పాతదాన్ని యథాతథంగా కొనసాగించడమే సంప్రదాయాన్ని కాపాడటం కాదు. దాని మూలాలను గౌరవిస్తూనే కాలానికి అనుగుణంగా కొత్త రూపం ఇవ్వడం కూడా సృజనాత్మకతే. అలాంటి ప్రయత్నమే తమిళ గీతం ‘వరువాయ్’. మహాకవి సుబ్రహ్మణ్య భారతి వందేళ్లకు పైగా క్రితం రాసిన కవితకు ఆధునిక సంగీత రూపం అందించిన ఈ పాట 69వ గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. తమిళ గీతానికి ప్రపంచ సంగీత వేదికపై ఈ స్థాయి గుర్తింపు రావడం విశేషం. ఈ పాటలో గాత్రం అందించిన గాయని సుభిక్ష రంగరాజన్ (సుషా) ప్రయాణం కూడా ఆసక్తికరం.
సుబ్రహ్మణ్య భారతి తమిళ మహాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త. కులవివక్షను ప్రశ్నిస్తూ, స్త్రీ స్వేచ్ఛను సమర్థిస్తూ, సమానత్వం, స్వాతంత్ర్య భావాలను తన రచనల్లో వ్యక్తం చేశారు. ‘వరువాయ్’ శ్రీకృష్ణుడిని ఉద్దేశించి రాసిన భక్తి కవిత. తనలోకి రావాలని, దుష్టశక్తులను తొలగించాలని కవి ఇందులో ప్రార్థిస్తారు. ఈ కవితకు అసలు స్వరరచన చేసినవారు సంగీత దర్శకుడు ఎల్. కృష్ణన్. 1989-90 ప్రాంతంలో దేశ్ రాగంలో ఆయన ఈ బాణీని రూపొందించారు. ప్రముఖ కర్ణాటక సంగీత గాయని నిత్యశ్రీ మహదేవన్ ఆలపించిన రూపంలో ఈ పాట సంగీత ప్రియులకు పరిచయమైంది. ఇప్పుడు అదే బాణీకి ఆధునిక రూపం అందించారు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ సంగీతకారుడు దేవన్ ఏకాంబరం. కర్ణాటక సంగీత మాధుర్యాన్ని కొనసాగిస్తూనే జాజ్, ఆధునిక సంగీత శైలులను జోడించారు. ఇందులో సుభిక్ష గాత్రం సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధిగా నిలిచింది.
పాత కొత్తల మేలుకలయిక
సుభిక్ష రంగరాజన్ చెన్నైకి చెందిన గాయని. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగారు. తల్లి లక్ష్మి, బామ్మ సరస్వతి ఇద్దరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. ఐదేళ్ల వయసులోనే వారి వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. సంప్రదాయ సంగీతానికే పరిమితం కాకుండా కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తితో కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో సంగీత ప్రదర్శన విభాగంలో ఉన్నత విద్య అభ్యసించారు. అక్కడ జాజ్ సంగీతాన్ని నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలోని రాగాలు, గమకాలకు జాజ్‌లోని స్వేచ్ఛాయుత స్వర విన్యాసాలను జోడిస్తూ కొత్త సంగీత రూపాలను అన్వేషించారు.
సంగీత ప్రపంచంలో సుషా పేరుతో గుర్తింపు పొందిన సుభిక్ష 2020లో విడుదలైన తెలుగు చిత్రం ‘పెంగ్విన్’లో ‘ప్రాణమే’ పాట పాడారు. ఏఆర్ రెహమాన్, క్లింటన్ సెరెజో నిర్వహించిన నెక్సా మ్యూజిక్ కార్యక్రమంలో 2019లో ఎంపికైన 24 మంది కళాకారుల్లో ఒకరిగా నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో ‘లవ్ లాంగ్వేజ్’ పేరుతో తొలి స్వతంత్ర ఆల్బమ్‌ను విడుదల చేశారు. 12 పాటలతో రూపొందిన ఇందులో తమిళం, ఇంగ్లిష్ భాషలతో పాటు కర్ణాటక, జాజ్ సంగీత శైలులను మేళవించారు.
ప్రయోగానికి వచ్చిన గుర్తింపు
దేవన్ ఏకాంబరం దాదాపు మూడు దశాబ్దాలుగా దక్షిణ భారతీయ సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో 1999లో వచ్చిన ‘కాదలర్ దినమ్’ చిత్రంలోని ‘ఓ మారియా’ పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ఇళయరాజా, యువన్ శంకర్ రాజా తదితర సంగీత దర్శకులతో పనిచేశారు. 500కు పైగా సినిమాల్లో పాటలు పాడారు. స్వతంత్ర సంగీత కళాకారుడిగానూ కొనసాగుతున్నారు. దేవన్ ఏకాంబరం, సుభిక్షల మధ్య దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఓ టెలివిజన్ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. భారతియార్ రచనలకు ఆధునిక సంగీత రూపం ఇవ్వాలన్న దేవన్ ఆలోచనకు సుభిక్ష ఆసక్తి తోడైంది.
69వ గ్రామీ అవార్డుల్లో ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ విభాగానికి ‘వరువాయ్’ నామినేట్ అయింది. ఈ విభాగం ప్రపంచంలోని వివిధ సంగీత సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్ట ప్రదర్శనలను గుర్తిస్తుంది. ఈ విభాగంలో ఏంజెలిక్ కిడ్జో, ఫారెల్ విలియమ్స్, షకీరా, బర్నా బాయ్, రొసాలియా వంటి అంతర్జాతీయ సంగీత ప్రముఖుల పాటలతో ‘వరువాయ్’ పోటీపడుతోంది. 2027 ఫిబ్రవరి 7న లాస్ ఏంజెలిస్‌లో విజేతలను ప్రకటించనున్నారు.








కామెంట్‌లు (0)