‘ఆమె ధైర్యాన్ని ఎన్నిసార్లు పరీక్షిస్తారు? ఎంతకాలం అమానవీయంగా చూస్తారు? పదే పదే అదే బాధను ఎంతకాలం అనుభవించాలి?’ అని ప్రశ్నిస్తున్నారు బిల్కిస్ బానో కేసు వాదిస్తున్న లాయర్ శోభా గుప్తా. కోర్టు బయట బిల్కిస్.. కోర్టు లోపల శోభ.. ఇద్దరు మహిళలు.. పోరాటం మాత్రం ఒక్కటే. తాజాగా సుప్రీంకోర్టు బిల్కిస్ కేసు నిందితుల్లో ఇద్దరి శిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై బిల్కిస్ ఎంత తల్లడిల్లిందో.. నేరస్తులను విడుదల చేసేందుకు ఎన్ని కుయుక్తులు పన్నారో వివరిస్తూ శోభ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘బిల్కిస్ చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఎక్కువసార్లు మౌనంగా ఉండిపోతుంది. తన భావాలను బయటకు వ్యక్తం చేయడం చాలా అరుదు. జరిగిన ఘటన గురించి పదే పదే మాట్లాడడం తనకు ఇష్టం ఉండదు. కోర్టు తీర్పులప్పుడు ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నప్పుడు ఆమె ఇంకా ముభావంగా మారిపోతుంది. ఇంతకాలం పోరాటం చేయాలని కూడా తనకు తెలియదు. భద్రతపై ఆందోళన, భవిష్యత్తుపై బెంగ బిల్కిస్లో ఎప్పుడూ కనిపించేవి. మొదటిసారి దోషులకు శిక్ష పడగానే.. ఇక ప్రశాంతంగా జీవించవచ్చు అనుకుంది. కానీ కోర్టు తీర్పులు ఆమెను పదే పదే పోరాడేలా చేశాయి. 2022లో గుజరాత్ కోర్టు 11 మంది నిందితులను రిమిషన్ నిర్ణయం ద్వారా ముందస్తు విడుదల చేసింది. ఆ సమయంలో బిల్కిస్ నిలువునా వణికిపోయింది. అప్పటికే నిందితులు వివిధ కారణాలతో పెరోల్ మీద గ్రామానికి వచ్చేవారు. 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉండేవారు. అప్పుడు బిల్కిస్, తన కుటుంబం ఎంతో భయపడేది. బెదిరింపుల కారణంగా ఇప్పటికే 24 సార్లు ఇల్లు మారింది. తన ఇద్దరు బిడ్డల చదువు రెండేళ్లు వెనకపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తుపై నాకు చాలా ఆందోళనగా ఉంటుంది.
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులో ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాత బిల్కిస్ భర్త నాకు ఫోన్ చేశారు. ‘శోభా మేడమ్, వాళ్లు మళ్లీ అదే చేశారు!’ అని ఆయన అన్నప్పుడు నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కోల్పోయిన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్న ఆ కుటుంబానికి ఇలాంటి వార్తలు పాత భయాలను గుర్తుచేస్తున్నాయి. ప్రతిసారీ దోషులు కోర్టును ఆశ్రయించడం, వారికి ఉపశమనం లభించడం, మళ్లీ బాధిత కుటుంబం భయాందోళనలకు గురికావడం పదే పదే జరుగుతోంది. నేను బిల్కిస్‌ను ‘హిమ్మత్’ (ధైర్యం) అని పిలుస్తాను. ఈ బెయిల్ వార్త తర్వాత నేను వీడియో కాల్లో బిల్కిస్‌తో మాట్లాడాను. ఆమె అదేపనిగా ఏడుస్తోంది. తనకు ధైర్యం చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. ‘నీ పేరేమిటో నీకు తెలుసు కదా! నువ్వు మాకు ఎంతటి ధైర్యాన్ని ఇస్తావో తెలుసా? మరి ఎందుకు ఏడుస్తున్నావు?’ అన్నాను. అయితే ఆమె ధైర్యాన్ని ఎన్నిసార్లు పరీక్షిస్తారు? ఎన్నిసార్లు ఆమెను అమానవీయంగా చూస్తారు? ఎన్నిసార్లు అదే మానసిక వేదనను అనుభవించేలా చేస్తారు?
‘ఈ దేశంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడం, నిజాలను దాచడం అంత సులభమా? అంటే నా 30 ఏళ్ల అనుభవంలో కచ్చితంగా ‘కాదు’ అని చెబుతాను. సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కచ్చితంగా ఉంటాయి. తమను తప్పుదోవ పట్టించారని తెలిసినప్పుడు న్యాయమూర్తులు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఆ కేసులో సంబంధం ఉన్న న్యాయవాదులను నేరుగా నిందిస్తారు. అందుకే సుప్రీంకోర్టులో ఎవరు పడితే వాళ్లు కేసులు దాఖలు చేయలేరు. కేవలం ‘అడ్వకేట్ ఆన్ రికార్డ్’ (ఎఒఆర్) మాత్రమే చేయగలరు. బిల్కిస్ కేసు గురించి ఎఒఆర్ సమర్పించిన అఫిడవిట్లలో ‘నేను ఏ విషయం దాచలేదు. అన్నీ నిజాలనే సమర్పించాను’ అని ఉంటుంది. దానిపై లాయర్ ధ్రువీకరణ ఇస్తారు. అంటే కోర్టు ఆ ‘రికార్డు’ మీదనే ఆధారపడుతుంది. కోర్టు తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన కీలక బాధ్యత ఎఒఆర్ పై ఉంది. ఈ కేసులో రిజిస్ట్రీకి కూడా బాధ్యత ఉంది. ఈ అంశంలో గతంలో ఏదైనా తీర్పు వచ్చిందా? ఒకవేళ వస్తే.. న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనట్లయితే, ఆ నిబంధనల ప్రకారం ఈ కేసును అదే న్యాయమూర్తి లేదా ఆ బెంచ్ దగ్గరకు పంపాలి.
