నేరం చేసిన వ్యక్తి ప్రవర్తనను పక్కనపెట్టి, బాధితురాలి దుస్తులనే విచారణకు గురిచేయడం ఎంతవరకు న్యాయం? ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు ఈ ప్రశ్నను మరోసారి మన ముందుకు తెచ్చింది. ఒక యువతిని వేధించిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ, ఆమె వస్త్రధారణపై జరిగిన విచారణను జస్టిస్ చంద్రశేఖరన్ సుధ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక యువతి ఏ దుస్తులు ధరించాలన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. అమ్మాయిల దుస్తులను నియంత్రించడానికి బదులు పిల్లలు తమ ప్రవర్తనను, ఇతరుల వ్యక్తిగత హద్దులను గౌరవించేలా తల్లిదండ్రులు, సమాజం నేర్పాలని సూచించారు.
ఈ కేసులో బాధితురాలు తన పొరుగింటి వ్యక్తి తనను వేధించడంతో పాటు శరీరాన్ని అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలు ఆ తీర్పును సవాలు చేయడంతో కేసు హైకోర్టుకు వచ్చింది. ట్రయల్ కోర్టులో యువతి నడవడిక, వస్త్రధారణతో పాటు ఆమెకు చెందిన సామాజిక వర్గాన్ని కించపరిచేలా ప్రశ్నలు అడగడాన్ని హైకోర్టు గర్హించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడానికి ట్రయల్ కోర్టు చూపిన కారణాలను కూడా తోసిపుచ్చింది. ఒక వ్యక్తి ఒక మహిళను వేధిస్తే, అతని చర్యకు ఆమె దుస్తులు ఎలా కారణమవుతాయి? దుస్తులు సమ్మతికి సంకేతం కావు. నేరానికి బాధ్యత నేరస్థుడిదే!
ఈ కేసులో ‘స్థానిక సంప్రదాయం’ పేరుతో కూడా వాదనలు ముందుకొచ్చాయి. కానీ సామాజిక నియమాలు ఇతరుల హక్కులను రక్షించేందుకు ఉండాలి; వారి జీవనశైలిని నిర్దేశించేందుకు కాదు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితురాలినే ప్రశ్నించే ధోరణి మరింత సమస్యాత్మకం. ‘ఎందుకు అక్కడికి వెళ్లావు?’, ‘ఏ దుస్తులు వేసుకున్నావు?’ వంటి ప్రశ్నలు నేరంతో సంబంధం లేకపోతే న్యాయ విచారణలో వాటికి స్థానం ఉండకూడదు. ఈ కేసులో అలాంటి ప్రశ్నలను అనుమతించడాన్నే హైకోర్టు తప్పుపట్టింది. మన సమాజంలో ‘అమ్మాయి ఏం వేసుకుంది?’ అన్న ప్రశ్న చాలా త్వరగా వస్తుంది. కానీ ‘అతడు ఎందుకు అలా ప్రవర్తించాడు?’ అన్న ప్రశ్న అదే తీవ్రతతో రావడం లేదు. ఒక అమ్మాయి దుస్తులు అబ్బాయిని రెచ్చగొడతాయని చెప్పడం అంటే అతడికి తన ప్రవర్తనపై నియంత్రణ లేదని, తన చర్యలకు తానే బాధ్యత వహించలేడని చెప్పడమే! అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇతరుల వ్యక్తిగత హద్దులను గౌరవించడం నేర్పాలి. ఎవరినైనా అనుమతి లేకుండా తాకకూడదని, ఎదుటి వ్యక్తి ‘వద్దు’ అంటే దాని అర్థం వద్దు అనే చెప్పాలి. మారాల్సింది దుస్తులు కాదు.. దృష్టి అని ఢిల్లీ హైకోర్టు ఉద్ఘాటించడం హర్షనీయం.








కామెంట్‌లు (0)