అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లను ఒకే ఇంటికి ఇచ్చి, పుచ్చుకునే కుండమార్పిడి వివాహ పద్ధతి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి ఖర్చులు తగ్గించుకునేందుకు కుటుంబాలు అనుసరిస్తున్న ఈ ఆచారం ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను సమస్యల్లోకి నెడుతోంది. ఇష్టంలేని వివాహాలు చేసుకుని జీవితాంతం బాధలు అనుభవిస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు. అయితే జోధ్‌పూర్‌కు చెందిన మోనికా జోడ్ ఈ ఆచారానికి ఎదురుతిరిగి, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలనే నిర్ణయంతో మరెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
మోనికా చిన్నప్పటి నుంచి 'అబ్బాయిలే వారసులు, అమ్మాయిలు ఎప్పటికైనా ఒకింటికి వెళ్లిపోయేవారే' అనే మాటల మధ్య పెరిగింది. ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆడపిల్లలకు చదువుల అవసరం లేదనే భావనతో ఉన్న కుటుంబ, సామాజిక వాతావరణంలో తన కల నెరవేరదని చిన్న వయసులోనే అర్థం చేసుకుంది. 14 ఏళ్ల వయసులోనే పెళ్లి కుదిర్చినప్పుడు ఆ వివాహం చేసుకోవడం ఇష్టం లేక నాలుగుసార్లు ఇంటి నుంచి పారిపోయింది. చివరకు మహిళలకు అండగా నిలిచే సంభాలి ట్రస్ట్‌ను ఆశ్రయించింది. ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవింద్ సింగ్ రాథోడ్ ఆమెకు చదువుకునే అవకాశం కల్పించి, తన జీవితాన్ని తానే నిర్మించుకునేలా ప్రోత్సహించారు. మోనికా పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించింది. విద్యలో ప్రతిభ కనబరిచిన బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే 'గార్గి' పురస్కారాన్ని కూడా అందుకుంది. అవార్డు స్వీకరించే సమయంలో తన తల్లిని వెంట తీసుకెళ్లింది. అక్కడ ఉపాధ్యాయులు తన కుమార్తెను ప్రశంసించడం చూసిన మోనికా తల్లి మనసు మారింది. 'నీకు నచ్చిందే నువ్వు చేయి. నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పను' అని ఆమె చెప్పడంతో మోనికా చదువును కొనసాగించింది.
ప్రస్తుతం 35 ఏళ్ల మోనికా సంభాలి ట్రస్ట్ సభ్యురాలిగా పనిచేస్తూ అట్టా-సట్టా (కుండమార్పిడి వివాహ పద్ధతి)కు వ్యతిరేకంగా పోరాడుతోంది. మహిళలు ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదని, చదువుకునే అవకాశం లేకపోతే వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచిస్తోంది. ఏదో ఒక నైపుణ్యం నేర్చుకుని నెలకు రూ.2 వేలు, రూ.3 వేలైనా సొంతంగా సంపాదించుకోవాలని, అప్పుడే మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండగలరని ఆమె చెబుతోంది. విద్య, ఆర్థిక స్వావలంబన మహిళలకు భరోసా కల్పిస్తాయని మోనికా అభిప్రాయపడుతోంది.
