సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మానసిక ఆరోగ్య ప్రచారకురాలు

04 అక్టోబర్, 2026

మానసిక ఆరోగ్య ప్రచారకురాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఢిల్లీ వాసి సెహర్ హస్మీ.. స్టైలిస్ట్, ఆర్టిస్ట్, బైకర్, మోటివేషనల్ స్పీకర్. తను మాత్రం 'మానసిక ఆరోగ్య ప్రచారకురాలు' అన్న గుర్తింపును ఇష్టపడతారు. ఒకప్పుడు తీవ్ర మానసిక సమస్యలతో సతమతమైన ఆమె, తన సొంత అనుభవాలను బహిరంగ వేదికలపై చర్చిస్తూ.. కొంతమందిలోనైనా మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. 'బ్రేకింగ్ స్టిగ్మా-ఒన్ మైల్ ఎట్ ఎ టైం' పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మోటార్ బైక్‌పై ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్ల దూరంలో నగరాలు, గ్రామాలు సందర్శిస్తూ, మానసిక సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తాజాగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు పాఠశాలలు, కళాశాలల్లో ఆమె కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులతో తను మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది తాము ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలను ధైర్యంగా బయటపెట్టారు. ‘తనకు ఎవరూ లేరు' అన్న స్థితి నుంచి.. ‘నా మాట వినడానికి ఎవరో ఒకరు ఉన్నారు' అన్న ధైర్యం ఇవ్వడం చాలా అవసరమని సెహర్ అంటున్నారు.

తన వ్యక్తిగత అనుభవాల నుంచి తోటి వారికి ధైర్యాన్ని ఇవ్వగలిగిన సంఘటనలు, అనుభవాలూ సెహర్ జీవితంలో చాలానే ఉన్నాయి. ఆమె అనాథాశ్రమంలో పెరిగింది. కన్నతల్లి ఎవరో తెలియదు. ముగ్గురు ఆడపిల్లలను పోషించలేని ఓ పేద కుటుంబం 9 నెలల పసికందుగా తాను ఉన్నప్పుడు అనాథాశ్రమంలో విడిచిపెట్టింది. అమ్మ ప్రేమకు నోచుకోని వేదనతోనే సెహర్ బాల్యం నిండిపోయింది. ప్రముఖ సామాజిక కార్యకర్తలు షబ్నం హస్మీ, గౌహర్ రజా దంపతులు దత్తత తీసుకున్నారు. మానసిక సమస్యలతో తీవ్రంగా బాధపడే సెహర్ చదువులో వెనుకబడి ఉండేవారు. తన చదువు, ప్రవర్తనపై టీచర్లు ఎప్పుడూ కంప్లైంట్లు ఇచ్చేవారు. అయితే ఆమె దత్తత తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రేమించారు. 'నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు.. చదవడం, రాయడం నేర్చుకోవడానికి ఆమెకు జీవితమంతా సమయం ఉంది' అని తల్లి చెప్పేది.

చేదు బాల్యం

బాల్యం తాలూకు చేదు జ్ఞాపకాలు, తీవ్రమైన అలజడి, అస్థిరత్వం సెహర్‌ను చాలా కాలం వెంటాడాయి. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రుల సాంగత్యంలో సృజనాత్మక వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. అయితే బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమె ధైర్యాన్ని దెబ్బ తీస్తూనే ఉండేవి. ఎవరైనా తన డిజైన్లను తిరస్కరిస్తే ఎంతో కుంగిపోయేవారు. అలా ఒక నటుడి నుంచి ఎదురైన వ్యతిరేకత తనను ఆ రంగాన్ని విడిచిపెట్టడానికి దారితీసింది. 'మానసిక స్థిరత్వం లేకపోవడం వల్లే ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. చాలా సంవత్సరాల పాటు చాలా గందరగోళం, నామోషి భావన ఉండేవి. తీవ్రమైన హింసాత్మక ఆలోచనలు వచ్చేవి. వస్తువులను పగలగొట్టేదాన్ని. రోడ్డుపైకి పరుగెత్తి ట్రక్కుల ముందు దూకాలని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంకొన్ని సార్లు పై నుంచి దూకేయాలనే ఉద్దేశంతో ఆరో అంతస్తు వరకు ఎక్కేదాన్ని. నా మనస్సు ఎప్పుడూ నా నియంత్రణలో ఉన్నట్లు అనిపించేది కాదు' అని సెహర్ తాను ఒకప్పుడు ఏ విధంగా మానసిక సమస్యలతో, ఒంటరితనంతో ఇబ్బందిపడిందో వివరిస్తారు.

