కుటుంబం, వ్యాపార బాధ్యతలతో చురుగ్గా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పక్షవాతం శరీరంలోని ఎడమ భాగాన్ని చచ్చుబడేలా చేసింది. నిలబడటం, నడవటం, చేతిలో వస్తువును పట్టుకోవడం వంటి సాధారణ పనులకూ ఇతరుల సాయం అవసరమైంది. అయినా ఆమె పట్టుదల కోల్పోలేదు. తిరిగి నడవడం నేర్చుకున్నారు. కొండలు ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరకు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించారు. ఆమే చెన్నైకి చెందిన జయశ్రీ విజయ్ మోహన్.
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. 2021 అక్టోబరులో జయశ్రీ కుటుంబంతో కలిసి తిరుచ్చి నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో శరీరంలోని ఎడమ భాగం మొద్దుబారుతున్నట్లు అనిపించడంతో వైద్యుడిని సంప్రదించారు. పక్షవాతం వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే హైవేపై ఉండటంతో వెంటనే ఆసుపత్రికి చేరుకోలేకపోయారు. రాత్రికి ఆసుపత్రికి చేరుకునేసరికి ఎడమవైపు భాగం తీవ్రంగా ప్రభావితమైంది. మాట, కదలికలు, శరీర సమతుల్యత దెబ్బతిన్నాయి. ఒక గ్లాసు పట్టుకోవడం, తలస్నానం చేసుకోవడం, మెట్లు ఎక్కడం వంటి పనులకూ ఇతరుల సాయం అవసరమైంది. ఇద్దరు పిల్లల తల్లిగా, వ్యాపార బాధ్యతలు నిర్వహించే వ్యక్తిగా జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పక్షవాతం నుంచి కోలుకోవడానికి నెలల తరబడి ఫిజియోథెరపీ, పునరావాస శిక్షణ తీసుకున్నారు. నిలబడటం, నడవటం, శరీర సమతుల్యతను కాపాడుకోవడం వంటి ప్రాథమిక అంశాలపై సాధన చేశారు. ఎన్నోసార్లు పడిపోయారు. చిన్న పనులకే అలసిపోయేవారు. ఈ క్రమంలో గతంలో ఉన్న శారీరక సామర్థ్యంతో పోల్చుకుంటూ బాధపడటం కంటే ప్రస్తుత స్థితి నుంచి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. 'అవ్లో దాన్' అనే తమిళ పదబంధాన్ని జీవిత సూత్రంగా చేసుకున్నారు. జరిగినదాన్ని అంగీకరించి, అక్కడి నుంచి ముందుకు సాగడమే దాని అర్థం. చిన్నప్పటి నుంచి పర్వతాలంటే ఆసక్తి ఉన్న జయశ్రీ, పర్వతారోహణను తన లక్ష్యంగా ఎంచుకున్నారు. వైద్యులు, శిక్షకుల సహకారంతో శరీర దృఢత్వాన్ని పెంచుకోవడం ప్రారంభించారు.
ఎవరెస్ట్ నుంచి కిలిమంజారో
పర్వతారోహణలో అనుభవం లేకపోయినా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. 2023లో ఆ ప్రయత్నం ప్రారంభించారు. తొమ్మిది రోజుల ప్రయాణంలో ఎనిమిదో రోజుకు చేరుకునేసరికి ఆక్సిజన్ స్థాయులు ప్రమాదకరంగా పడిపోయాయి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. వైద్య సహాయం అవసరమైనప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగి బేస్ క్యాంప్‌ను చేరుకున్నారు. ఈ అనుభవం ఆమెకు తన శారీరక పరిమితులను అర్థం చేసుకోవడంతోపాటు వాటిని అధిగమించేందుకు మరింత సాధన అవసరమని తెలియజేసింది. ఆ తర్వాత వెన్నెముకలో ఎల్4, ఎల్5 ప్రాంతాల్లో సమస్యలు తలెత్తడంతో మళ్లీ కోలుకోవాల్సి వచ్చింది.
ఈసారి ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముద్రమట్టానికి సుమారు 5,895 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఒంటరి పర్వతం. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గడం, చలి, అలసట వంటి సవాళ్లు ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు జయశ్రీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రోజుకు నాలుగు గంటలపాటు మెట్లు ఎక్కడం, దిగడం, ఎత్తుపల్లాల మార్గాల్లో నడవడం, శరీర సమతుల్యతను కాపాడుకోవడంపై సాధన చేశారు. బెంగళూరులోని నంది హిల్స్‌తోపాటు లేహ్ ప్రాంతంలోనూ శిక్షణ పొందారు. వైద్యుల, శిక్షకుల పర్యవేక్షణలో సన్నద్ధమయ్యారు. ప్రయాణానికి కొద్ది వారాల ముందు పడిపోవడంతో కాలికి గాయమైంది. పర్వతారోహణను వాయిదా వేయాలని వైద్యులు, శిక్షకులు సూచించారు. అయినా వైద్య పరీక్షలు, అవసరమైన సన్నద్ధతతో ప్రయత్నాన్ని కొనసాగించారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇద్దరు కుమార్తెల ప్రోత్సాహం ఆమెకు ధైర్యాన్నిచ్చింది.
రెండు ప్రపంచ రికార్డులు
2025 సెప్టెంబరు 29న జయశ్రీ కిలిమంజారో శిఖరాన్ని చేరుకున్నారు. కోఆర్డినేషన్ ఇంపెయిర్మెంట్ - హెమిప్లీజియా (సీఐహెచ్) విభాగంలో మహిళల వేగవంతమైన పర్వతారోహణ రికార్డును నెలకొల్పారు. ఐదు రోజులు, ఆరు గంటల 50 నిమిషాల్లో శిఖరాన్ని చేరుకున్నారు. 10 గంటల 26 నిమిషాల్లో కిందకు దిగి మరో ప్రపంచ రికార్డు సాధించారు. ఈ రెండు రికార్డులను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. శిఖరాన్ని చేరుకున్న తర్వాత ఎక్కువసేపు అక్కడ గడపలేదు. కొన్ని ఫొటోలు, వీడియోలు తీసుకుని వెంటనే దిగడం ప్రారంభించారు. దిగే క్రమంలో పలుమార్లు పడిపోయినా మళ్లీ లేచి ముందుకు సాగారు. అవసరమైనప్పుడు ఇతరుల సాయం తీసుకుంటూ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
జయశ్రీ తన విజయాలను వ్యక్తిగత రికార్డులుగా మాత్రమే చూడటం లేదు. తనలాంటి పక్షవాత బాధితులు కూడా తమలోని సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నదే ఆమె ఆకాంక్ష. మరో పక్షవాత బాధిత మహిళ తనకంటే వేగంగా కిలిమంజారోను అధిరోహించిన రోజే తనకు నిజమైన సంతోషమని చెబుతున్నారు. అనారోగ్యం మనిషి జీవితాన్ని మార్చవచ్చుగానీ, లక్ష్యాలకు, ఆశయాలకు అడ్డంకి కాలేదని జయశ్రీ ప్రయాణం నిరూపిస్తోంది.









కామెంట్లు (0)