మఖానా (తామర గింజలు) తినడానికి రుచిగా ఉంటాయి. పోషక విలువలు కూడా మెండుగా ఉంటాయి. వీటిని ప్రధానంగా బీహార్‌లో సాగు చేస్తారు. ఈ సాగులో మహిళలే ఎక్కువగా శ్రమిస్తున్నప్పటికీ, వారికి దక్కే కూలీ మాత్రం నామమాత్రమే. పొద్దుపొడవక ముందే ఇంటి పనులు పూర్తి చేసి, నిద్రలో ఉన్న పిల్లలను లేపి స్కూల్‌కు సిద్ధం చేసి, గ్రామంలోని చెరువు వద్దకు చేరుకుంటారు. ఉదయం ఆరు గంటలకల్లా మురికినీటితో నిండిన చెరువులోకి దిగి మఖానా సాగులో నిమగ్నమవుతారు.
చెరువులో తామర మొక్కల పెరుగుదలకు ఆటంకం కలిగించే కలుపును తొలగించడం, మొక్కల సంరక్షణ, నీటి అడుగున ఉన్న మఖానా విత్తనాలను సేకరించడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. సాధారణంగా పంటల సాగు భూమిపైనే జరుగుతుంది. కానీ మఖానా సాగు మాత్రం పూర్తిగా నీటిలోనే సాగుతుంది. గంటల తరబడి నీటిలో నిలబడి పని చేయాల్సి ఉంటుంది. చెరువంతా తామరాకులతో నిండిపోయి ఉంటుంది. ఆ ఆకుల కాండాలకు విపరీతంగా ముళ్లు ఉండటంతో అత్యంత జాగ్రత్తగా విత్తనాలను సేకరించాలి. బురద నీటిలో నల్లగా కనిపించే విత్తనాలను వెతకడం ఎంతో కష్టమైన పని. తామర ముళ్లు గుచ్చుకుని చేతులు, కాళ్లకు గాయాలవుతాయి. రోజంతా నీటిలో శ్రమించిన తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ ఇంటి పనులు చేయాల్సిందే. ఇంత కష్టపడినా వారికి రోజుకు రూ.250 నుంచి రూ.300 మాత్రమే కూలీ లభిస్తుంది. అదే వారు సేకరించిన మఖానా మార్కెట్‌లో కిలోకు రూ.750 నుంచి రూ.1,200 వరకు అమ్ముడవుతుంది. ఈ వ్యత్యాసమే వారి పరిస్థితిని చెబుతోంది.
మత్స్యకారుల నుంచి ప్రారంభమైన సాగు
పోషకాహారమైన మఖానా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దేశంలోని మొత్తం మఖానా ఉత్పత్తిలో దాదాపు 85 శాతం బీహార్‌లోనే పండుతుంది. సుమారు 15 వేల హెక్టార్లలో సాగు చేస్తూ, ఏటా దాదాపు 10 వేల టన్నుల మఖానాను ఉత్పత్తి చేస్తున్నట్లు దర్భంగాలోని మఖానా జాతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఉత్తర బీహార్‌లో వేలాది కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.
చారిత్రకంగా ఈ విత్తనాలను సంప్రదాయంగా మత్స్యకారులే సేకరించేవారు. క్రమంగా మఖానా ఆరోగ్య ప్రయోజనాలకు డిమాండ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు చెరువులను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాయి. గతంలో పురుషులే ఈ పనిలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు పురుషులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో గ్రామాల్లో మహిళలే ఈ సాగులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. "పురుషులు బయటకు వెళ్లిన తర్వాత చెరువులో పనులతో పాటు ఇంటి బాధ్యతలన్నీ మేమే చూసుకోవాల్సి వస్తోంది" అని మహిళా కార్మికురాలు సునీతా దేవి చెబుతున్నారు.
