సోనమ్ వాంగ్ చుక్.. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 21 రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా పాలకుల్లో చలనం లేదు. ఆయన ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారో దేశంలో చాలామంది మేధావులకు, విద్యావేత్తలకు తెలుసు. అయితే ఎవరికోసం ఆ దీక్ష చేపట్టారో వారిలో చాలామందికి మాత్రం ఆయన గురించి తెలియకపోవడం బాధాకరం. సోనమ్ తన కోసం కాదు, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఈ దీక్ష చేస్తున్నారు. దేశంలో ప్రభుత్వాల ఉదాసీనత వల్ల, జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చూసి ఆయన చలించిపోయారు. అందుకే తన ప్రాణాలను పణంగా పెట్టి 'విద్యార్థి చావులకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి' అని పోరాడుతున్నారు. దేశ నలుమూలల నుండి ఎందరో విద్యావేత్తలు, మేధావులు ఆయనకు సంఘీభావంగా నిలబడుతున్నారు. ఈ పోరాటంలో సోనమ్‌ను గెలిపించేది ఆయనకు మద్దతుగా నిలబడిన వారే!
సోనమ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'మ్యాన్ ఆఫ్ మెనీ మిషన్స్' అనాలి. ఇంజినీరుగా, విద్యావేత్తగా, సామాజిక వేత్తగా, పర్యావరణ రక్షకుడిగా దశాబ్దాల తరబడి కృషి చేస్తున్న సోనమ్ జమ్ముకాశ్మీర్ లేహ్ జిల్లాలో అల్చి గ్రామంలో 1966లో పుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌గా పిలుస్తున్నారు. పాఠశాలలు లేకపోవడం వల్ల ఆ గ్రామ విద్యార్థులకు ప్రాథమిక విద్య అందేది కాదు. సోనమ్ కూడా 9 ఏళ్ల వరకు స్కూలు ముఖం చూడలేదు. విద్యావంతురాలైన తల్లి దగ్గరే మాతృభాషలో అక్షరాలు నేర్చుకున్నారు. ఆ తరువాత 1975లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సోనమ్ తండ్రి తనను శ్రీనగర్ తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించారు. అప్పటి వరకు మాతృభాషలో నేర్చుకున్న సోనమ్, పాఠశాల విద్యను అర్థం చేసుకోలేకపోయారు. అయోమయంగా చూస్తున్న సోనమ్‌ను అందరూ మందబుద్ధి ఉన్న పిల్లాడిగా చూసేవారు. అక్కడి నుండి ఆయన విద్యాప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్న సోనమ్ కోరికను తండ్రి అంగీకరించకపోవడంతో ఆ చదువుకు అవసరమైన డబ్బులు తానే సంపాదించుకుంటానని సవాలు చేసి ఇంటి నుండి బయటికి వచ్చేశారు. ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించుకుని ఫీజులు కట్టుకున్నారు. అలా ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశారు. అయితే,
ఆయన ఉద్యోగాల వైపు చూడలేదు. చదువు నేర్చుకోవడంలో తాను పడిన ఇబ్బందులు తన ప్రాంతంలో మరే పిల్లవాడు పడకూడదని భావించారు. అప్పటికి అక్కడ పిల్లల ఉత్తీర్ణతా శాతం సున్నాగా ఉండేది. అంటే పిల్లలు ఎవరూ పరీక్షల్లో పాస్ అయ్యేవారు కాదు. ఆ పరిస్థితిని అందరూ చాలా సాధారణంగా 'పిల్లలు సరిగ్గా చదవడం లేదు' అని చెబుతారు. కానీ 'చదవడంలో పిల్లలు ఎప్పుడూ వైఫల్యం కారు.. వాళ్లకు అర్థమయ్యేలా చదువు చెప్పడంలో వ్యవస్థే వైఫల్యం అవుతోంది' అంటారు సోనమ్.
‘సెక్మాల్’.. లడఖ్ రూపురేఖలు మార్చింది..
