పదమూడేళ్ల వయసులో అన్నయ్య బస్టాండులో వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మొదలైన జీవా ప్రయాణం ఎన్నో కష్టాలు, అవమానాల మధ్య సాగింది. వెండితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రతారల ప్రశంసలు అందుకుంది. అయినా సమాజంలో గౌరవంగా బతకడానికి, సొంత ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవడానికి నేటికీ పోరాడాల్సి వస్తోంది. ఇది సినిమా కథ కాదు.. సినిమాకు, జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని కళ్లకు కట్టే భయంకర వాస్తవం. ఇటీవల విడుదలైన 'డోరతీ' చిత్రంలో ప్రధాన పాత్రకు అండగా నిలిచే ట్రాన్స్‌జెండర్ అమ్మ పాత్ర పోషించింది జీవా సుబ్రమణియం. తమిళనాడు శివకాశీ ఆమె స్వస్థలం. ఆ సినిమాలో చూపించినట్లు జీవా గతం కూడా కలర్ ఫుల్ కాదు. వర్తమానం కూడా అలా లేదు. ప్రముఖ దర్శకులు, నటీనటుల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉన్నా... సమాజం ఆమెను చిన్న చూపు చూస్తోంది. అవమానిస్తోంది. ఎగతాళిగా నవ్వుతోంది. ఎందుకంటే.. జీవా ట్రాన్స్‌జెండర్.
జీవాకు 13 ఏళ్లప్పుడు వాళ్ల అమ్మ రూ.300 ఇచ్చి చెన్నైకు పంపించింది. తనకు తోడుగా జీవా అన్నయ్య కూడా వచ్చాడు. కోయంబేడు బస్టాండ్ దగ్గర అన్నదమ్ములిద్దరూ బస్ దిగారు. జీవాను అక్కడే ఉండమని అతను వెళ్లిపోయాడు. గంటలు గడుస్తున్నా తను తిరిగిరాలేదు. అంతకుముందెప్పుడూ నగరానికి రానీ జీవా, అన్నయ్య కోసం ఎంతో ఎదురుచూసింది. కొన్ని రోజుల పాటు అక్కడే పబ్లిక్ టాయిలెట్లో స్నానం చేసి, బట్టలు ఉతుక్కుని, ఆ తడి బట్టలనే వేసుకుని అన్నయ్య ఎక్కడ ఉండమన్నాడో అక్కడికి వెళ్లి నిల్చొనేది. అన్నయ్య వచ్చేసరికి తను అక్కడ లేకపోతే.. కంగారుపడిపోతాడని అనుకునేది. అయితే.. ఆ అన్నయ్య రాలేదు.. రోజులు గడుస్తున్నకొద్దీ అన్నయ్య ఇక రాడని జీవాకు అర్థమైంది.
బస్టాండ్ నుంచి మొదలైన జీవా ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. హోటళ్లలో పనిచేసింది. పెళ్లి భోజనాల్లో విస్తరాకులు ఎత్తింది. నాటకాల్లో నటించింది. డ్యాన్సులు వేసింది. కూరగాయలు మోసింది. అబ్బాయిగా పుట్టిన జీవాకు అమ్మ, అన్నయ్య తనను బస్టాండ్‌లో ఎందుకు వదిలిపెట్టేశారో అప్పుడు తెలియలేదు. సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ తనకు విషయం అర్థమైంది. కానీ చిన్నతనం, అమాయకత్వం, పొట్ట కూటి కోసం నానా అగచాట్లు పడుతున్న తనకు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ గురించి అసలు తెలియదు. ఆ సమయంలోనే అప్పటి వరకు సమాజం తన పట్ల చూపిన దయ, కరుణ నిదానంగా మాయమవ్వడం జీవాకు కనిపించింది. డ్యాన్సులు ఆడే తను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు.. ‘నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వేం నటిస్తావు?’ అని ఎగతాళి చేశారు. చిత్రరంగంలో ఉన్న బాలా సింగ్ తనను అర్థం చేసుకుని పని ఇప్పించినా, తన అసిస్టెంట్లు జీవాను అవమానించేవారు. కొంతకాలానికి బాలకు ఆ విషయం అర్థమైంది.