అండగా నిలిచిన అమ్మ

తీవ్ర స్థితిలో ఉన్న సెహర్‌ను మానసిక ఆసుపత్రిలో చేర్పించమని చుట్టూ ఉన్నవారు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. సెహర్ తల్లి షబ్నం అందుకు ఒప్పుకోలేదు. తీవ్ర మానసిక ఆందోళనతో సతమతమయ్యే తనను దూరం పెట్టడం కాక, తోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. సైకియాట్రిక్ చికిత్స, మందులు, థెరపీతో తన బిడ్డ క్రమంగా కోలుకునేలా సహాయపడింది. 'ఈ రోజు నేను మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి నా తల్లిదండ్రులు నా పట్ల చూపించిన ప్రేమ ఒక కారణం' అని సెహర్ తన సెషన్లలో చెబుతారు. 'మానసిక ఆందోళనలతో బాధపడుతున్న వ్యక్తులకు సంరక్షణ, చికిత్స, అవగాహన ఎంతో అవసరం' అని అంటారు. 'ప్రారంభంలో, సమాజం ముందు నా బలహీనతలను చెప్పడానికి భయమేసింది. ఒక్క వ్యక్తి తన మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు, అది మరొకరికి కూడా ధైర్యాన్ని ఇస్తుందని గ్రహించాను' అంటున్నారు.

వినడం.. ఓ భరోసా

సెహర్ తన ప్రయాణంలో ఎందరో చిన్నారులు, మహిళలు, యువతీయువకులను కలిశారు. జమ్మూకాశ్మీర్ పోలీస్ మహిళా బెటాలియన్ బృందంతో మాట్లాడడం ఎప్పటికీ మరిచిపోలేనిది అంటున్నారు. ‘పైకి ఎంతో దృఢంగా కనిపించే వ్యక్తులు కూడా తీవ్రమైన మానసిక భారాన్ని మోస్తున్నారని ఆ సెషన్ నిరూపించింది' అని ఆమె చెప్పారు. 'బైక్‌పై ప్రయాణించడం కేవలం కిలోమీటర్లలో కొలవలేం. ఎన్నో కథలు నాతో పాటు ప్రయాణిస్తున్నాయి. వేలాదిమందితో మాట్లాడిన తరువాత నేను చెప్పేది ఒకటే.. ‘తీర్పు చెప్పే ముందు వినండి' అని. మహిళలతో మాట్లాడుతున్నప్పుడు నాకు తరచూ 'నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు' అన్న మాటలు వినిపిస్తాయి. అందరి మానసిక సమస్యలు ఒకేలా ఉండవు. సామాజిక, ఆర్థిక, కులం, మతం, లింగపరమైన వ్యత్యాసాలు కూడా ఇందులో ప్రభావం చూపిస్తాయి' అని ఆమె అంటున్నారు. 'విద్యావ్యవస్థలో మానసిక సమస్యల అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగా ఉండకూడదు' అని చెబుతున్న సెహర్, ‘మోటార్ సైకిల్‌పై నా ప్రయాణం ఎప్పటికైనా ముగుస్తుంది. కానీ ఆ ప్రయాణంతో పాటు నా సంభాషణలు ముగిసిపోవు. నిరంతరం నేను అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాను' అని చెప్పారు. 'నేను చేసిన ఈ ప్రయాణం.. ఎవరో ఒకరు గుర్తుంచుకుని, ఇక నిశ్శబ్దంగా బాధపడకూడదని నిర్ణయించుకోవాలి. సిగ్గుపడకుండా సహాయం కోరడానికి ధైర్యం చేయాలి. అప్పుడే నా లక్ష్యం నెరవేరినట్లు' అని ఆకాంక్షిస్తున్నారు.

- జ్యోతిర్మయి

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్