, ధాబా యజమానులు, ఖాతాదారులతో ఆ ప్రాంతమంతా జుగుప్సాకర దృశ్యంగా మారిపోతుంది.
ఈ దుస్థితికి చారిత్రక నేపథ్యమూ ఉంది. బ్రిటీష్ పాలకులు రాజస్థాన్‌లోని ఈ తెగను ఒకప్పుడు 'నేరచరిత్ర గల తెగ'గా ముద్రవేశారు. అరెస్టయిన పురుషులను విడిపించుకోవడానికి వారి కుటుంబాల మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారు. 1952లో ఈ తెగను డీ-నోటిఫైడ్ తెగగా ప్రకటించిన తరువాత క్రమంగా రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. కానీ వారి జీవితాలు మాత్రం మారలేదు. ఈ వృత్తి నుంచి బయటపడిన మహిళల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో బయటకు వచ్చినా అవాంఛిత గర్భాలు, అనారోగ్య సమస్యలు, సామాజిక వివక్ష వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఉపాధి అవకాశాలు దొరకవు. వివాహం చేసుకునే వారు కూడా చాలా తక్కువ. చివరికి బతుకుదెరువు కోసం మళ్లీ అదే దుర్భర జీవితంలోకి వెళ్లాల్సి వస్తోంది.
వృత్తి నుంచి బయటపడిన ఓ మహిళ చెబుతుంది... "మేము బంచాడా తెగకు చెందిన వాళ్లమని చెప్పగానే పని ఇవ్వరు. మా పిల్లలకు పాఠశాలల్లో సీట్లు కూడా నిరాకరిస్తారు." ఈ వాస్తవాన్ని మాందసౌర్ మాజీ కలెక్టర్ అదితి గార్గ్ కూడా అంగీకరిస్తారు. "వారిని ప్రధాన సమాజంలో కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ లబ్ధి పొందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. మిగతా వారు పరిస్థితుల కారణంగా మళ్లీ అదే వృత్తిలోకి వెళ్లిపోతున్నారు" అని ఆమె చెబుతున్నారు. నీముచ్ కలెక్టర్ హిమాన్షు చంద్ర మరో కీలక సమస్యను ప్రస్తావిస్తున్నారు. "ఈ పిల్లల్లో చాలామందికి తండ్రి ఎవరో నమోదు ఉండదు. మన వ్యవస్థలో తండ్రి కులం ఆధారంగానే కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. అందువల్ల వీరికి కుల ధ్రువీకరణ పత్రాలు రావు. సంక్షేమ పథకాలు కూడా అందవు. ఈ విధానాన్ని మార్చాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
1990లలో ప్రభుత్వం బంచాడా మహిళల పునరావాసం కోసం 'జబాలీ' పథకాన్ని ప్రవేశపెట్టింది. హాస్టళ్లు నిర్మించడం, విద్య, ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. అయితే తొలి నాలుగేళ్లపాటు నిధులే విడుదల కాలేదని, తరువాత కూడా రూ.5 నుంచి రూ.7 లక్షల నామమాత్రపు కేటాయింపులతో సరిపెట్టారని మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన నరేంద్ర చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా చాలాసార్లు పేరుకే జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. స్వతంత్ర భారతంలో కూడా ఇలాంటి సమాజాలు గౌరవప్రదమైన జీవితం కోసం ఎదురుచూడాల్సి రావడం మనందరికీ అవమానం. బతుకుదెరువు, విద్య, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తే, ఎన్ని స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకున్నా వాటికి పూర్తి అర్థం ఉండదు. ఈ సమాజంలోని ప్రతి ఆడపిల్ల భయంలేకుండా చదువుకుని, తన జీవితంపై తానే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను పొందిన రోజే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం సిద్ధిస్తుంది.








కామెంట్‌లు (0)