సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ యుద్ధం ఎంత అమానవీయమో...!

3 రోజుల క్రితం

ఆ యుద్ధం ఎంత అమానవీయమో...! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినిమా ప్రదర్శన ముగిసింది. హాల్లో లైట్లు వెలిగాయి. ఆ సినిమా కలిగించిన తీవ్ర భావోద్వేగంతో ప్రేక్షకులు తమ సీట్ల నుంచి లేచి, కరతాళ ధ్వానాలు మొదలెట్టారు. ఒకటీ రెండు నిమిషాలు కాదు, ఏకంగా 24.5 నిమిషాల పాటు ఆ చప్పట్లు మోగాయి. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలపై ప్రశ్నలు లేవనెత్తిన ‘నాజా’ డాక్యుమెంటరీకి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లభించిన స్పందన ఇది. ప్రదర్శన అనంతరం చిత్రానికి స్పెషల్ జ్యూరీ ప్రైజ్ కూడా దక్కింది. వెనిస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన స్టాండింగ్ ఒవేషన్‌గా ఈ డాక్యుమెంటరీ రికార్డు సృష్టించింది.

పాలస్తీనియన్లను హతమార్చడానికి ఇజ్రాయిల్ అనుసరిస్తున్న వ్యూహాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. సుమారు 80 నిమిషాల నిడివి ఉన్న ‘నాజా’ను ఇజ్రాయిల్ చిత్రనిర్మాతలు, పరిశోధనాత్మక పాత్రికేయులు యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ తెరకెక్కించారు. ‘నాజా’ అనేది ఒక దాడిలో ప్రాణనష్టానికి సంబంధించిన సంఖ్యను తెలిపేందుకు ఇజ్రాయిల్ సైనిక కమాండర్లు, గూఢచార సిబ్బంది ఉపయోగించే పదమని చిత్రబృందం పేర్కొంది. అత్యాధునిక నిఘా, డేటా, ఏఐ ఆధారిత వ్యవస్థలతో లక్ష్యాలను గుర్తించడం, దాడుల్లో ఎంతమంది చనిపోయే అవకాశం ఉందో అంచనా వేయడం వంటి అంశాలను డాక్యుమెంటరీ కళ్లకు కట్టినట్లు వివరించింది.

24 మందితో ఇంటర్వ్యూలు

ఈ డాక్యుమెంటరీ కోసం అబ్రహం, స్జోర్‌ మూడేళ్లలో ఇజ్రాయిల్ సైనిక, గూఢచార వ్యవస్థకు చెందిన 24 మందితో మాట్లాడారు. వారంతా ప్రాణభయంతో అజ్ఞాతంగానే మాట్లాడారు. రహస్య సమాచారం వెల్లడించిన విషయం బయటకు పొక్కితే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు. అందుకే వారి ముఖాలు, స్వరాలను చిత్రయూనిట్ డిజిటల్ సాంకేతికతతో మార్చింది. ఇంటర్వ్యూలను టెల్ అవీవ్‌లో రాత్రివేళ భవనాల పైకప్పులపై చిత్రీకరించారు. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ దాడుల వల్ల 70 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో మహిళలు, వేలాదిమంది చిన్నారులు ఉన్నారు. వేలాది ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. యుద్ధంలో టెక్నాలజీ పెరిగేకొద్దీ మానవీయ కోణం మరింతగా నాశనమైపోతుందా? అన్న ప్రశ్నను చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ డాక్యుమెంటరీని రూపొందించిన యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్‌లపై ఇజ్రాయిల్ సాంస్కృతిక శాఖ మంత్రి మికి జోహార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇజ్రాయిల్ సైనికులను, దేశాన్ని అపకీర్తి పాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకునేలా చట్టాలను మారుస్తామని ప్రకటించారు.

నిజం చెప్పటమే మా ఉద్దేశం

యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ పేర్లు అంతర్జాతీయ సినిమా ప్రపంచానికి కొత్తేమీ కాదు. పాలస్తీనా చిత్రనిర్మాతలు బాసెల్ అద్రా, హమ్దాన్ బల్లాల్‌లతో కలిసి వీరు రూపొందించిన ‘నో అదర్ ల్యాండ్’కు 2025లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డు దక్కింది. వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియుల ఇళ్ల కూల్చివేత, వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించడం, ఇజ్రాయిల్ ఆక్రమణ వంటి అంశాల నేపథ్యంలో ఆ చిత్రం తెరకెక్కింది. ‘నాజా’లో మాత్రం పాలస్తీనా పౌరుల బాధలతోపాటు.. ఇజ్రాయిల్ సైన్యం యుద్ధంలో అనుసరిస్తున్న వ్యూహాలను ప్రధానంగా చూపించారు. ఈ చిత్రం అవార్డుల కోసం కాదని, పౌరుల మరణాలు ప్రమాదవశాత్తు సంభవించడం లేదని, వారిని ఎంత వ్యూహాత్మకంగా హతమారుస్తున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఉద్దేశమని అబ్రహం అన్నారు. వేలకొద్దీ హ్యాక్ చేసిన మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన డేటాతో లక్ష్యాలను గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థ గురించి నిఘా అధికారులు తమకు వివరించినట్లు ఆయన తెలిపారు. ఓ ఇంట్లో చిన్నారి ఫోన్‌లో ‘డాడి ఇంటికి వచ్చారు’ అనే మాట వినిపించినా వైమానిక దాడి చేసినట్లు తమ ఇంటర్వ్యూల్లో అధికారులు చెప్పారని వెల్లడించారు.

యుద్ధం అంటేనే ఒక అమానవీయ చర్య. మనిషీ మనిషీ తలపడితే కనీసం ఏదో ఒక సందర్భంలో ఒక మానవీయ భావన, నష్టం తాలూకూ కష్టం రెండు వైపులా తెలిసొచ్చేది. ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడి నుంచో దాడి చేసి, క్షణాల్లో విధ్వంసం సృష్టించడంగా మారిపోయింది. యుద్ధోన్మాదులుగా మారిన పాలకుల చేతిలోని ఆధునిక ఆయుధాలు ఎంతటి విధ్వంసాన్ని, ఎంతటి రక్తపాతాన్ని, ఎంతటి దుఃఖాన్ని మిగులుస్తాయో పాలస్తీనా, ఇరాన్‌లో సాగుతున్న దాడులు చెబుతున్నాయి. ఇదేనా నాగరికత? ఇదేనా మనిషి సాధించాల్సింది? ఇలాంటి మానవీయ ప్రశ్నలను మన మనసులపై బలంగా వేస్తోంది ‘నాజా’. ఇది తప్పకుండా చూడాల్సిన డాక్యుమెంటరీ.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్