బిల్కిస్ బానో మళ్లీ ఓడిపోయింది.. అత్యాచార బాధితురాలికి ఆ నేరం జరిగినప్పుడు మాత్రమే కాదు. ఆ గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఎన్నో సార్లు అన్యాయానికి, అక్రమానికి గురవుతూనే ఉంటుంది. నిందితులకు శిక్ష పడాలని, బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు న్యాయస్థానాల గడప ఎక్కిన ప్రతిసారీ ఊహించని సవాళ్లు, అవమానాలు, నిందలు వెంటాడుతాయి. గుజరాత్ అల్లర్ల అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో ఉదంతం మరోసారి ఈ విషయాన్ని రుజువుచేసింది. తనకు అన్యాయం చేసిన వాళ్లకు శిక్ష పడితే నిర్భయంగా జీవించవచ్చు అని ఆమె అనుకుంది. కానీ.. న్యాయస్థానాల తీర్పులు, అప్పీళ్లు, శిక్షల నిలుపుదల, బెయిళ్లు ఆ ఆశను, భరోసాను మళ్లీ మళ్లీ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సామాన్యులైన బాధితులు ఎంతోమందికి ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారు.
2002 గుజరాత్ అల్లర్లు.. మత విద్వేష మూకలు సామాన్యులపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయి. పిల్లలు, మహిళలు, ముసలివాళ్లు, పురుషులు అన్న తేడా లేకుండా కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఊచకోత కోశాయి. ఆ హింసలో ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. బిల్కిస్ కళ్లెదుటే తన మూడేళ్ల కూతురు తలను బండకేసి బాదాడు ఓ విద్వేషి. ఆ దారుణం కళ్లెదుట ఉండగానే తనపై లైంగిక దాడి జరిగింది. ఇంత భీకర పరిస్థితి నుంచి బయటపడిన బిల్కిస్ ఆ నేరం చేసిన నిందితులకు శిక్ష పడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఆరేళ్ల నిరీక్షణ తరువాత 2008 జనవరిలో నిందితులైన 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ఆ 11 మంది దోషులను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తరువాత బిల్కిస్ భయంతో వణికిపోయింది. జైలు నుంచి విడుదలైన నిందితులు తనను, తన కుటుంబాన్ని హింసిస్తారని వాపోయింది. బయటకొచ్చిన నిందితులకు బిజెపి పెద్దలు పూలమాలలతో సన్మానించారు. బ్యాండు మేళాలు వాయిస్తూ, టపాకాయలు కాలుస్తూ గ్రామస్తులు వాళ్లను ఊళ్లోకి ఘనంగా స్వాగతించారు. ఆ భయంకర వాతావరణంలోనే బిల్కిస్ న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2024 జనవరిలో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దోషులు తిరిగి జైలుకు వెళ్లారు. రెండేళ్లు గడవకముందే 17 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారనే కారణంతో 11 మందిలో ఇద్దరు దోషుల శిక్షను నిలిపివేస్తూ అక్టోబర్ 28న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు నవంబర్ 16న వెలుగులోకి వచ్చింది. తనకు సమాచారం ఇవ్వకుండా, తన వాదన వినకుండా నిర్ణయం తీసుకున్నారని బిల్కిస్ బానో ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. మళ్లీ భయం తనను చుట్టుముడుతోందని, ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ న్యాయం కోసం పోరాడతానని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆమె తన గ్రామాన్ని వదిలి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అన్యాయం జరిగిన మహిళ న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎక్కితే.. భరోసా కల్పించాల్సిన వ్యవస్థ ఆమెను భయంలోకి నెట్టేసింది. ఉన్న ఊరును, అయినవాళ్లను, అందరినీ వదులుకుని వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది.
అనాదిగా పోరాటం..
రాజస్థాన్‌కు చెందిన భన్వరీ దేవి బాల్యవివాహాలను అడ్డుకునే సామాజిక కార్యకర్త. 1992లో తన విధి నిర్వహణలో భాగంగా ఒక బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం, విచారణలో ఎదురైన అవమానాలు, న్యాయస్థానంలో ఆమె వాంగ్మూలంపై సందేహాలు.. అన్నీ భన్వరీ దేవి పోరాటాన్ని ఎంతో కష్టతరం చేశాయి. అయినా ఆమె పోరాడింది. 1995లో ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ కేసు దేశంలో సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడాయి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు చట్టం వచ్చింది. అయినా ‘ఆమె’కు న్యాయం అందని ద్రాక్షగానే ఉండిపోయింది.