ఈ కేసులో తాజా ఆర్డర్లో కోర్టు ప్రస్తావించిన వ్యాఖ్యలను చూస్తే.. వాళ్లు కోర్టును తప్పుదోవ పట్టించారని అనిపిస్తోంది. ఎందుకంటే దోషులు కస్టడీలో ఉన్నారని కోర్టు చెప్పింది. అది తప్పు అని చెప్పడానికి నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. వాళ్లు అంతకాలం కస్టడీలో లేరు. బిల్కిస్ కేసు దోషులు ఎప్పుడూ కోర్టు ముందే ఉంటారు. వారి రిమిషన్ కేసును చాలా పెద్ద న్యాయవాదులే వాదించారు. కాబట్టి వాళ్లకు చట్టపరమైన సాయం అందుబాటులో లేదనేది వాస్తవం కాదు. వాళ్లు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఒక వ్యక్తికి తీవ్ర వైకల్యం ఉందని రికార్డుల్లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ తీవ్రమైన వైకల్యం ఏంటి? అంటే ఆ వివరాలు లేవు. బెయిల్ ఇవ్వడానికో.. శిక్ష నిలుపుదల చేయడానికో వ్యక్తిగత వాదన ఒక్కటే సరిపోదు. వైద్యపరమైన ఆధారాలు చూపించాలి. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్టు కోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా కనిపించలేదు. జైలు అధికారులను అఫిడవిట్ దాఖలు చేయమని అడిగినట్టు కూడా కనిపించలేదు. న్యాయవాదులు సమర్పించిన దరఖాస్తును బట్టి శిక్షను నిలిపివేస్తున్నట్లు మాత్రమే ఉంది.
సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలిస్తున్నప్పుడు రిమిషన్ అంశాన్ని కచ్చితంగా రికార్డుల్లో చేర్చాలి. కానీ, ఆ ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టారు. గతంలో ఇచ్చిన రిమిషన్ను రద్దు చేస్తూ తిరిగి జైలుకు వెళ్లమని తీర్పు ఇచ్చిన విషయం, మహారాష్ట్ర రిమిషన్ పాలసీ వర్తించే వరకు అంటే కనీసం 28 ఏళ్లు పూర్తయ్యేవరకు వేచి చూడమని చెప్పిన విషయాన్ని ఎలా వదిలేస్తారు? ఒకవేళ పేర్కొని ఉంటే.. ఈ ఉత్తర్వు కచ్చితంగా వచ్చేది కాదు. ఎందుకంటే ఆ అంశాన్ని పేర్కొంటే.. ఈ విషయం మొదట జస్టిస్ నాగరత్నం బెంచ్ ముందుకు వచ్చేది. కీలకమైన తీర్పు ఇచ్చి, చట్టాన్ని నిర్దేశించిన న్యాయమూర్తులు ఇంకా సుప్రీంకోర్టులోనే ఉన్నారు. ఆ అంశాన్ని వారే విచారించాలి. అంటే జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముందుకు ఈ విచారణ రావాలి. మరే ఇతర బెంచ్‌కూ దీనిని పంపకూడదు. దీనిపై ఐదు సార్లు విచారణ జరిగింది. కానీ ఒక్కసారి కూడా నాగరత్న బెంచ్‌కు వెళ్లలేదు. ఇది ఎలా సాధ్యం? రిజిస్ట్రీ కూడా విధి నిర్వహణలో విఫలమైంది. లాయర్లు, ఎఒఆర్, రిజిస్ట్రీ ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదోవ పట్టించారు.
లైంగిక వేధింపుల వంటి నేరాల్లో ప్రతి దశలోనూ బాధితురాలి అభిప్రాయం తీసుకోవాలి. రిమిషన్ ఆర్డర్ అప్పుడు కూడా కోర్టు బిల్కిస్‌ను పిలవలేదు. ఇప్పుడూ తనను ప్రతివాదిగా చేర్చలేదు. ఇది బిల్కిస్‌కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు.. లైంగిక నేరాలకు గురైన బాధితులందరిదీ. ఇకనుండైనా లైంగిక వేధింపుల కేసులన్నింటిలో బాధితురాలి వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని చట్టంలో స్పష్టం చేయాలి. ఆమె వాదన వినకుండా ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వకూడదు. తాజా కోర్టు ఉత్తర్వులు బిల్కిస్‌కు మాత్రమే కాదు.. మనందరికీ కూడా దిగ్భ్రాంతికరమైన పరిణామం.’’








కామెంట్లు (0)