ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు, నిశ్శబ్దంగా నిలిచిన బౌద్ధ మఠాలు, చిన్న గ్రామాలతో అలరారే లడఖ్ అందాలు ఎప్పుడూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఇప్పుడు ఆ ప్రకృతి ఒడిలోనే కళకు కొత్త రూపాన్ని ఇచ్చే 'సా లడఖ్ బినాలే–2026' సందర్శకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. 'బినాలే' అంటే రెండేళ్లకోసారి నిర్వహించే అంతర్జాతీయ కళా ప్రదర్శన. ఇటాలియన్ భాషలోని 'బియెన్నాలే' (Biennale) అనే పదానికి 'రెండేళ్లకోసారి' అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కళాకారులు తమ సృజనాత్మక కళాఖండాలను ప్రదర్శించే వేదికగా బినాలేలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటలీలోని వెనిస్ బినాలే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కళా ఉత్సవంగా పేరొందింది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని లడఖ్ తన ప్రకృతి, సంస్కృతితో మేళవించి వినూత్నంగా ఆవిష్కరిస్తోంది.
‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్వహిస్తున్న పునరుజ్జీవన కళా బినాలే’గా దీన్ని అభివర్ణిస్తున్నారు. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లడఖ్‌లో ఏర్పాటు చేసిన ఈ బినాలేలో కళా ప్రదర్శనలు ఆ ప్రాంతమంతా విస్తరించేలా సిద్ధం చేశారు. సాధారణంగా కళా ప్రదర్శనలు గ్యాలరీలు, మ్యూజియంలకే పరిమితమవుతుంటాయి. కానీ ఈ బినాలే గ్రామాలు, పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక ప్రదేశాలు, సామాజిక స్థలాలను తనలో కలుపుకుంది. సందర్శకులకు తమ ప్రయాణమే ఒక కళానుభూతిగా మారేలా ఈ ప్రదర్శనలు కొలువుదీరాయి. వాటిని వీక్షిస్తూ పర్యాటకులు ముందుకు సాగుతున్నారు. లడఖీ భాషలో 'సా' అంటే 'మట్టి' అని అర్థం. బినాలేకు ఈ పేరు పెట్టడం వెనుక ఈ ప్రాంతంలో భూమి, పర్యావరణం, స్థానిక సమాజాల గాఢమైన అనుబంధం ప్రతిబింబిస్తుంది. వాతావరణం, సంస్కృతి, సమాజంతో మిళితమైన ఈ బినాలేను సందర్శిస్తున్న వారికి లడఖ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థ, గొప్ప సాంస్కృతిక వారసత్వంపై గౌరవం కలుగుతోంది.
మరో నక్షత్రం నుంచి సంకేతాలు
ఈ ఏడాది బినాలేను 'మరో నక్షత్రం నుండి సంకేతాలు' పేరుతో నిర్వహిస్తున్నారు. ప్రకృతి దృశ్యాలు, వాతావరణ సరళి, స్థానిక సంప్రదాయాలు, హిమాలయ సమాజాల జీవన అనుభవాలు వంటి ఎన్నో కథలను వినడానికి బినాలే ఆహ్వానిస్తోందని క్యూరేటర్లు అంటున్నారు. ఈ బినాలే లేహ్ నుంచి కార్గిల్ కారిడార్ వరకు విస్తరించి ఉంది. మొత్తం 230 కిలోమీటర్ల మేర ప్రాచీన సిల్క్ రూట్ ద్వారా అనుసంధానించబడి అనేక ప్రాంతాలను కలుపుతోంది. ఒకే వేదికలో కొన్ని గంటలు గడపటానికి బదులుగా మార్గమధ్యంలో అద్భుత కళాఖండాలు, సాంస్కృతిక పరస్పర చర్యలు, స్థానిక సమాజాలను అనుభవించే అవకాశం కల్పించడమే దీని ప్రత్యేకత.
లడఖ్ ఒక సున్నితమైన, ఎత్తైన పర్వత ప్రాంత పర్యావరణ వ్యవస్థ. ఇది వాతావరణ మార్పు, నీటి లభ్యత, పెరుగుతున్న పర్యాటకం వల్ల కలిగే పర్యావరణ ఒత్తిళ్లకు సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అందువల్ల నిర్వాహకులు పునరుజ్జీవనాన్ని, నైతిక నిబద్ధతను బినాలే దార్శనికతకు కేంద్రంగా ఉంచారు. 'బాధ్యతాయుతంగా ప్రయాణించండి, స్థానిక సంప్రదాయాలను గౌరవించండి, వ్యర్థాలను తగ్గించండి, స్థానిక సమాజాలకు మద్దతు ఇవ్వండి, గ్రామాలు, సాంస్కృతిక ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపండి, నివాసితులు, ప్రకృతి దృశ్యాలతో అర్థవంతంగా మమేకమవ్వండి. పర్యాటకం పర్యావరణ ఒత్తిడిని కాకుండా అవగాహన, ప్రశంస, శ్రద్ధను మిగిల్చి వెళ్లాలి' అనే ఆలోచనను ఈ బినాలే ప్రోత్సహిస్తోంది.

