ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవంటింటిని మార్చిన యుద్ధాలు

4 రోజుల క్రితం

యుద్ధాలు మార్చిన వంటిళ్లు.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

యుద్ధం కేవలం సరిహద్దులనే కాదు.. ప్రజల జీవనశైలిని, ఆహార సంస్కృతిని, భవిష్యత్తు తరాల అభిరుచులను కూడా మార్చేస్తోంది. దేశంలో ఏ పంట పండించాలనే నిర్ణయం నుంచి ఒక కుటుంబం పిల్లలకు ఏం తినిపించాలనే నిర్ణయం వరకు యుద్ధాల ప్రభావం కనిపిస్తోంది. చాలామంది భారతీయులకు కార్గిల్‌ యుద్ధం అంటే 1999లో మూడు నెలలపాటు జరిగిన సైనిక ఘర్షణ, భారత సైన్యం సాధించిన విజయం, దేశభక్తిని చాటే పాటలు, సినిమాలు గుర్తుకొస్తాయి. యుద్ధంలో భారత్‌ గెలిచింది. కానీ కార్గిల్‌ ప్రజల జీవితాల్లో మాత్రం ఆ యుద్ధ ప్రభావం మరో ఐదేళ్లపాటు కొనసాగింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు యుద్ధాల కారణంగా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అవసరమైన ఆహారం దొరకక, మరికొన్ని చోట్ల పెద్దలు తమ భోజనాన్ని తగ్గించుకుని పిల్లలకు పెడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రొట్టెలతోనే కడుపు నింపుకుంటున్నారు. ఇలా యుద్ధాలు ప్రజల వంటిళ్లను, ఆహారపు అలవాట్లను మార్చేస్తున్నాయి.

మన దేశంలో 1960ల నుంచే ఆహారపు అలవాట్లలో మార్పులు మొదలయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని రోజువారీ కేలరీల అవసరాలతో కొలవడం ప్రారంభించారు. కార్గిల్‌ యుద్ధానికి ముందు ఇళ్లలో స్థానికంగా పండించిన బార్లీ, చిరుధాన్యాలు, పప్పులు, పశువుల నుంచి సేకరించిన పాలు, వెన్నతో వంటకాలు తయారయ్యేవి. పశువుల పెంపకం, వ్యవసాయం కుటుంబాల ఆహార అవసరాలను తీర్చేవి. కానీ యుద్ధం తరువాత పంట పొలాలు, పశువులు, ధాన్య నిల్వలు దెబ్బతిన్నాయి. ఆహారం కోసం ప్రజలు బయటి సరఫరాలపై ఆధారపడాల్సి వచ్చింది. క్రమంగా స్థానిక ఆహారపు అలవాట్ల స్థానంలో మార్కెట్‌లో లభించే బియ్యం, గోధుమలు, ప్యాకేజ్డ్‌ ఆహారాలు చేరాయి. కార్గిల్‌లో కనిపించిన ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.

గాజా : రొట్టె, పప్పులే ప్రధాన ఆహారం

గాజాలో 2023 అక్టోబరులో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భోజనంలో కూరగాయలు, పండ్లు, మాంసం, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు ఉండేవి. ఇప్పుడు వాటి సరఫరా తగ్గడంతో రొట్టె, పప్పులు, ధాన్యాలపై ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పీ) 2026 మార్చి నివేదిక ప్రకారం, గాజా ప్రజలు యుద్ధానికి ముందు వారంలో ఆరు రోజులు కూరగాయలు తినేవారు. 2026 మార్చి నాటికి ఈ సంఖ్య సగటున 1.8 రోజులకు పడిపోయింది. మాంసం, గుడ్లు వంటి ప్రొటీన్లు వారంలో మూడు రోజులు తీసుకునేవారు. ఇప్పుడు అవి 1.3 రోజులకు తగ్గాయి. పాల ఉత్పత్తుల వినియోగం నాలుగు రోజుల నుంచి మూడు రోజులకు పడిపోయింది.

