న్యూఢిల్లీ : నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఎంవి ఒమోర్ఫీ ఈ నెల 18న "రష్యా ప్రాదేశిక జలాల్లో" దాడికి గురైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి జరిగిన సమయంలో నౌకలో ముగ్గురు భారతీయులతో సహా 10 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. నౌకలో ఉన్న మిగతా ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ దాడిని ఖండించింది. దీన్ని "తీవ్ర ఆందోళన కలిగించే విషయం"గా అది పేర్కొంది.
"ఇటువంటి దాడులను భారత్ ఖచ్చితంగా ఖండిస్తుంది. నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్యంపై ముప్పు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం" అని అది పేర్కొంది.
బాధిత కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించేందుకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ సమీపంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయ సిబ్బంది మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.







కామెంట్‌లు (0)