ఇవిగో, కళాఖండాలు ...
1. భారతదేశ కళాకారిణి హిమాలీ సింగ్ సోయిన్, జర్మన్ కళాకారుడు డేవిడ్ సోయిన్ రూపొందించిన కళాఖండం లేహ్ నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న నూర్లా లోయకు కొత్త సంగీతాన్ని తీసుకొచ్చింది. ఈ కళాకృతికి జర్మన్ రాయబార కార్యాలయం పాక్షికంగా నిధులు సమకూర్చింది. 'ది బెల్ టోల్స్ ఫర్ యు' పేరుతో కొలువుదీరిన ఈ కళాఖండం వంతెనపై అడుగుపెట్టిన ప్రతిసారీ గంటలు మోగుతూ లోయ నిశ్శబ్దాన్ని సంగీతంగా మారుస్తోంది. వేగంగా ప్రవహించే నీటిపై వేలాడుతూ, నిటారైన పర్వతాల మధ్య ఉన్న ఈ వంతెన లోయకు ఇరువైపులా ఉన్న నివాస ప్రాంతాలను కలుపుతుంది. దీని మీద ప్రయాణించేటప్పుడు వంతెన మనతో కదులుతున్న భావన కలుగుతుంది. లడఖీ, కచ్చి తయారీదారులు రూపొందించిన ఈ గంటలను వంతెన మోయగలిగేంత భారంతో, తేలికగా నిర్మించారు.
2. కార్గిల్ పష్కుమ్ గ్రామానికి చెందిన జహారా, 20 మంది స్థానిక మహిళలతో కలిసి ఒక పాడుబడిన గ్రామానికి తిరిగి జీవం పోశారు. గొర్రెల ఉన్నితో పాత ఇళ్ల పైకప్పులను కప్పివుంచారు. ఈ ఉన్ని నలుపు, తెలుపు రంగుల్లో మాత్రమే లభ్యమవుతుంది. దాని సహజత్వం కోల్పోకుండా ఎరుపు రంగు మేళవించి గ్రామాన్ని రంగులమయంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు రంగుల కళాఖండంగా సందర్శకులను ఆహ్వానిస్తోంది.
3. లేహ్ నుంచి ఒక గంట దూరం ప్రయాణిస్తే లికిర్ అనే గ్రామం వస్తుంది. అక్కడ ఒక కుటుంబం సాంప్రదాయ లడఖీ కుండల పద్ధతులను సజీవంగా ఉంచేందుకు తరతరాలుగా కృషి చేస్తోంది. వారి కళను ప్రపంచానికి చాటిచెప్పేందుకు లికిర్‌లోని పొలం గట్లు, తెల్లగోడల ఇళ్లు, రాతి మార్గాల వెంబడి షుపివే ఎరుపు, నారింజ రంగుల్లో చేతితో తయారుచేసిన అనేక కుండలను ప్రదర్శించారు.
మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో 12 మంది లడఖీ కళాకారులు, 8 మంది అంతర్జాతీయ కళాకారులు ఈ బినాలేలో పాల్గొంటున్నారు. 'సా లడఖ్ బినాలే' కేవలం కళా ప్రదర్శన మాత్రమే కాదు. కళ, ప్రకృతి, సంస్కృతి, స్థానిక జీవన విధానాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించే విశిష్ట ప్రయత్నం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు, పర్యావరణ సంక్షోభంపై చర్చలు జరుగుతున్న తరుణంలో కళను ప్రజల్లో అవగాహన కల్పించే సాధనంగా ఉపయోగించడం ఈ బినాలే ప్రత్యేకత. మంచు పర్వతాల మధ్య కొలువైన ఈ కళా ప్రపంచం సందర్శకులకు అందమైన జ్ఞాపకాలను మాత్రమే కాదు... ప్రకృతి, సంస్కృతి పట్ల కొత్త బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది.








కామెంట్‌లు (0)