ఉన్నావ్ బాధితురాలి పోరాటం!
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి జీవితం కూడా ఇంకా అంధకారంగానే సాగుతోంది. 2017లో మైనర్ బాలికపై అప్పటి బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. పోక్సో చట్టం ఉన్నా ఆ మైనర్‌కు తక్షణ న్యాయం జరగలేదు. పోలీసుల నిర్లక్ష్యం, బాధితురాలి తండ్రి కస్టడీ మరణం, కుటుంబానికి బెదిరింపులు, రోడ్డు ప్రమాదాలు వంటి ఎన్నో విషాద పరిణామాలను ఆ బాలిక ఎదుర్కొంది. నిందితుడికి జీవిత ఖైదు పడినా, ఆ తర్వాత శిక్ష నిలుపుదల, బెయిల్ మంజూరు వంటి పరిణామాలతో బాధితురాలు భయపడుతూనే బతకాల్సి వస్తోంది. 2025 డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును నిలిపివేసింది. 2026 మార్చిలో సుప్రీంకోర్టు బాధితురాలిని సీబీఐ అప్పీల్లో భాగస్వామిగా అనుమతించింది. ఎనిమిదేళ్లుగా బాధితురాలి న్యాయపోరాటం పూర్తవ్వలేదు. అత్యాచార నేరాన్ని నిరూపించుకున్నా.. దోషికి పడిన శిక్షను నిలబెట్టుకోవడానికి ఆమె మళ్లీ మళ్లీ న్యాయస్థానం గడప తొక్కాల్సి వస్తోంది.
హత్రాస్, ఉత్తరాఖండ్ దారుణాలు..
2020లో ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి, చంపేశారు. ఆమె మరణం, అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన అంత్యక్రియలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బహిరంగంగా ఇంత ఘోరం జరుగుతుంటే.. కోర్టు విచారణ అనంతరం అత్యాచారం, హత్య అభియోగాల్లో నిందితులుగా ఉన్న వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. కుటుంబం తీర్పును సవాలు చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో న్యాయం కోసం ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
2022 ఉత్తరాఖండ్‌లో జరిగిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కేసు కూడా ఇలాంటిదే.. 19 ఏళ్ల అంకితను అత్యాచారం చేసి చంపేశారు. ఆ ఘోరానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని అంకిత వృద్ధ తల్లిదండ్రులు నేటికీ పోరాడుతున్నారు. ఇటీవల రాజ్‌ఘాట్‌లో న్యాయం కోసం మౌన నిరసన చేస్తున్న అంకిత తల్లిదండ్రులను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. అక్కడితో వాళ్లపై నిందలు, నిర్బంధాలు ఆగలేదు. నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న, బిజెపిలో కీలక పదవిలో ఉన్న వినోద్ ఆర్య అంకిత వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కూడా అంకిత అమ్మానాన్న పోరాడుతున్నారు.
బిల్కిస్ బానో, భన్వరీ దేవి, ఉన్నావ్, హత్రాస్, అంకిత ఉదంతాలు వేర్వేరు కాలాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో జరిగాయి. కానీ అన్ని సందర్భాల్లో బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు అండగా నిలవాల్సిన వ్యవస్థలు ఎంతవరకు సహకరిస్తున్నాయి? న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి సాగుతున్న విచారణల మధ్య బాధితుల జీవితానికి, గౌరవానికి, భద్రతకు భరోసా ఎవరు ఇస్తారు? న్యాయస్థానాల్లో కేసులు పూర్తవుతున్నా.. బాధితురాలి మనసులో భయం ఎందుకు పోవడం లేదు? ఇన్ని ప్రశ్నల మధ్య బాధితులకు న్యాయం అందిందని ఎలా చెప్పగలం? పైన ప్రస్తావించిన కేసులు అన్నిటిలోనూ నిందితులకు బిజెపి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉండడం అనేది వాస్తవం.








కామెంట్లు (0)