సూడాన్‌ : ఆకలి కష్టాలు

సూడాన్‌లో 2023 ఏప్రిల్‌ నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం వ్యవసాయాన్ని, ఆహార మార్కెట్లను దెబ్బతీసింది. ఒకప్పుడు జొన్నలు, చిరుధాన్యాలు, గోధుమలు, పప్పులు, కూరగాయలు, పశు ఉత్పత్తులతో ప్రజలు భోజనం చేసేవారు. ఇప్పుడు అనేక కుటుంబాలకు రోజుకు ఒకపూట భోజనం కూడా దొరకడం లేదు. నార్త్‌ డార్ఫర్‌, సౌత్‌ కోర్డోఫాన్‌ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పంటలు పండించలేక, మార్కెట్లకు వెళ్లలేక, ఆహార సరఫరాలు అందక ప్రజలు చెట్ల ఆకులు, పశువుల మేతతో ఆకలి తీర్చుకుంటున్నట్లు ‘కేర్‌’, ‘యాక్షన్‌ ఎగైనెస్ట్‌ హంగర్‌’ తదితర సంస్థలు 2026 ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు ఇంటింటా వంట చేసుకునే కుటుంబాలు ఇప్పుడు అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని సామూహిక వంటశాలల్లో వండుకుంటున్నాయి. నిధులు తగ్గడంతో ఇవి కూడా మూతపడే ప్రమాదం ఉంది.

యెమెన్‌ : పోషకాహార లోపం

దిగుమతులపై అధికంగా ఆధారపడే యెమెన్‌లో 2014 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఓడరేవులపై దాడులు, దిగ్బంధనాలు, ఆర్థిక సంక్షోభం ప్రజల ఆహారపు అలవాట్లను మార్చేశాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో కుటుంబాలు మాంసం, పాలు, పండ్లు వంటి ఖరీదైన ఆహార పదార్థాలను తగ్గించుకుంటున్నాయి. చౌకగా లభించే పిండి పదార్థాలు, రొట్టెలతో కడుపు నింపుకుంటున్నాయి. యెమెన్‌లో 2025 డిసెంబరులో నిర్వహించిన డబ్ల్యుఎఫ్‌పీ పరిశీలనలో దేశవ్యాప్తంగా 64 శాతం కుటుంబాలు కనీస ఆహార అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నట్లు వెల్లడైంది. కొందరు భోజనాల సంఖ్యను తగ్గిస్తుండగా, మరికొందరు పిల్లలకు పెట్టడానికి తమ భోజనాన్ని వదులుకుంటున్నారు. 2026లోనూ ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, కరెన్సీ విలువ పడిపోవడం ఈ పరిస్థితిని మరింత దిగజార్చాయి.

ఉక్రెయిన్‌ : మారిన వంటిళ్లు

2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇళ్లలో వంట చేసుకోవడం కష్టమైంది. విద్యుత్‌ లేకపోవడంతో ఇండక్షన్‌ పొయ్యిలు పనిచేయలేదు. గ్యాస్‌ సరఫరా లేని ప్రాంతాల్లో ప్రజలు బయట ఏర్పాటు చేసిన పొయ్యిలపై వంట చేసుకోవాల్సి వచ్చింది. యుద్ధం కారణంగా ఇళ్లను వదిలి వెళ్లిన కుటుంబాల ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇంట్లో తయారుచేసుకునే సంప్రదాయ వంటకాల స్థానంలో రేషన్‌, సిద్ధంగా లభించే భోజనం, సహాయ సంస్థలు అందించే ఆహారంపై ఆధారపడాల్సి వచ్చింది.

ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు ముగిసి సరిహద్దుల్లో శాంతి నెలకొన్నా, ప్రజల వంటిళ్లలో ఏర్పడిన మార్పులు వెంటనే తొలగిపోవు. దెబ్బతిన్న వ్యవసాయం తిరిగి కోలుకోవడానికి, స్థానిక ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి రావడానికి, పాత వంటకాలు, భోజనపు అలవాట్లు పునరుద్ధరించడానికి కొన్నేళ్లు పడుతుంది. కొన్నిసార్లు ఒక తరం పాటించిన ఆహారపు అలవాట్లు మరో తరానికి పరిచయం కాకుండా పోతాయి. కార్గిల్‌ నుంచి గాజా వరకు కనిపిస్తున్న పరిణామం ఇదే. యుద్ధం మనుషుల ప్రాణాలనే కాదు.. వారి పంటలను, పళ్లెంలోని ఆహారాన్ని, వంటింటి జ్ఞాపకాలను కూడా దెబ్బతీస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్