ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుమ్మడి గుజ్జుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

13 నవంబర్, 2026

గుమ్మడి గుజ్జుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 05:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

గుమ్మడికాయతో రకరకాల వంటకాలు చేసుకోవడం మనకు తెలిసిందే. గుమ్మడికాయ పులుసు, కూర, పప్పు, సాంబారు వంటి సంప్రదాయ వంటకాలు తెలుగు ఇళ్లలో తరచూ కనిపిస్తాయి. ఈ సీజన్‌లో గుమ్మడికాయలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని కేవలం కూరలకే పరిమితం చేయకుండా ఉడికించి గుజ్జుగా తయారుచేసుకుని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

గుజ్జు తయారీ ఇలా...

ముందుగా గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, కోసి లోపల ఉండే గింజలు, పీచు తొలగించాలి. పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్‌లో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో కొద్దిగా నీరు పోసి ఒకటి రెండు విజిల్స్‌ వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చు. ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఈ గుజ్జును పూర్తిగా చల్లార్చి శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో మూడు నుంచి నాలుగు రోజులు ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే చిన్న చిన్న పరిమాణాల్లో విడగొట్టి ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి.

గుజ్జుతో కొత్త రుచులు

గుమ్మడికాయ గుజ్జును మనకు అలవాటైన ఆహార పదార్థాల్లోనూ కలుపుకోవచ్చు. గుజ్జులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి కలిపి వేడి చేస్తే సూప్‌ తయారవుతుంది. దోశ పిండిలో రెండు మూడు చెంచాల గుమ్మడికాయ గుజ్జు కలిపి దోశలు వేసుకోవచ్చు. ఉడికించిన ఓట్స్‌లో గుజ్జు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపితే పోషక విలువలున్న అల్పాహారం సిద్ధమవుతుంది. చిక్కటి పెరుగులో గుమ్మడికాయ గుజ్జు, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవచ్చు. పాలు లేదా చక్కెర కలపని పెరుగుతో గుజ్జును మిక్సీ పట్టి స్మూతీగా కూడా తయారుచేసుకోవచ్చు.

ఆరోగ్యానికి మేలు

గుమ్మడికాయలో బీటా కెరోటిన్‌ అధికంగా ఉంటుంది. దీనివల్లే దానికి నారింజ రంగు వస్తుంది. శరీరం బీటా కెరోటిన్‌ను విటమిన్‌-ఎగా మార్చుకుంటుంది. ఇది కంటిచూపు, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడటంతోపాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. గుమ్మడికాయలో పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండటానికి, కండరాల పనితీరుకు, శరీరంలో ద్రవాల సమతుల్యతకు దోహదపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు నియంత్రణకు అనువైన ఆహారంలోనూ దీన్ని చేర్చుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు గుమ్మడికాయను తగిన పరిమాణంలో తీసుకోవాలి. గుజ్జులో చక్కెర, బెల్లం కలపకుండా సూప్‌, కూరలు, పప్పు వంటి రూపాల్లో తీసుకోవడం మంచిది. గుమ్మడికాయ గింజలను ఎండబెట్టి పెనంపై దోరగా వేయించుకోవచ్చు. వీటిని చిరుతిండిగా తినవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్