సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్నార్థకంలో.. ఆమె భద్రత!

23 గంటల క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

సహాయం కోసం ఒక మహిళ గొంతెత్తినా... చుట్టూ భద్రత కోసం అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్నా... అవేవీ సకాలంలో పనిచేయని వ్యవస్థ ఉన్నంతకాలం... మహిళలకు భయంకరమైన రాత్రులు తప్పవు. తాజాగా ఢిల్లీ నోయిడాలో 16 ఏళ్ల బాలికపై జరిగిన దారుణం మరోసారి దాన్ని రుజువు చేస్తోంది. కదిలే బస్సులో మైనర్‌పై విరుచుకుపడిన నిందితులను కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టుతో ఈ సమస్య ముగిసిపోలేదు. ఈ కేసులో అసలు ప్రశ్న నిందితులు ఎవరు? అనేది మాత్రమే కాదు. నిందితులు నేరానికి పాల్పడేంత వరకు వ్యవస్థలో ఎన్ని భద్రతా గోడలు కుప్పకూలిపోయాయి? అన్నది. 2012లో నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసింది. 2013లో కఠినమైన చట్టాలు, ప్రజా రవాణాలో భద్రతా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కానీ, నేరాలు ఆగిపోలేదు. నిర్భయ తర్వాత ఈ దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యాచారాలు వెలుగుచూశాయి. అవన్నీ నిందితులను బయటపెట్టాయి కానీ... భయపెట్టలేదు. కొన్ని కేసుల్లో నేరం రుజువు కాలేదని నిందితులు స్వేచ్ఛగా జైలు నుంచి బయటకు వచ్చారు. కొన్నిచోట్ల అధికారంలో ఉన్నవాళ్లే పూల దండలు, మేళతాళాలతో వారికి స్వాగత సత్కారాలు చేశారు. ఇది ప్రమాదకరమైన ధోరణి!

జోరున వర్షం కురుస్తున్న ఆ రాత్రి 16 ఏళ్ల మైనర్‌.. తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు నోయిడా రోడ్డుపై వేచి చూస్తోంది. దూరంగా వస్తున్న బస్సును చూసి ఆపింది. సురక్షితం అని భావించిన ఆ ప్రయాణం ఆ బాలికకు భయంకర అనుభవాన్ని ఇచ్చింది. బస్సు డ్రైవరు, క్లీనరు కదిలే బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాధితురాలిని ఢిల్లీలోని కశ్మీర్‌గేట్‌ సమీపంలో వదిలేశారు. గ్రేటర్‌ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీర్‌గేట్‌ వరకు బస్సు దాదాపు 43 నుండి 47 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ మార్గంలో అనేక సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ బస్సును మధ్యలో ఎక్కడా తనిఖీ చేయలేదు. అంటే భద్రత కోసం అమర్చిన సీసీ కెమెరాలు అలంకారంగా మిగిలిపోయాయి. బస్సులో కెమెరా ఉన్నా పనిచేయలేదు! నేరం జరిగిపోయాక మాత్రమే దర్యాప్తు కోసం కెమెరాలను తనిఖీ చేయటం భద్రతా లోపానికి సాక్ష్యం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పానిక్‌ బటన్లు, జీపీఎస్‌ ట్రాకింగ్‌ వంటి భద్రతా పరికరాలను కూడా బస్సులో అమర్చుతున్నారు. తరువాత వీటి పనితీరుపై పర్యవేక్షణ లేదు. ఢిల్లీలోని ప్రైవేట్‌ బస్సులపై జరిపిన రియాలిటీ చెక్‌లో సీసీటీవీ కవరేజ్‌, పానిక్‌ బటన్లు, జీపీఎస్‌తో వాటి అనుసంధానంలో ఎన్నో లోపాలు బయటపడ్డాయి.

నేరాలు ఆగటం లేదు.. ఎందుకు?

ఇటీవల గ్రేటర్‌ నోయిడాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలోనూ తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. 2017లో లైంగిక దాడి, హత్య కేసుల్లో అతను అరెస్టయి జైలు శిక్ష అనుభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2025లో నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. కొన్ని నెలలకే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ప్రమాదకర నేర చరిత్ర ఉన్న వ్యక్తుల విషయంలో న్యాయవ్యవస్థ, జైలు, బెయిల్‌, పునరావాస వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా పనిచేస్తోంది? ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల్లో ఒకటి. సీసీ కెమెరాలు, స్మార్ట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలు, మొబైల్‌ ఫోన్లు, జీపీఎస్‌, ఎమర్జెన్సీ నంబర్లు, పోలీసు కంట్రోల్‌ రూమ్‌లు అన్నీ ఉన్నాయి. అయినా ఒక మహిళ లేదా బాలిక రాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు తనకు రక్షణ లేకుండా పోతోంది. ఈ ఘటనలో బస్సు అనేక సీసీటీవీ పాయింట్లను దాటింది. కానీ వాహనం లోపల ఏం జరుగుతుందో గుర్తించడానికి అవసరమైన వ్యవస్థ పనిచేయలేదు.

