గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారుమూల తరగతి గది నుంచి జాతీయ వేదికపైకి....

5 గంటల క్రితం

rajesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 07:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

'తరగతి గది.. పిల్లలకు కేవలం బోధనా స్థలం మాత్రమే కాదు.. అది నూతన ఆవిష్కరణలు విరబూసే తోట' అని బలంగా నమ్మే మాస్టారు కౌలూరి రాజేష్. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తన 15 ఏళ్ల బోధనా కెరియర్‌లో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలకు పుస్తకాలు లభించడమే అసాధ్యమైన రోజుల్లో టెక్నాలజీతో పాఠాలు బోధించారు రాజేష్. పిల్లలతో పాటు, టీచర్లకూ పాఠాలు చెప్పే పుస్తకాలు రాయడం, వెబినార్లు నిర్వహించడం రాజేష్ ప్రత్యేకత. ప్రస్తుతం విజయనగరం జిల్లా చనుమల్లుపేట ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కృషికిగానూ ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

​శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామం రాజేష్ స్వగ్రామం. శంకరరావు, రమణమ్మ తల్లిదండ్రులు. తండ్రి వడ్రంగి పని చేస్తారు. తల్లి అంగన్వాడీ వర్కర్. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రాజేష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. 2008లో టెట్ పరీక్ష రాసిన ఆయనకు 2010లో జామి మండలం తాండ్రంగిలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఆ తరువాత మెరక ముడిదాం మండలం భాగీరధీపురం, వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం, మెంటాడ మండలం గుర్ల ఎంపిపి పాఠశాలల్లో పనిచేశారు. ఇవన్నీ మారుమూల పల్లెలు, ఆదివాసీ ప్రాంతాలు. అక్కడి పాఠశాలలకు చేరుకోవడం అంత సులభం కాదు. సామాజికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన పిల్లలకు పాఠాలు బోధించడం కూడా ఆషామాషీ కాదు. కానీ రాజేష్ ఆ అసాధ్యాలను సాధ్యం చేసి చూపించారు.

​ఆరుబయటే పాఠాలు..

తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ రాజేష్‌ ఇలా చెప్పారు. ‘నేను పనిచేసిన స్కూళ్లకు వెళ్లేందుకు రోడ్డు కూడా సరిగ్గా వుండేది కాదు. వర్షం వస్తే రోడ్డంతా బురద బురదగా ఉండేది' అన్నారు. అక్కడ పిల్లలకు పాఠాలు ఎలా చెప్పారు? అన్నప్పుడు.. ‘బడిలో ఎప్పుడూ నేను పాఠాలు చెప్పలేదు. వర్షానికి తరగతి గదుల్లోకి నీరు వచ్చేసేది. రాత్రంతా కుక్కలు పడుకుని తెల్లారేసరికి చాలా అసహ్యంగా ఉండేది. ఆ గదులను శుభ్రం చేసుకునేవాళ్లం. ఆ తడిలో పిల్లలకు పాఠాలు చెప్పడం ఇష్టం లేక ఆరుబయటే చెప్పేవాడిని' అని వివరించారు. అక్షరాలు నేర్పించేందుకు కనీసం బోర్డు లేక ఆయనే చార్టులు కొని పాఠాలు చెప్పేవారు. ‘తరగతి గదిలో పిల్లలందరూ ఒకేలా చదవరు. చదువులో కొందరు ముందుంటే.. ఇంకొందరు వెనుకబడి ఉంటారు. పిల్లల అవగాహనను బట్టి నేర్పించే విధానాలను మారుస్తూ ఉంటే పిల్లలందరినీ ఒకే సామర్థ్యం ఉన్న వాళ్లగా తీర్చిదిద్దవచ్చు' అంటారు రాజేష్ మాస్టారు. ఆ మాటలను ఆయన తన ఆచరణలో చేసి చూపించారు.

​క్లిష్టమైన పాఠాలను విడివిడి భాగాలుగా విభజించి బొమ్మల రూపంలో, చార్ట్‌ల రూపంలో చెప్పేవారు. అయితే ఈ పద్ధతి అన్ని చోట్లా ఫలితం ఇచ్చేది కాదు. 2016-17 నుండి ఆయన బోధనలో సాంకేతికత జోడించారు. సులభమైన రీతిలో పిల్లలకు పాఠాలు ఎలా బోధించాలో అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. తనకు తాను సాధన చేసుకుంటూ.. పిల్లలకు నేర్పుతూ టీచర్ వృత్తికి ఆదర్శంగా నిలిచారు.

