నాలుగు గోడల మధ్య తరగతి గదిలో పిల్లలు వేసే ప్రశ్నలు ఒక్కోసారి షాకింగ్ న్యూస్‌లా తగులుతాయి. జీవితకాలం వెంటాడుతాయి. ఆ ప్రశ్నలు సమాజాన్ని, అవసరమైతే ప్రపంచాన్ని కుదిపేసి, సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాయి. అలా ఒక ఉపాధ్యాయుడి సర్వీసులో ఎదురైన సంఘటనల సమాహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఉపాధ్యాయుడు తన అనుభవాలను ఇలా వివరించారు. చదవండి.
చంద్రునిపై కాలుమోపడం నిజమే..! అంటూ నాసా ధృవీకరించిన వార్తను (వాషింగ్టన్ న్యూస్) అందరిలానే నేనూ నమ్మాను. అయిదో తరగతిలో ఆ వార్త చదివి వినిపిస్తే పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు. ఒక్క సతీష్ గాడు తప్ప. వాడు నమ్మలేదనడానికి వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నమ్మిన మిగతా పిల్లలందర్నీ వాడు జాలిగా చూశాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవరపెట్టాయి. వాడు ఏం ప్రశ్న వేశాడో చివరికి చెబుతాను.
కల్పవృక్షమేనా?
పదేళ్ల కిందట చర్లపల్లె స్కూల్లో నన్ను ఆలోచనల్లో పడేసిన ప్రశ్న ఎదురైంది. నాకు ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే రమేష్ గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కుచెదరడంలేదు. అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ‘కల్పవృక్షం’ అనే పాఠం ఉండేది. ‘తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు (తాటాకులు) గుడిసె వేసుకోవడానికి, తాటి ముంజలు తినడానికి, తాటి దోనెలు నీరు పారించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా తాటిచెట్టులోని ప్రతిదీ మనిషికి పనికొస్తుంది. అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు’ అని పాఠం చెప్పాను. పిల్లలంతా ఉత్సాహంగా విన్నారు. పాఠం చెబుతున్నంత సేపూ రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్లల్లో తడి. నేను అబద్ధం చెబుతున్నట్టు వాడి ముఖంలో కోపం కూడా కనిపించింది.
‘రమేష్, ఏమైందిరా?’ అని అడిగాను. సమాధానం చెప్పకుండా వాడు చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాడు. పిల్లలంతా వాడివైపే చూస్తున్నారు. ‘ఏమైందిరా?’ మళ్లీ అడిగాను. మరో రెండు నిమిషాలు గడిచాయి. వాడి మొహం ఎర్రగా అయింది.
‘ఏమైందో చెప్పు’ అన్నాను కొంచెం సీరియస్‌గా.
‘మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, మా తమ్ముణ్ణీ బాగా కొడతాడు. మరి తాటిచెట్టు మంచిదెట్లయితది సార్?’ అని వాడడిగిన ప్రశ్న నన్నే కాదు, మొత్తం విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్టు వినిపించింది.
నిజానికి తాటిచెట్టు పాఠంలో ‘కల్లు’ ప్రస్తావన ఎక్కడా రాయలేదు. తాటిచెట్టు కల్పవృక్షంతో పోల్చదగినదేనా? వాడికి నేను సమాధానం ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? అయిదు నిమిషాల వరకు నేను తేరుకోలేదు.
గుడ్డు కథ
శ్రీరాములపల్లె స్కూల్లో నేను పనిచేసేటప్పుడు మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం. మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకు ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్‌మాస్టర్‌కి చెప్పాను. ఆయన పాపను పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీమరీ చెప్పడంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది. ఆ తర్వాత వేదవతి నాలుగు రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కలిసి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది.