ఒకరోజు జీవాను దగ్గరకు పిలిచి అందరిముందూ.. ‘ఈమె నా కూతురు. మీరంతా ఆమెను అవమానించడం ఆపండి’ అని చెప్పారు. ఆ క్షణం జీవా కళ్లు ఆనందంతో వర్షించాయి. అసిస్టెంట్‌గా బాల ఆమెను తీసుకున్నారు. ఆ ప్రోత్సాహంతో అనుష్క శెట్టి, తాప్సీ, శ్రీయ వంటి తారల సినిమాల్లో జీవా పనిచేసింది. శ్రీయ ప్రోద్బలంతో మేకప్ ఆర్టిస్ట్‌గా కొత్త ప్రయాణం కూడా ప్రారంభించింది. 400 మంది వధువులకు మేకప్ వేసింది. కానీ తన గురించి తెలిసిన తరువాత ఆ అవకాశాలు కూడా దూరమయ్యాయి. తలదాచుకునే ఇల్లు లేక, మోకాల్లోతు నీళ్లు నిండిన ఇరుకు సందులాంటి ఇంట్లో తలదాచుకున్న పరిస్థితి కూడా జీవా అనుభవించింది. ఆ సమయంలోనే 'ధర్మ దురై' చిత్రంలో నటించే అవకాశం రావడంతో చెన్నై వదిలిపెట్టింది. సీనియర్ నటి రాధికను ఎంతగానో అభిమానించే జీవా సినిమాల్లో నటించడమే వృత్తిగా జీవించాలనుకుంది. అయితే అక్కడా ఆమెకు అవమానాలే ఎదురయ్యాయి. షూటింగ్ సిబ్బంది తను నటిస్తున్నప్పుడు ఎగతాళి మాటలు అనేవారు. నీచంగా మాట్లాడేవారు. ఆ మాటలు భరించలేక వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి.
విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నప్పుడు ఇలాంటి అనుభవం ఎదురైంది. అప్పుడు విజయ్, ఏడుస్తున్న జీవాను దగ్గరకు తీసుకుని.. చుట్టూ ఉన్న గుంపును గట్టిగా హెచ్చరించారు. ‘తను నా చెల్లి.. ఇంకెప్పుడూ మీరు తనను అవమానించకండి’ అని చెప్పారు. ఆ క్షణంలో విజయ్ను పట్టుకుని జీవా గట్టిగా ఏడ్చేసింది. అంతకుముందెప్పుడూ తనను ఎవరూ అంతలా దగ్గరకు తీసుకోలేదు. అందుకే ఆ అనుభవం తనకు ‘ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది’ అని ఒకసారి జీవా చెప్పింది. 2016లో విడుదలైన విజయ్ సేతుపతి చిత్రంతో జీవాను సమాజం గుర్తించడం మొదలుపెట్టింది. అయితే అప్పటివరకు అసిస్టెంట్‌గా పనిచేసిన తను నటిగా మారేసరికి ఎవరూ ఆ బాధ్యతలను అప్పగించలేదు. నటిగా అవకాశాలు తక్కువగా రావడంతో జీవా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయినా పోరాడింది. చిన్న చిన్న పాత్రలు వేస్తూ బతికింది. షార్ట్ ఫిల్మ్స్ చేసింది. జీవా నటించిన ఒక లఘుచిత్రం 58 అవార్డులు గెలుచుకుంది. 'ఐరా', 'దర్బార్', 'సుఝల్' చిత్రాల్లో నటించింది. తాజాగా 'డోరతీ'లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా జీవా నటనను మెచ్చుకున్నారు కూడా!
ఈ పాత్ర కోసం యంగ్‌గా ఉన్న తన లుక్‌ను వయసుమళ్లిన పాత్రలా మార్చుకుంది. బరువు పెరిగింది. తెల్ల వెంట్రుకల విగ్ ధరించింది. తెరపై ఆమె కనబర్చిన తీరును అందరూ మెచ్చుకున్నారు. ప్రశంసలు కురిపించారు. అయినా జీవాకు ఇప్పటికీ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని జీవానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. ‘ఎప్పటికైనా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి. అందులో నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ ఇంట్లో ప్రతి దీపావళికి కేక్ కట్ చేయాలి’ అంటోంది. తెరపై జీవితానికి, తెర వెనుక జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. జీవా లాంటి వాళ్లకు అది మరింత భిన్నంగా ఉంటుంది. బతకడం కోసం కంటే.. గుర్తింపు కోసమే వాళ్లు ఎక్కువ పోరాడాల్సి వస్తోంది.








కామెంట్లు (0)