ఎన్‌ఎంసి ప్రకటన
న్యూఢిల్లీ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఈ నెల 17 నుండి అమల్లోకి వచ్చేలా మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023 (ఎంఎస్‌ఎంఇఆర్-2023)ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ను ఈ నెల 17న గెజిట్‌లో ప్రచురించారు. ఎంఎస్‌ఎంఇఆర్ - 2023 స్థానంలో ఒక్క కొత్త నిబంధన కూడా తీసుకురాలేదు. దానికి బదులుగా, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం, 2019, ఇతర వర్తించే నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలు వార్షిక వెల్లడి నివేదికలను (ఎడిఆర్) సమర్పించాలనే నిబంధన కొనసాగుతుందని ఎన్‌ఎంసి తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో మరింత జవాబుదారీతనం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎన్‌ఎంసి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ఉపసంహరణతో మూడు కీలక రంగాలలో లోపాలు తలెత్తవచ్చని ఆరోగ్య కార్యకర్తలు, వైద్య విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, పేషెంట్ సేఫ్టీ అండ్ యాక్సెస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (పిఎస్‌ఎఐఐఎఫ్) వ్యవస్థాపక-డైరెక్టర్ అయిన బెజోన్ కుమార్ మిశ్రా, ఈ ఉపసంహరణ పారదర్శకత, జవాబుదారీతనం, వైద్య విద్య నాణ్యతపై ఆందోళనలను రేకెత్తించిందని అన్నారు. ఎన్‌ఎంసి చట్టం, 2019, తనిఖీలు, అమలు కోసం చట్టబద్ధమైన అధికారాలను కల్పిస్తున్నప్పటికీ, దానికి సమానమైన రక్షణ చర్యలను స్పష్టం చేయకుండా ఒక వివరణాత్మక నియంత్రణ చట్రాన్ని ఉపసంహరించుకోవడం, సంస్థాగత లోపాలు, తప్పుడు వెల్లడింపులను ఎలా పరిష్కరిస్తారనే దానిపై అనిశ్చితిని సృష్టిస్తుందని ప్రొఫెసర్ మిశ్రా అన్నారు.







కామెంట్‌లు (0)