అమెరికా రాజకీయాల్లో కొత్త ధోరణి బలపడుతోంది. డెమొక్రటిక్ సోషలిస్టుల ప్రభావం నగర రాజకీయాల్లో పెరుగుతోంది. న్యూయార్క్, సియాటిల్ తరువాత లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్ డీసీల్లోనూ సోషలిస్టు భావజాలం కలిగిన అభ్యర్థులు మేయర్లుగా ఎన్నిక కావడం ఈ పరిణామానికి నిదర్శనం. తాజాగా లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారతీయ మూలాలున్న నిత్యా రామన్ చారిత్రక విజయం సాధించారు. 52.1 శాతం ఓట్లు సాధించి, ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
నిత్యా రామన్ 1981లో కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి వెంకటరామన్ కెల్ట్రాన్ సంస్థలో, తల్లి సుధా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పనిచేశారు. తండ్రి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లడంతో ఆరేళ్ల వయసులో నిత్యా కుటుంబం అక్కడికి వలస వెళ్లింది. మసాచుసెట్స్‌లో పెరిగిన ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక అధ్యయనాలు అభ్యసించారు. అనంతరం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పట్టణ ప్రణాళికలో ఉన్నత విద్య పూర్తిచేశారు. తమిళనాడుకు చెందిన టెలివిజన్ రచయిత వాలి చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కర్ణ, కావేరి అనే కవల పిల్లలు ఉన్నారు.
ఢిల్లీ మురికివాడల సమస్యలపై ...
నిత్యా రామన్ అమెరికాలో చదువు పూర్తయిన తరువాత భారత్‌కు తిరిగివచ్చి ఢిల్లీలో మురికివాడల ప్రజలతో కలిసి పనిచేశారు. 2010 కామన్వెల్త్ క్రీడల సందర్భంగా మురికివాడల తొలగింపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. చెన్నైలో 'ట్రాన్స్పరెంట్ చెన్నై' సంస్థను స్థాపించారు. మురికివాడల్లో పారిశుధ్య సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్లు, బస్సు మార్గాల వివరాలను సేకరించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సేవలు ఎక్కడ అందుబాటులో లేవో ఆధారాలతో చూపించి అధికారులను బాధ్యత వహించేలా చేయడం ఈ ప్రయత్నం ఉద్దేశం. 2013లో లాస్ ఏంజెలెస్‌కు తిరిగి వెళ్లిన తరువాత అక్కడి నిరాశ్రయుల సమస్యపై దృష్టి సారించారు. ఈ సమస్య పరిష్కారానికి నగరం చేస్తున్న ఖర్చు, నిధుల వినియోగం, బాధితులకు అందుతున్న సేవలపై అధ్యయనం చేశారు. 2017లో నిరాశ్రయులకు సహాయం అందించేందుకు 'సెలా నైబర్‌హుడ్ హోమ్‌లెస్ కొయలిషన్'ను స్థాపించారు. 2020లో లాస్ ఏంజెలెస్ నగర కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2024లో రెండోసారి ఎన్నికయ్యారు. అద్దె ఇళ్లలో నివసించే వారికి రక్షణ కల్పించే చట్టాల కోసం కృషి చేశారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారిని తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి ప్రభుత్వ సేవలను సమర్థంగా వినియోగించడంపైనా దృష్టి పెట్టారు.
