కెమెరా అనుభవం లేదు. చేతిలో డబ్బులూ లేవు. అయినా ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. తన తండ్రి, తాతల తరహాలో స్వర్ణకారులుగా జీవిస్తున్నవారి పనితనాన్ని, వారి జీవితాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. తండ్రి స్క్రిప్ట్ అందించాడు. భర్త సహకరించాడు. కెమెరా పట్టుకుని స్వయంగా చిత్రీకరణ చేపట్టింది. అలా రూపొందించిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ యువ దర్శకురాలే గోవాకు చెందిన 28 ఏళ్ల ప్రాచి షిరోడ్కర్.
గోవాలోని ఓ చిన్న స్వర్ణకారుల వర్క్‌షాప్‌లో బంగారాన్ని కరిగించే కొలిమి ఒకవైపు మండుతుంటే, మరోవైపు ఓ కళాకారుడు సన్నని లోహపు తీగతో బంగారు ఉంగరంపై పేరు చెక్కుతున్నాడు. ఆధునిక యంత్రాల సాయం లేకుండా చేతి నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తున్నాడు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ వృత్తిలోని నైపుణ్యాన్ని ప్రాచి తన డాక్యుమెంటరీలో చిత్రీకరించింది. కొంకణి భాషలో రూపొందించిన ఈ చిత్రానికి ‘భాంగార్ కలాకుసర్ కారిగిరి’ అని పేరు పెట్టింది. అంటే ‘స్వర్ణకారుల చేతివృత్తి కళ’ అని అర్థం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు కెమెరా నిర్వహణ, కథనం బాధ్యతలూ ఆమెనే చూసుకుంది. తండ్రి స్క్రిప్ట్ అందించగా, భర్త మారియో పిమెంటా ఎడిటింగ్ చేశాడు.
లాక్‌డౌన్‌తో మార్పు
2020లో కరోనా లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి ప్రాచి ఆర్కిటెక్చర్ కోర్సులో మొదటి సంవత్సరం మాత్రమే పూర్తి చేసింది. తరగతులు నిలిచిపోవడంతో లభించిన విరామం ఆమెను చిన్నప్పటి ఆసక్తుల వైపు మళ్లించింది. బాల్యం నుంచీ నాటకాలు, నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబంలో ఎవరూ ఆ దిశగా ప్రోత్సహించలేదు. అందుకే ఆర్కిటెక్చర్‌ను ఎంచుకుంది. అయితే డిజైనింగ్ కంటే కథలు చెప్పడమే తనకు ఇష్టమని లాక్‌డౌన్ సమయంలో గుర్తించింది. ఆర్కిటెక్చర్‌ను వదిలి మాస్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. ‘నేను కోరుకున్నది ఇదే. ఇదే నా ప్రపంచం. నేను ప్రేమించే ఈ పనిలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అని తన నిర్ణయం గురించి చెబుతుంది.

కుటుంబ వృత్తి స్ఫూర్తి
ప్రాచి తండ్రి, తాత స్వర్ణకారులు. చిన్నప్పటి నుంచీ వారి పనితనాన్ని దగ్గరగా చూసిన ఆమె, మాస్ కమ్యూనికేషన్ చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా స్వర్ణకారులపై డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల మరో ప్రాజెక్టు చేయాల్సి రావడంతో ఆ ఆలోచనను పక్కనపెట్టింది. చదువు పూర్తయి వివాహం జరిగినా ఆ కల మాత్రం అలాగే ఉండిపోయింది. జీవిత భాగస్వామి మారియో పిమెంటా ఆమె ఆలోచనను ప్రోత్సహించడంతో డాక్యుమెంటరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కెమెరా ఎలా ఉపయోగించాలో కూడా తెలియని ప్రాచి, పరిమితమైన డబ్బుతోనే చిత్రీకరణ ప్రారంభించింది. తన తండ్రితో పనిచేసే స్వర్ణకారులంతా పరిచయస్తులే కావడంతో వారి పనులకు ఆటంకం కలగకుండా, వీలున్నప్పుడల్లా చిత్రీకరించేది. వారాల తరబడి సాగిన ఈ ప్రక్రియలో మహిళా స్వర్ణకారులకూ చోటు కల్పించింది. ‘ఈ వృత్తి కేవలం పురుషులకే పరిమితం కాలేదు. మహిళలూ ఇందులో పనిచేస్తున్నారు’ అని చెబుతుంది.
గోవాలోని మపుసా, పెర్నెం, మార్గావ్ ప్రాంతాల్లో మాట్లాడే కొంకణి భాషలో చిన్నచిన్న వ్యత్యాసాలుంటాయి. స్వర్ణకారుల వృత్తికి సంబంధించిన ప్రత్యేక పదజాలం కూడా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రాచి తండ్రి స్క్రిప్ట్ రాశారు. చిత్రీకరణలో తనను ఆశ్చర్యపరిచిన ఓ సంఘటనను ప్రాచి గుర్తుచేసుకుంది. ‘ఒక స్వర్ణకారుడు కత్తిలా కూడా కనిపించని సన్నని లోహపు తీగతో బంగారు ఆభరణంపై పేరు చెక్కడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఆభరణాల తయారీకి ఎన్నో యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా వాటికి ముందే మన చేతుల్లో ఉన్న అపారమైన నైపుణ్యాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించాలనుకున్నాను’ అని వివరించింది.
అంతర్జాతీయ గుర్తింపు
డాక్యుమెంటరీ పూర్తయ్యాక పలు చలనచిత్రోత్సవాలకు పంపించింది. తొలుత తిరస్కరణలు ఎదురైనా ప్రయత్నం ఆపలేదు. చివరకు అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో జరిగిన జాక్సన్ డాక్ ఫెస్ట్‌లో ఈ చిత్రానికి తొలిసారి ఎంపిక లభించింది. ఆ తర్వాత కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ ఫోక్‌లోర్ ఫిల్మ్ ఫెస్టివల్, ఉక్రెయిన్‌లోని ఉజ్‌హొరోడ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కల్చరల్ జర్నల్ అవార్డుకు ఎంపికైంది.
మిసెంట్‌ఏజ్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా పురస్కారం అందుకుంది. సంస్కృతికి చేసిన కృషికిగాను రోటరీ ఇంటర్నేషనల్ నుంచి యంగ్ అచీవర్స్ అవార్డును పొందింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అమాదేర్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుతోపాటు ఉత్తమ దర్శకురాలిగా ఫెస్టివల్ మెన్షన్ గుర్తింపు సాధించింది. నోయిడాలో జరిగిన 14వ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 15 నిమిషాల్లోపు నిడివి గల చిత్రాల విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
ప్రస్తుతం ప్రాచి ముంబయిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకునే యువతకు ఆమె ఇచ్చే సందేశం ఒక్కటే. ‘పెద్ద బడ్జెట్, పెద్ద బృందం కోసం ఎదురుచూస్తూ ఎక్కడున్నారో అక్కడే ఆగిపోవద్దు. మీ దగ్గర కెమెరా ఉంది. చెప్పడానికి ఒక కథ ఉంది. వెళ్లి చిత్రీకరించండి. మనకు అత్యంత దగ్గరగా ఉన్న కథలతోనే ప్రయాణం ప్రారంభించండి. అక్కడి నుంచే ఒక్కో అడుగు ముందుకు వేయండి’ అని సూచిస్తోంది. పరిమిత వనరులతోనూ మంచి కథను ప్రపంచానికి చెప్పవచ్చని ప్రాచి ప్రయాణం నిరూపిస్తోంది.








కామెంట్‌లు (0)