అట్టా-సట్టా అంటే ఇచ్చిపుచ్చుకునే వివాహాల పద్ధతి. ఒక కుటుంబంలోని కుమార్తెకు వివాహం జరిపిస్తే, అదే కుటుంబానికి చెందిన మరో కుమార్తెను ఆ కుటుంబంలోని సోదరుడితో లేదా మరో పురుషుడితో వివాహం చేస్తారు. అలాగే ఒక కుటుంబంలోని అబ్బాయికి మరో కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరితే, అదే ఇంట్లోని అమ్మాయిని మరో కుటుంబంలోని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. రాజస్థాన్‌లోని బార్మేర్, బికనేర్, జోధ్‌పూర్ వంటి జిల్లాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. వివాహ ఖర్చులు తగ్గించుకోవడానికి కుటుంబాలు ఈ పద్ధతిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇది ఆడపిల్లలకు ఉచ్చుగా మారుతోందని సంభాలి ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవింద్ సింగ్ రాథోడ్ చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఒక్కోసారి 19 ఏళ్ల అమ్మాయిని 50-60 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒక మహిళ తన వివాహ బంధంలో సమస్యలు ఎదుర్కొని ఆ బంధం నుంచి బయటకు రావాలనుకుంటే, దాని ప్రభావం కుటుంబంలోని మరో మహిళపై కూడా పడుతుంది. దీంతో చాలామంది మహిళలు భయపడి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అత్తింటి వేధింపులను భరించడానికి సిద్ధపడుతున్నారు. ఈ సంప్రదాయాన్ని రూపుమాపాలంటే ప్రజల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని రాథోడ్ అభిప్రాయపడ్డారు.
2007లో సంభాలి ట్రస్ట్ ప్రారంభమైంది. బాధిత మహిళలకు న్యాయ సలహాదారులు తమ హక్కులను వివరిస్తూ, కోర్టును ఏ ప్రాతిపదికన ఆశ్రయించాలో మార్గనిర్దేశం చేస్తున్నారు. సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ద్వారా మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. వివాహంలో పొరపొచ్చాలు, సంఘర్షణలు లేదా హింస వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఒక వివాహాన్ని రద్దు చేయాలనుకుంటే, దాని ప్రభావంతో మరో వివాహాన్ని కూడా రద్దు చేయాలని కోరడం సరైనది కాదని కుటుంబాలకు అర్థమయ్యేలా వివరిస్తామని సంస్థలో పనిచేస్తున్న సైకాలజిస్టు కె. తన్వి తెలిపారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్య సంభాలి ట్రస్ట్‌కు 956 హెల్ప్‌లైన్ కాల్స్ వచ్చాయి. మానసిక కౌన్సెలింగ్, చట్టపరమైన మార్గదర్శకత్వం ద్వారా 188 కేసులను పరిష్కరించింది. తీవ్ర ప్రమాదంలో ఉన్న 14 మంది బాధిత అమ్మాయిలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించింది.
మహిళలు ఎదుర్కొనే ప్రధాన అడ్డంకుల్లో ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం ఒకటని మోనికా చెబుతోంది. పిల్లల సంరక్షణ, విద్య గురించి ఆందోళనలు, కుటుంబ ఒత్తిడి, సుదీర్ఘ న్యాయపరమైన విచారణల భయం కూడా మహిళలను సమస్యాత్మక వివాహ బంధాల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయని ఆమె పేర్కొంటోంది. 'ఒక మహిళకు తన వివాహ బంధం నుంచి బయటకు వచ్చేయమని చెప్పడం మాత్రమే సరిపోదు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? తనను తాను, తన పిల్లలను ఎలా పోషించుకుంటుంది? ఆ తర్వాత ఆమెకు అండగా ఎవరు నిలబడతారు? ఇవన్నీ ఆమెకు తెలియాలి. అప్పుడే సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలదు' అని ఆమె అంటోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సంభాలి ట్రస్ట్ కుట్లు, అల్లికలు, ఇతర వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తోంది. చదువుతో పాటు స్వయం ఉపాధి మార్గాలను నేర్పిస్తూ మహిళలు తమ జీవితాలను తామే నిర్మించుకునేందుకు అండగా నిలుస్తోంది. కుండమార్పిడి వివాహాల వంటి ఆచారాలు మహిళల జీవితాలను బంధిస్తున్న నేపథ్యంలో విద్య, ఆర్థిక స్వావలంబనతోనే ఆ బంధాలను తెంచుకోవచ్చని మోనికా జీవితం చెబుతోంది.








కామెంట్లు (0)