దోపిడీకి వ్యతిరేకం
నిత్యా రామన్ తనను డెమొక్రటిక్ సోషలిస్టుగా చెప్పుకుంటారు. అయితే సోషలిజం అంటే ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా మార్చడం మాత్రమే కాదని, ప్రజల రోజువారీ సమస్యలకు పరిష్కారాలు చూపడం కూడా అందులో భాగమేనని ఆమె అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో సిఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ వైఖరిని వివరిస్తూ, 'ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యం. వీధి దీపాన్ని బాగుచేయడానికి, గుంతలు పూడ్చడానికి డెమొక్రటిక్ సోషలిస్టు విధానం, డెమొక్రటిక్ పార్టీ విధానం అంటూ వేర్వేరుగా ఏమీ ఉండవు' అని అన్నారు. తనను డెమొక్రటిక్ సోషలిస్టు రాజకీయాల వైపు ఆకర్షించిన అంశాన్ని వివరిస్తూ, 'అద్దెదారుల హక్కులు, వారి రక్షణ గురించి ఒక రాజకీయ ఉద్యమంగా మాట్లాడిన ఏకైక వేదిక డీఎస్ఏ మాత్రమే. అందుకే నేను ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నా' అని చెప్పారు. తన ఆర్థిక, రాజకీయ దృక్పథాన్ని వివరిస్తూ, 'పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మికుల దోపిడీకి, పేదల దోపిడీకి దారితీయకుండా పనిచేయాలి. ప్రభుత్వం తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి' అని పేర్కొన్నారు. అయితే, కనీస వేతనాల పెంపు, పాలస్తీనా అంశం వంటి విషయాల్లో ఆమె వైఖరిపై డీఎస్‌ఏలో భిన్నాభిప్రాయం ఉంది. ఇళ్ల నిర్మాణాన్ని పెంచడం, అద్దెల భారాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం, నిరాశ్రయులకు శాశ్వత నివాసం కల్పించడం, నగర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి హామీలతో ఆమె మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 2028 ఒలింపిక్స్ నాటికి వీధుల్లో నివసించే నిరాశ్రయుల సంఖ్యను సగానికి తగ్గిస్తానని ప్రకటించారు.
పెరుగుతున్న సోషలిస్టుల ప్రభావం
2025లో న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ఎన్నిక కావడం అమెరికా నగర రాజకీయాల్లో ఈ మార్పుకు బలమైన పునాది వేసింది. డెమొక్రటిక్ సోషలిస్టు భావజాలంతో ప్రచారం చేసిన మమ్దానీ ఉచిత ప్రజా బస్సులు, అందుబాటు ధరల్లో నివాసాలు, పిల్లల సంరక్షణకు ప్రభుత్వ సహాయం వంటి హామీలతో ప్రజల ముందుకొచ్చారు. సియాటిల్లోనూ 2025లో డెమొక్రటిక్ సోషలిస్టు భావజాలం కలిగిన కేటీ విల్సన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్‌గా జేనీస్ లూయిస్ జార్జ్ విజయం సాధించారు.
అమెరికా నగర పాలక వ్యవస్థలో సోషలిస్టు భావజాలానికి చెందినవారి ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యం మరింత పెరిగింది. డీఎస్ఏ మద్దతుతో కనీసం 50 మంది వివిధ పదవులకు ఎన్నికయ్యారు. ప్రైమరీ ఎన్నికల్లో 120 మందికి పైగా అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో సుమారు 6,500గా ఉన్న డీఎస్ఏ సభ్యత్వం 2026 నాటికి 1.30 లక్షలకు చేరింది. బెర్నీ శాండర్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత ప్రారంభమైన ఈ పెరుగుదలకు మమ్దానీ విజయం మరింత ఊపునిచ్చింది. న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, సియాటిల్ వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు, వైద్యం, రవాణా, పిల్లల సంరక్షణ ఖర్చులు సామాన్య కుటుంబాలకు భారంగా మారాయి. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ నివాస వ్యయాన్ని భరించలేకపోవడం, రెండు ఉద్యోగాలు చేసినా కుటుంబ అవసరాలు తీరకపోవడం అనేక మందిని ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచించేలా చేస్తున్నాయి.
"నేను డెమొక్రటిక్ సోషలిస్టుని. డెమొక్రటిక్ సోషలిజం అనేది విస్తృతమైన భావజాలం. ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలని, పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు, పేదలు దోపిడీకి గురికాకూడదని నేను కోరుకుంటాను. కార్మికుల హక్కులు, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ జవాబుదారీతనం నాకు ముఖ్యమైనవి. ప్రజల జీవితాలను మెరుగుపరచడమే రాజకీయాల లక్ష్యం కావాలి. లాస్ ఏంజెలెస్ ప్రజల కోసం పనిచేయడాన్ని నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తాను."
- నిత్యా రామన్









కామెంట్లు (0)