సత్వర న్యాయం జరగాలి

లైంగిక నేరాల్లో దర్యాప్తు వేగంగా జరగడం ఎంత ముఖ్యమో, కోర్టుల్లో కేసులు త్వరగా ముగియడం కూడా అంతే ముఖ్యం. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా విశ్లేషణ ప్రకారం, 2024 చివరికి దేశవ్యాప్తంగా అత్యాచారం కేసుల విచారణ కోసం 2.06 లక్షలకు పైగా కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఆ ఏడాది వాటిలో సుమారు 20,587 కేసుల్లోనే విచారణ పూర్తయింది. పెండింగ్‌ కేసులు 89.8 శాతం ఉన్నాయి. సాధారణంగా అత్యాచార కేసుల్లో నేరం జరిగిన తర్వాత బాధితురాలు న్యాయం కోసం మరో సుదీర్ఘ పోరాటం మొదలుపెట్టాలి. పోలీసు స్టేషన్‌ నుంచి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వరకు, అక్కడి నుంచి కోర్టు వరకు.. ఆమె ప్రయాణంలో ఎన్నో క్లిష్ట దశలు ఉంటాయి. ఒకపక్క ఆమె వాటన్నింటినీ ఎదుర్కొంటున్న సమయంలోనే మరోపక్క నిందితులు స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నారు. ఆమెకు భద్రత కల్పించాల్సిన వ్యవస్థ.. భయాన్ని చూపిస్తోంది.

మహిళ రాత్రి వేళ ఒంటరిగా ఎందుకు వెళ్లింది? ఎందుకు బస్సు ఎక్కింది? ఆ డ్రైవర్‌ను ఎలా నమ్మింది? అడగాల్సింది ఇలాంటి ప్రశ్నలు కాదు. ఆమెకు సహాయం కావాల్సినప్పుడు వ్యవస్థ ఎందుకు అందుబాటులో లేదు? ప్రజా రవాణాలో పానిక్‌ బటన్‌ ఎందుకు పనిచేయలేదు? ఇతర రక్షణ వ్యవస్థలు ఎందుకు ఫెయిలయ్యాయి? వీటి గురించి మాట్లాడాలి. అలాగే మహిళల పట్ల చిన్నచూపు చూసే వ్యవస్థ తీరు మారాలి. మహిళలు, యువతులు బయట తిరగడమే తప్పు అన్నట్టుగా భావించడం, తమ రాజకీయ భావాలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై పాలక పక్షాల ఆధ్వర్యంలోనే దారుణమైన ట్రోలింగ్‌ జరగడం కూడా ఇలాంటి నేరప్రవృత్తిని పెంచుతుంది. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి మార్పును సమాజంలో తీసుకురావాలి.

ఈ ఘటన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం బస్సుల్లో పానిక్‌ బటన్లు, వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాలు పనిచేసే స్థితిలో ఉండాలని, కర్టెన్లు, టింటెడ్‌ ఫిల్మ్‌లపై నిషేధాన్ని అమలు చేయాలని ప్రకటించింది. బస్సు సిబ్బందికి మహిళల భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు కూడా తెలిపింది. కానీ భద్రత అంటే పోలీసుల సంఖ్య మాత్రమే కాదు. సురక్షితమైన వాహనం, సర్టిఫైడ్ డ్రైవర్‌/సిబ్బంది, పనిచేసే సీసీటీవీ, నిరంతర జీపీఎస్‌, పనిచేసే పానిక్‌ బటన్‌ - వెంటనే స్పందించే కంట్రోల్‌ రూమ్‌ - మార్గంలో తనిఖీలు - వేగవంతమైన దర్యాప్తు - త్వరితగతిన న్యాయం.. అన్నీ ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేయాలి. ఈ గొలుసులో ఒక్క లింక్‌ తెగిపోయినా ఆమె ప్రమాదంలో పడినట్లే!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్