విత్తనాల నుంచి పేలాల వరకు
చెరువులో తామర గింజలను సేకరించడం ఒక ఎత్తయితే, ఆ తర్వాతి ప్రక్రియ మరింత కష్టమైనది. గింజలను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. అవి ఎండిన తర్వాత మట్టి పొయ్యిలపై ఇనుప బాండీలలో వేయించి పేలాలుగా మారుస్తారు. మధుబనిలో పనిచేసే దాయి జీ దేవి మాట్లాడుతూ, "ఈ గింజలను దాదాపు ఐదు గంటలపాటు ఎండలో ఆరబెట్టాలి. అవి బాగా ఎండాలంటే నిరంతరం తిరగేస్తూ ఉండాలి. తర్వాత అదే రోజు వేయించాలి. పేలాలుగా మారిన వెంటనే వేడిగానే పైపొట్టు తొలగించాలి. ఇందులో చిన్న పొరపాటు జరిగినా గింజలన్నీ పాడైపోతాయి. వేడి వల్ల మా చేతులు కాలిపోతాయి. అయినా ఆ నొప్పిని భరిస్తూనే మళ్లీ ఇంటి పనుల్లో పడిపోతాం" అని చెప్పారు. మఖానా పేలాలుగా మారాలంటే సరైన ఉష్ణోగ్రత అవసరం. సెకన్ల వ్యవధిలోనే వాటిని నైపుణ్యంతో తయారు చేయాలి. వేడి ఎక్కువైనా రుచి మారిపోతుంది. ఈ ప్రక్రియలో మహిళల నైపుణ్యం కీలకమని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. అయితే ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు లభించడం లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు.
కూలీలోనూ వివక్ష
"మేమెంత కష్టపడినా రోజుకు రూ.250-300 మాత్రమే ఇస్తారు. అదే పురుషులకు రూ.500-600 కూలీ ఇస్తారు. ఎందుకని అడిగితే చెరువులో వాళ్లే ఎక్కువ పని చేస్తారని యజమానులు చెబుతారు. కానీ చెరువు నుంచి కొలిమి వరకు పనులన్నీ మేమే చేస్తాం. మరి మాకు కూలీ ఎందుకు తక్కువ?" అని మహిళా కార్మికురాలు మంజు ప్రశ్నిస్తున్నారు. "మాకు ఈ పని తప్ప మరో ఉపాధి లేదు. దీనికీ వెళ్లకపోతే మా కుటుంబం ఎలా గడుస్తుంది?" అని ఘుద్నీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. "కూలీ గురించి నోరెత్తితే మరుసటి రోజు పని ఇవ్వరు. అందుకే మౌనంగా పని చేయాల్సి వస్తోంది" అని మరో మహిళ చెప్పారు.
లాభాలు పెరుగుతున్నా...
వరి పంటతో పోలిస్తే మఖానా సాగు సంవత్సరంలో మూడు రెట్లు ఎక్కువ ఉపాధిని కల్పిస్తుంది. ముఖ్యంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇది లాభదాయకమైన పంట. పెట్టుబడిపై మంచి ఆదాయం వస్తుంది. అయినప్పటికీ ఇందులో శ్రమిస్తున్న మహిళలు, చిన్న రైతుల ఆదాయాలు మాత్రం పెరగడం లేదు. రైతుల వద్ద నుంచి కిలోకు రూ.300-400కే మఖానాను కొనుగోలు చేసే కాంట్రాక్టర్లు, మార్కెట్‌లో రూ.1,400 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తులే అత్యధిక లాభాలు పొందుతున్నారని రైతు పప్పు షహానీ తెలిపారు. మఖానా సాగులో పనిచేసే చాలా మంది మహిళలు స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులే. అయినప్పటికీ తమ కూలీ రేట్లను తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదని సునీతా దేవి తెలిపారు. "ప్రభుత్వం నిజంగా మా స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇచ్చి, పథకాల ప్రయోజనాలు అందిస్తే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు" అని చంద్రకళా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. పోషకాహారంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న మఖానా వెనుక మహిళల చెమట, శ్రమ, నైపుణ్యం దాగి ఉంది. అయితే ఆ శ్రమకు తగిన కూలీ, గౌరవం, గుర్తింపు ఇంకా దక్కాల్సి ఉంది. అదే ఈ సాగులోని అతిపెద్ద విషాదం.








కామెంట్‌లు (0)