విద్యావ్యవస్థ పిల్లలకు అనుకూలంగా ఎలా ఉండాలో సోనమ్ చెప్పడం కాదు. ఆచరించి చూపారు. 22 ఏళ్ల వయసులో 1988లో తన స్నేహితులతో కలిసి 'స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్' (ఎస్ఇసిఎమ్ఓఎల్ - సెక్మాల్)ను స్థాపించారు. ఇందులో లడఖ్‌లో 95 శాతం పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. ఈ సంస్థలో పిల్లలు విద్యను ఎలా నేర్చుకుంటారంటే.. బాలీవుడ్ చిత్రం 'త్రీ ఇడియట్స్'ను గుర్తుచేసుకోవాలి. ఆ సినిమా క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ పాత్ర మంచుకొండల్లో ఓ స్కూలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సన్నివేశాల్లో పిల్లలు ప్రకృతితో మమేకమై, ఎన్నో జీవన నైపుణ్యాలను ఒకరికొకరు నేర్పించుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు. టీచర్లు కేవలం వారిని గైడ్ చేస్తుంటారు. సెక్మాల్ స్ఫూర్తితోనే ఆ సన్నివేశాలు తీశారని ఆ తరువాత ప్రచారం జరిగింది. దీనిపై కూడా సోనమ్ మాట్లాడుతూ 'ఆ సినిమాకు నా జీవితం స్ఫూర్తి కాదు.. "సెక్మాల్" ఆచరించే విధానాలు మాత్రమే' అన్నారు. ఇంత ప్రభావం చూపించిన ఈ సంస్థ క్రమంగా లడఖ్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు అక్కడ విద్యార్థుల పాస్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది.
పర్యావరణ ప్రేమికుడిగా...
'సెక్మాల్' తరువాత సోనమ్ చాంగ్ థాంగ్‌లో మరో విద్యాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులతో ఆయన చేసిన మంచు స్థూపాల ఆవిష్కరణ పెద్ద సమస్య పరిష్కారానికి దారి చూపింది. లడఖ్ రైతులు పంటలు వేసుకునే సమయంలో అవసరమైన నీరు లభించక చాలా ఇబ్బందులు పడేవారు. శీతాకాలంలో వృథాగా పోయే ప్రవాహపు నీటిని మళ్లించి, గడ్డకట్టించడం ద్వారా ఈ నిర్మాణాలు చేశారు సోనమ్. 20 మీటర్ల పొడవుతో శంఖాకారంలో నిర్మితమైన ఈ మంచు స్థూపాల్లో 15 లక్షల లీటర్లకు పైగా నీరు నిల్వ ఉంచుతారు. వేసవి మొదలయ్యాక క్రమంగా కరుగుతూ నీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఆదుకుంటున్నాయి. 2014లో చేసిన ఈ ఆవిష్కరణ ప్రపంచ పర్యావరణవేత్తగా సోనమ్‌ను గుర్తించేలా చేసింది. పర్యావరణానికి విఘాతం కలిగించే పరిస్థితులపై సోనమ్ ఎన్నో ఉద్యమాలు నడిపారు. “క్లైమేట్ ఫాస్ట్”కు నాయకత్వం వహించారు. ఎత్తైన లడఖ్ ప్రాంతంలో పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకొని, కనీస కార్బన్ ఉద్గారాలతో సౌర ఫలకాలు తయారు చేయిస్తున్నారు. ఇంకా మట్టి కట్టడాలతో కూడిన భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించారు. ఇవన్నీ అక్కడి ప్రజల రోజువారీ జీవితంలో ఎన్నో మార్పులను తెచ్చాయి.
అంతర్జాతీయ అవార్డులు...
ఇంజినీరుగా, విద్యావేత్తగా, పర్యావరణ ప్రేమికుడిగా సోనమ్ చేసిన కృషికి గాను 15కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. 2016లో 'రోలక్స్ అవార్డు'కు గాను సుమారు కోటి రూపాయలకు పైగా వచ్చిన ప్రైజ్ మనీని ఆయన స్థాపించిన మరో విద్యాసంస్థ 'ద హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్' కోసం వెచ్చించారు. 2018లో 'రామన్ మెగసెసే' అవార్డు కూడా సోనమ్ కృషికి దక్కిన మరో అత్యున్నత గౌరవం. స్థానిక ప్రజల కోసం, పర్యావరణ రక్షణ కోసం సోనమ్ గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. నిరాహారదీక్షలు చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఈ విద్యావేత్తను పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారు. అయినా ఆయన తన ప్రయాణం ఆపలేదు. తాజాగా నీట్ పేపర్ లీక్ అంశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతృత్వంలో జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొని నిరాహారదీక్ష చేస్తున్నారు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. విపరీతంగా బరువు తగ్గిపోయారు. నడవలేని స్థితిలోకి వచ్చారు. దీక్ష విరమించమని ఎందరో ఆయన్ను అర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ‘దీక్ష వద్దని నాకు చెప్పడం కాదు.. జవాబుదారీతనం ఇవ్వమని పాలకులను ప్రశ్నించండి, చర్చకు రమ్మని పోరాడండి’ అని సోనమ్ దేశ ప్రజలకు సూచిస్తున్నారు.







కామెంట్‌లు (0)