‘మేం బ్రాహ్మలం. మా పాప చేత కోడిగుడ్డు తినిపిస్తారా? మీ స్కూలుకు నా బిడ్డని చస్తే పంపించం’ అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా, నీరసంగా లేచి నిల్చుంది. పాప చదువు పాడైపోతుందని, ఇకమీదట తనకు కోడిగుడ్డు పెట్టించము అని మేమంతా హామీ ఇచ్చాక గానీ పాపను బడికి పంపడానికి వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు.
వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూలుకు వచ్చింది. పిల్లల్లో గుసగుసలు. అందరి మధ్యా కోడిగుడ్డు ప్రస్తావనే. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గరకొచ్చింది. నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ ‘మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?’ అనడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు.
ఇష్టం లేని బొమ్మ
ఓసారి తరగతి గదిలో రొటీన్‌కి భిన్నంగా ‘మీకు అస్సలు నచ్చని బొమ్మ ఏదైనా గీసి చూపించండి’ అంటూ డైలీ పేపర్‌లోకి తలదూర్చాను. అరగంట తర్వాత రకరకాల బొమ్మలు చూపించారు. కుక్క, పంది, బడి ఇలా రకరకాలుగా. ఒకడు మనిషి బొమ్మ గీసి, కింద చిరంజీవి అని రాశాడు.
‘అదేంట్రా, నీకు చిరంజీవి అంటే ఇష్టం లేదా?’ అనడిగాను నవ్వుతూ.
‘లేద్సార్, నాకు బాలకృష్ణ అంటేనే ఇష్టం’ అన్నాడు నవ్వుతూ.
రెండో తరగతి అనూష మాత్రం నాలుగు గీతలతో ఓ డబ్బా బొమ్మ గీసుకొచ్చింది.
‘ఏంటే, ఈ బొమ్మ?’ అనడిగాను.
పాప కళ్లల్లో సన్నటి నీటి పొర.
‘డబ్బా బొమ్మ సార్’ అంది.
‘అదే, ఏం డబ్బా?’ అనడిగాను.
మిగతా పిల్లలు కూడా ఆసక్తిగా చూస్తూ ‘చాక్లెట్ల డబ్బా’ అని నవ్వారు కొందరు.
నిమిషం తర్వాత నెమ్మదిగా అంది. ‘మా బాపు (నాన్న) మస్కట్లో చచ్చిపోతే గీ డబ్బాలోనే తీసుకొచ్చిండ్రు’ అనగానే తరగతి గది ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. పాపను దగ్గరకు తీసుకున్నాను. కాసేపయ్యాక నవ్వింది. అప్పుడప్పుడూ ఉపాధ్యాయుడి స్పర్శ తల్లిదండ్రుల స్పర్శకన్నా ఎక్కువ ధైర్యాన్నిస్తుందేమో!
మళ్లీ మొదటికి...
ఇప్పుడు సతీష్ గాడు అడిగిన ప్రశ్న చెబుతాను. వాడు నన్నూ, ఆ పేపర్‌లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మను మార్చి మార్చి చూశాడు.
‘మీరు నమ్ముతున్నారా సార్?’ అని అడిగాడు. క్లాసంతా నిశ్శబ్దం.
‘నీ డౌట్ ఏంట్రా? అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త’ అన్నాను.
‘మీరందరూ నమ్ముతున్నారా?’ అన్నట్టు క్లాసంతా కలియజూశాడు.
‘నేను నమ్మట్లేదు సార్’ అన్నాడు ధృడంగా.
‘ఎందుకురా, నువ్వేమైనా చూసొచ్చావా?’ అన్నాను కోపంగా.
క్లాసంతా ఆసక్తిగా వాణ్ణే చూస్తోంది. కాసేపాగి, ‘చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్. మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?’ అన్నాడు.
ఖంగుతిన్నాను. ఆ రాకెట్టు నామీదే కూలిపడ్డట్టయింది. వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లుగా మారి అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు, అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు అనిపించింది. నిజమే. ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు. మరి మీకో?








కామెంట్‌లు (0)