‘ఇరుముడి’లో తండ్రి గారాల తనయగా, ధైర్యంగా మాట్లాడే మణెమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది బాలనటి నక్షత్ర. సినిమా అంతటా కనిపిస్తూ, తన సహజమైన నటనతో మణెమ్మ పాత్రకు ప్రాణం పోసింది. భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. నాలుగో తరగతిలోనే సినిమాల్లోకి వచ్చిన నక్షత్ర, ఇప్పుడు ఏడో తరగతి చదువుతూనే నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి లేకపోయినా అమ్మే తనకు అండగా ఉంటూ నటనలో ప్రోత్సహిస్తున్నారని చెబుతున్న నక్షత్ర, ‘ఇరుముడి’ కోసం తెలుగు నేర్చుకుని, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. రీల్స్ చేస్తూ మొదలైన తన ప్రయాణం ‘ఇరుముడి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎలా వచ్చిందో... తన అనుభవాలను ఇలా చెబుతోంది.
నేను కన్నూర్ జిల్లాలోని ఎడక్కాడ్, కడంబూర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాను. ఎల్‌కేజీలో ఉన్నప్పటి నుంచే నాకు నటనపై ఆసక్తి ఉంది. నాలుగో తరగతి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటాను. వాటిని చూసిన ‘ఇరుముడి’ చిత్ర బృందం నన్ను ఆడిషన్‌కు పిలిచింది. ‘ఇరుముడి’ గురించి ధనుష్ గారు, చిరంజీవి గారు, రష్మిక మందన్న గారు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ధనుష్ గారు స్వయంగా నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. సినిమా చూసినప్పుడు తాను భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నానని కూడా ఆయన చెప్పారు. ‘ఇరుముడి’ షూటింగ్ కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో చాలా రోజులు ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడే తెలుగు నేర్చుకున్నాను. ‘ఇరుముడి’ తెలుగు వెర్షన్‌కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. అప్పటికే సంభాషణలన్నీ కంఠస్థమయ్యాయి. తెలుగు కూడా అర్థమయ్యేది. అందుకే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.
గ్లిజరిన్ లేకుండానే ...
దర్శకుడు శివ సార్ ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు. మొదట్లో ఇంగ్లీషులో సూచనలు ఇచ్చేవారు. నాకు తెలుగు అర్థమయ్యాక తెలుగులోనే చెప్పేవారు. ‘ఇరుముడి’లో చాలా ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. వాటిని సరిగ్గా చేయగలనా అని మొదట భయపడ్డాను. కానీ శివ సార్‌తో సాన్నిహిత్యం పెరిగాక ఆ భయం పోయింది. సంభాషణలను ముందుగానే కంఠస్థం చేసుకునేదాన్ని. అందువల్ల చాలా సన్నివేశాలను ఒకటి రెండు టేకుల్లోనే పూర్తి చేయగలిగాను. ఎమోషనల్ సన్నివేశాల్లో నేను కొన్నిసార్లు మాత్రమే గ్లిజరిన్ ఉపయోగించాను. ఒకసారి ప్రియా మేడమ్ ఏడవడానికి గ్లిజరిన్ వాడొద్దా అని అడిగారు. నాకు అవసరం లేదని చెప్పాను. నేను సన్నివేశం మూడ్‌లోకి వెళితే సహజంగానే ఏడవగలను. ‘ఇరుముడి’ షూటింగ్‌లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరులో జరిగింది. డ్యామ్‌పై కూర్చుని చేపలు పడుతున్న సన్నివేశాన్ని చూసి శివ సార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్రైలర్‌లో నేను సైకిల్ నడుపుతూ కింద పడే సన్నివేశం ఉంది. అక్కడ అంతా బురద, నీళ్లే. సైకిల్ నడుపుతూనే అకస్మాత్తుగా కింద పడాలని చెప్పారు. ఎంత ప్రయత్నించినా కావాలని అలా పడటం నాకు సాధ్యం కాలేదు. చివరకు సైకిల్ నడపడం, కింద పడటం రెండింటినీ వేర్వేరు షాట్లుగా చిత్రీకరించారు. ఈ సినిమాలో నేను చనిపోయే సన్నివేశం కూడా ఉంది. అందులో ఊపిరి బిగబట్టి ఉండాల్సి వచ్చింది. క్లోజప్ షాట్ల సమయంలో ఊపిరి వదలకుండా ఉండేదాన్ని. నేను చాలా సేపు ఊపిరి బిగబట్టి ఉంచగలిగాను. రవితేజ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా ఉంటారు. నన్ను తన సొంత కూతురిలాగే చూసుకునేవారు. ఆయన కూతురు కూడా అప్పుడప్పుడు షూటింగ్ సెట్‌కు వచ్చేది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేది. రవితేజ గారు కూడా నాతో అంతే ఆప్యాయంగా ఉండేవారు.

అమ్మ ప్రోత్సాహంతోనే...
‘ఐ, నోబడీ’, ‘ఇరుముడి’, ‘డాడ్’ మూడు సినిమాలూ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపించేవే. ముగ్గురు గొప్ప నటులకు కూతురిగా నటించడం నాకు గర్వంగా ఉంది. ‘ఇరుముడి’ మలయాళ వెర్షన్‌లో మమ్ముట్టి గారితో నాకు కలిసి నటించే సన్నివేశాలు లేవు. కానీ సెట్‌లో కలిసినప్పుడు ఆయనే వచ్చి నాతో మాట్లాడారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ‘డాడ్’ సినిమాలో శివరాజ్‌కుమార్ గారితో నటించాను. సూరజ్ వెంజరమూడు గారు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నేను ఎక్కడా డ్యాన్స్ శిక్షణ తీసుకోలేదు. నాకు ఇష్టంతో, ఆసక్తితోనే డ్యాన్స్ చేస్తాను. సాధారణంగా వివిధ సినిమాల పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాను. ‘ఇరుముడి కట్టు’ పాట విడుదలైన తర్వాత చాలామంది నా డ్యాన్స్ స్టెప్పులను తమ రీల్స్‌లో చేయడం చూసి చాలా ఆనందంగా అనిపించింది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో ‘ఇరుముడి’ మొదటి షో చూశాను. దర్శకుడు శివ నిర్వాణ, ఆయన భార్య, మా అమ్మ, మా మామయ్య నాతో కలిసి సినిమా చూశారు. థియేటర్‌లో నా పాత్ర చనిపోయి పడి ఉన్న దృశ్యాన్ని చూసి మా అమ్మ చాలా బాధపడింది. టీవీలో వచ్చినా ఆ సన్నివేశాన్ని మళ్లీ చూడనని చెప్పింది. నేను మంచి నటిని కావాలని మా అమ్మ కోరుకుంటుంది. ప్రతి విషయంలోనూ ఆమె నాకు సహాయం చేస్తుంది. నా రీల్స్ కోసం పాటలను కూడా ఎంపిక చేస్తుంది. నేను నటనపై మాత్రమే దృష్టి పెడతాను. ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సమయంలోనే ‘ఐ, నోబడీ’ ఓటీటీలో విడుదలైంది. నేను కన్నూర్ వెళ్లినప్పుడు ఆ సినిమా చూసినవాళ్లు చాలా బాగుందని చెప్పారు. నా స్కూల్ టీచర్లు కూడా ఫోన్ చేసి నా నటనను ప్రశంసించారు. ఆ సినిమాలో నా పాత్ర కొద్దిసేపే ఉంటుంది. అయినా ప్రేక్షకులు, నా టీచర్లు గుర్తించి ప్రశంసించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.






కామెంట్‌లు (0)