ఒక అడవిని కాపాడటానికి మహిళలంతా ఒక్కటయ్యారు. ఎండిపోయిన అడవికి మళ్లీ పచ్చదనం తీసుకొచ్చారు. చెట్లను పెంచడమే కాదు.. వాటి సంరక్షణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తమ సంఘటిత శక్తితో గ్రామానికి, పర్యావరణానికి మేలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా మానర్ గ్రామ మహిళలు సాధించిన ఈ విజయం వెనుక 75 ఏళ్ల భాగీరథీ దేవి నాయకత్వం ఉంది. రెండు దశాబ్దాలకు పైగా ఆమె గ్రామ మహిళలను సమీకరించి అడవుల సంరక్షణకు కృషి చేస్తున్నారు. స్థానికులు ఆమెను ప్రేమగా 'వన్ అమ్మ' (అడవుల అమ్మ) అని పిలుస్తారు.
2000 సంవత్సరం నాటికి గ్రామం పక్కనే ఉన్న అడవి దాదాపుగా నాశనమైపోయింది. చెట్లను విచ్చలవిడిగా నరికివేయడంతో పచ్చదనం కనుమరుగైంది. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్న భాగీరథీ దేవి గ్రామ మహిళలను సమీకరించి 'వన్ పంచాయత్' పేరుతో సామూహిక అటవీ నిర్వహణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి తొలి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వంలో మహిళలు అడవిని శుభ్రం చేసి కంచెలు ఏర్పాటు చేశారు. లాంటానా వంటి హానికర మొక్కలను తొలగించి స్థానిక చెట్లను పెంచే పనికి శ్రీకారం చుట్టారు. పుణెకు చెందిన బీఏఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో వివిధ మొక్కలు నాటారు. చెట్లు, గడ్డి, పశుపోషణను సమన్వయం చేసే సిల్వోపాస్చర్ విధానాన్ని అమలు చేశారు. మొక్కలు బలంగా పెరిగేందుకు రెండేళ్లపాటు పశువులను అడవిలో మేపడాన్ని నిషేధించారు. మరో ఐదారు సంవత్సరాల్లో మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ఆ 11.6 హెక్టార్ల అడవి తిరిగి పచ్చదనంతో కళకళలాడింది. దీంతో గ్రామ మహిళల కష్టాలూ తగ్గాయి. పశువుల మేత, వంటచెరకు కోసం ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన కష్టం తప్పింది. నీటి ఊటల పరిస్థితి కూడా మెరుగుపడింది. అడవి పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న మహిళలకు బీఏఐఎఫ్ రోజుకు రూ.120 వేతనం చెల్లించింది. అందులో పది శాతాన్ని వారు స్వచ్ఛందంగా అడవి నిర్వహణకు అందించారు. భాగీరథీ దేవి కాపలాకు ప్రతి కుటుంబం నెలకు రూ.20 చొప్పున సమకూర్చింది. ఈ సామూహిక నిర్వహణతో అడవి పునరుద్ధరణతోపాటు అగ్నిప్రమాదాల నివారణ కూడా సాధ్యమైంది.
ఈ కృషి ఉత్తరాఖండ్‌లోని ఇతర పర్వత గ్రామాల మహిళలకూ స్ఫూర్తినిస్తోంది. ఉపాధి కోసం పురుషులు పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో వ్యవసాయం, పశుపోషణ, కుటుంబ నిర్వహణ బాధ్యతలు మహిళలపైనే పడుతున్నాయి. వంటచెరకు, పశువుల మేత కోసం అడవులకు వెళ్లే వారు అక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పొగ కనిపించినా, చిన్నపాటి మంటలు చెలరేగినా ముందుగా గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు. అడవులతో వారికి ఉన్న అనుబంధం, స్థానిక పరిజ్ఞానం సంరక్షణలో ఉపయోగపడుతున్నాయి. భాగీరథీ దేవి, మానర్ గ్రామ మహిళలు సాధించిన ఈ విజయం ... ప్రకృతి సంరక్షణలో మహిళలకు నాయకత్వం అప్పగిస్తే వారు ఎంతటి మార్పునైనా తీసుకురాగలరని నిరూపించింది.








కామెంట్లు (0)