​ఒక తరాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉంది

‘తన ఈడు పిల్లలందరూ ఇంజీనీరింగ్ వైపు వెళుతుంటే టీచర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు’ అన్నప్పుడు రాజేష్ ఇలా సమాధానం చెప్పారు. ‘తాతయ్య తామరపల్లి చిన్నబ్బాయి ప్రోద్బలంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నాను. ఒక తరాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుడికే ఉంటుంది. నువ్వు పెద్దయ్యాక ఆ బాధ్యత తీసుకోవాలి' అని తాతయ్య ఎప్పుడూ చెప్పేవారు అని తాతయ్యను గుర్తు చేసుకున్న రాజేష్, బాల్యంలో చదువుకునేందుకు తను పడ్డ బాధలను కూడా పంచుకున్నారు. ‘2 రూపాయలు పెట్టి చార్ట్ కొనే స్థోమత లేక రోజంతా క్లాసు రూం బయటే నుంచున్నా. ఆ అనుభవం నాకు ఇప్పటికీ గుర్తుంది' అంటున్నప్పుడు రాజేష్ మాటల్లో భావోద్వేగం కనిపించింది. కాలేజీ ఫీజు కట్టేందుకు వాళ్ల నాన్న పొలం అమ్మి డబ్బులు కట్టిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చదువులో రాణిస్తున్న తనను ఉపాధ్యాయులు అక్కున చేర్చుకుని ప్రోత్సహించిందీ ఆయన మర్చిపోలేదు.

​ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన యువకుడు.. తాత లక్ష్యం కోసం కెరీర్‌ను ఎంచుకున్న వ్యక్తి.. ఆ అనుభవాల నుండి నేర్చుకున్న బతుకు పాఠాలు ఆయన్ను ఉన్నతమైన మార్గంలో నడిపించాయి. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదిగేలా చేశాయి. రాజేష్ పాఠాలు తరగతి గదిలో నైపుణ్యాలను మాత్రమే పెంచలేదు. విద్యార్థుల భవిష్యత్తు కలలకు రెక్కలు తొడుగుతున్నాయి.​

రాజేష్ సాధించిన విజయాలు

​* ఎన్ఇపి 2020, నిపుణ్ భారత్ మిషన్‌కు అనుగుణంగా కె-5 తరగతుల విద్యార్థుల కోసం ఒక [www.rajclassroom.com] (http://www.rajclassroom.com) వెబ్‌సైట్‌ను, ఎఐ ఆధారిత యాప్ 'హలో ధృతి'ని రూపొందించారు.

​* ఈ యాప్ ద్వారా ప్రతి విద్యార్థి 3వ తరగతి ముగిసేలోపు ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు సాధించవచ్చు.

​* తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 2472 పాఠశాలలు, 1500 మందికి పైగా విద్యార్థులు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

​* పదేళ్లల్లో ఈ వెబ్‌సైట్‌కు 25 లక్షల హిట్స్ వచ్చాయి.

​* తెలుగు, ఆంగ్లం, గణితం కోసం 80 పాఠాలు, 50 వీడియోలు, 20 ఆటలతో కూడిన మరో విద్యా వెబ్‌సైట్ కూడా రాజేష్ అభివృద్ధి చేశారు.

​* జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల కోసం 6 వేలకు పైగా ప్రశ్నలతో కాంపిటెన్సీ బేస్డ్ అసెస్‌మెంట్ పరీక్షను రూపొందించారు.

​* డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎస్ సి ఇ ఆర్ టి టెక్స్ట్ బుక్స్‌ను అప్లోడ్ చేసి, మొబైల్ ఫోన్ ద్వారా కీ పాయింట్స్, క్విజ్‌లను నిర్వహిస్తూ ఖరీదైన కోచింగ్‌ను సులభంగా నేర్పిస్తున్నారు.

​* బోధనా, అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా స్వయంగా 4 పుస్తకాలు రచించారు. 3 పరిశోధనా పత్రాలు సమర్పించారు.100కు పైగా ప్రధాన మంత్రి ఈ-విద్యా కంటెంట్ వీడియోలు రూపొందించారు.

* రాజేష్ చేసిన కృషికి గాను 2019, 2023లో బ్రిటీష్ కౌన్సిల్ అవార్డులు, 2023, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి.​


- జ్యోతిర్మయి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్