మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లల పెంపకంలో రొనాల్డో 7 సూత్రాలు

1 రోజు క్రితం

ronald
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో ఒక దిగ్గజం. ఐదుసార్లు బ్యాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న ఈ పోర్చుగీస్ స్టార్ ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే క్రీడాకారుల్లో ఒకరు. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మంది అనుసరించే వ్యక్తుల్లోనూ ఆయన ముందుంటారు. అయితే ప్రపంచం ఇప్పుడు ఆయన ఆట గురించి మాత్రమే కాదు, పిల్లల పెంపకంపై అనుసరిస్తున్న విధానం గురించీ చర్చిస్తోంది.

​రొనాల్డోకు ఐదుగురు పిల్లలు. క్రిస్టియానో జూనియర్, కవలలు ఎవా, మాటియో, అలానా మార్టినా, బెల్లా ఎస్మెరాల్డా. అపారమైన సంపద ఉన్నప్పటికీ పిల్లలకు విలాసవంతమైన జీవితం కంటే క్రమశిక్షణ, వినయం, కష్టపడి పనిచేసే తత్వం, ఆరోగ్యకరమైన అలవాట్లే ముఖ్యమని ఆయన నమ్ముతారు. "పిల్లలకు సంపదను కాదు... విలువలను ఇవ్వాలి" అనేదే ఆయన తత్వం. పిల్లల పెంపకంలో రొనాల్డ్‌, ఆయన భార్య ఏడు సూత్రాలు అమలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

​మొదటి సూత్రం ఆహారం: రొనాల్డో ఇంట్లో జంక్ ఫుడ్‌కు చోటు లేదు. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, శీతల పానీయాలు, అధిక చక్కెర ఉన్న ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేయరు. కాల్చిన చేపలు, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, తగినంత నీరు... ఇవే వారి రోజువారీ ఆహారం. ఆహారం అంటే రుచికోసం కాదు, శరీరానికి ఇంధనమనే విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పుతున్నారు. 2021 యూరో కప్ సందర్భంగా విలేకరుల సమావేశంలో తన ముందున్న కోకాకోలా సీసాలను పక్కకు జరిపి నీటి సీసాను చూపిస్తూ "నీళ్లు తాగండి" అని రొనాల్డో చెప్పిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తన జీవిత విధానానికి ప్రతిబింబమని ఆయన కుటుంబ సభ్యులు చెబుతుంటారు.​

రెండో సూత్రం చిన్న వయసులో మొబైల్ ఫోన్ వద్దు : కొడుకు క్రిస్టియానో జూనియర్ ఎన్నిసార్లు అడిగినా స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని రొనాల్డో స్వయంగా చెప్పారు. చిన్నతనంలో పిల్లలు స్క్రీన్‌ల కంటే ఆటలు, చదువు, స్నేహితులు, ప్రకృతితో ఎక్కువ సమయం గడపాలని ఆయన అభిప్రాయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో వంటి సంస్థలు కూడా చిన్నారుల్లో అధిక స్క్రీన్ వినియోగం ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి.

​మూడో సూత్రం చదువే ముందు : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడి కుమారుడైనా ముందుగా పాఠశాల పనులు పూర్తిచేయాలి. హోంవర్క్ పూర్తి చేసిన తర్వాతే ఫుట్‌బాల్ శిక్షణకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. క్రీడల్లో ప్రతిభ ఎంత ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకూడదని రొనాల్డో విశ్వసిస్తారు.

​నాలుగో సూత్రం పిల్లలపై ఒత్తిడి వద్దు: అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ఆయన తన పిల్లలందరూ ఫుట్‌బాల్‌నే ఎంచుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. "క్రిస్టియానో జూనియర్ ఫుట్‌బాల్ ఆడాలా, వద్దా అనేది అతని నిర్ణయం. నేను బలవంతం చేయను" అని రొనాల్డ్‌ బహిరంగంగానే చెప్పారు. పిల్లల అభిరుచిని గౌరవించాలన్నది ఆయన అభిప్రాయం.

​ఐదో సూత్రం డబ్బు ఉందని గారాబం చేయకూడదు: రొనాల్డో చిన్నప్పుడు పేద కుటుంబంలో పెరిగారు. తండ్రి ఫుట్‌బాల్ క్లబ్‌లో కిట్‌మ్యాన్‌గా పనిచేసేవారు. తల్లి వంటలు చేసేవారు, ఇళ్లల్లో పనులు చేసేవారు. ఆ కష్టజీవితాన్ని మరచిపోకుండా పిల్లలకూ వినయం నేర్పిస్తున్నారు. అడిగిన ప్రతిదీ వెంటనే కొనివ్వడం లేదు. కష్టపడి సాధిస్తేనే దాని విలువ తెలుస్తుందని ఆయన భావిస్తారు.

​ఆరవ సూత్రం వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం: ఫిట్‌నెస్ అనేది క్రీడాకారులకే పరిమితం కాదని రొనాల్డో అంటారు. పిల్లలు ప్రతిరోజూ పరుగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, ఆడుకోవడం తప్పనిసరి. ఒకసారి ఐస్‌క్రీం తిన్న తర్వాత తన కుమారుడితో కలిసి సైకిల్ తొక్కిన వీడియోను ఆయన పంచుకున్నారు. "తిన్నది ఖర్చు చేయాలి" అనే సందేశమే అందులో దాగి ఉంది.

ఏడో సూత్రం గౌరవం: పాఠశాల సిబ్బంది నుంచి ఇంట్లో పనిచేసేవారి వరకు, అభిమానుల నుంచి సహచరుల వరకు ప్రతి ఒక్కరినీ గౌరవించాలని పిల్లలకు చెబుతారు. పేరు, ప్రతిష్ఠ, సంపద శాశ్వతం కాదని, కానీ మంచి వ్యక్తిత్వం జీవితాంతం నిలిచిపోతుందని రొనాల్డో తరచూ చెబుతుంటారు.

​ఈ నియమాలన్నీ చూసినప్పుడు రొనాల్డో పిల్లల పెంపకం కఠినంగా అనిపించవచ్చు. కానీ పిల్లలపై ఆంక్షలు విధించడం ఆయన ఉద్దేశం కాదు. మంచి అలవాట్లను చిన్నప్పుడే పెంపొందించడం, స్వయంక్రమశిక్షణ నేర్పించడం, జీవితంలో విజయాన్ని తట్టుకునే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. మన దేశంలోనూ పిల్లల ఆరోగ్యం, స్క్రీన్ వ్యసనం, జంక్ ఫుడ్ అలవాట్లు, చదువుపై ఒత్తిడి వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రొనాల్డో కుటుంబంలో అమలు చేస్తున్న ఈ ఏడుసూత్రాలు ప్రతి కుటుంబం ఆలోచించదగ్గవే. పిల్లలకు పెద్ద ఇల్లు, ఖరీదైన బొమ్మలు, ఖరీదైన పాఠశాలలు మాత్రమే భవిష్యత్తును నిర్మించవు. ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణ, స్వేచ్ఛ, బాధ్యత, వినయం... ఇవే జీవితాంతం తోడుండే సంపద అని రొనాల్డో జీవితం చెబుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్