ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయం కోసం నారీభేరి!

5 గంటల క్రితం

jeevana story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అడవి.. వాళ్లకు అమ్మలాంటిది. వనంలోని చెట్టూ, పుట్టా, మట్టీ, నీరుతో వాళ్లు పెనవేసుకున్న బంధం తల్లీబిడ్డల వాత్సల్యంతో సమానం. అభివృద్ధి పేరుతో వాళ్ల నుంచి ఆ మూలాలను దూరం చేయడం అంటే కేవలం హక్కులను కాలరాయడం మాత్రమే కాదు. వారి జీవనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను పూర్తిగా వారి నుంచి దూరం చేయడం. అందుకే ఎప్పుడు, ఎక్కడ అటువంటి పరిస్థితి వచ్చినా వారంతా ఏకమవుతారు. పోరుబాట పడతారు. అలాంటిదే మధ్యప్రదేశ్‌లోని కెన్–బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు చుట్టూ కనిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా పేరుగాంచిన ఈ ప్రాజెక్టు వద్ద "న్యాయం చేయండి.. లేకపోతే చావనివ్వండి" అని అమాయక గిరిపుత్రులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వేలాది మంది మహిళలు ముందుండి నడిపిస్తున్న ఈ పోరాటంలో 'చితా సత్యాగ్రహ్', 'మిట్టి సత్యాగ్రహ్', 'జల్ సత్యాగ్రహ్' అంటూ సాగిన ఆందోళనలు తాజాగా 'ఫాన్సీ సత్యాగ్రహ్'కు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉరితాళ్లు మెడలకు బిగించుకుని నిరసన తెలుపుతున్న ఈ మహిళలు, "ఉన్న చోటును విడిచిపోవడం అంటే.. అది మాకు మరణంతో సమానం" అంటున్నారు. ఈ మహిళలు తమ హక్కుల కోసం పాదయాత్ర చేపట్టి, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మహిళల్లాంటివారే. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం ఇటీవల పాడేరు ఐటీడీఏను ముట్టడించిన అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిపుత్రుల్లాంటివారే!


అడవులు, నదులు, వ్యవసాయ భూములు చాలామందికి ఆస్తులు. కానీ గిరిపుత్రులకు అవి సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రతీకలు. వాటిని కోల్పోవడం అంటే వాళ్ల మొత్తం జీవన విధానాన్నే కోల్పోవడమని వారు భావిస్తారు. మొన్న ఏప్రిల్‌లో నిప్పులు కక్కుతున్న ఎండల్లో దేశంలో చాలామంది చల్లదనం కోసం ఏసీలు, ఫ్యాన్ల కింద సేదతీరుతుంటే, కెన్–బెట్వా ప్రాజెక్టు వద్ద వేలాది మంది గిరిజన మహిళలు ప్రతీకాత్మకంగా పేర్చిన 'చితి'లపై పడుకుని నిరసన తెలిపారు. అంతకుముందు కొన్ని నెలల నుంచే అక్కడ నిరసనలు జరుగుతున్నాయి.


అభివృద్ధి పేరుతో...

భారతదేశ జల మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో కెన్–బెట్వా అనుసంధాన ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న నీటి కొరతకు పరిష్కారంగా దీనిని చాలాకాలంగా ప్రచారం చేశారు. భవిష్యత్తులో నదులను అనుసంధానించే కార్యక్రమాలకు ఇది ఒక నమూనాగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్, పన్నా జిల్లాల్లో కెన్ నదిపై నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్‌లోని 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లోని 21 లక్షల మందికి తాగునీరు అందుతుందని ప్రభుత్వం పేర్కొంది. 10.62 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు ఇది. 103 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉంది.


ప్రాజెక్టుల నిర్మాణం ఇన్ని లక్షల మందికి మేలు చేస్తుందన్నది వాస్తవమే. అయితే ఈ ఆనకట్ట చుట్టూ శతాబ్దాలుగా 24 గ్రామాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎనిమిది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోనున్నాయి. మరో 16 గ్రామాలు పన్నా టైగర్ రిజర్వ్‌లో విలీనం కానున్నాయి. అంటే, పెద్ద ఎత్తున గిరిజన సమూహాలు స్థానభ్రంశం చెందనున్నాయి. దీనికి పరిహారంగా ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. పునరావాసం కల్పిస్తామని చెప్పింది. 40 శాతం మందికి లబ్ధి చేకూరిందని అధికారులు చెబుతున్నారు. "మా పోరాటం కేవలం పరిహారం కోసం కాదు. పునరావాసం అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకూడదు. అది జీవనోపాధిని పునరుద్ధరించాలి. సామాజిక బంధాలను గుర్తించాలి. స్థానభ్రంశం కోలుకోలేనిదిగా మారకముందే సాంస్కృతిక గుర్తింపును కాపాడాలి" అని ఆ గిరిజనులు ఈ ఆందోళన బాట పట్టారు.


అడుగడుగునా ఆంక్షలు

"నిరసనను అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి" అని ఈ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. అందుకు సాక్ష్యంగా అమాయకులైన ఆదివాసీలను ఎక్కడికక్కడ నిలువరించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. నిరసనలు చేస్తున్న వారికి నీళ్లు, ఆహారం సరఫరా కాకుండా అధికారులు అడ్డుకున్నారు. స్థానికులు కూడా వారికి సహాయం చేయకూడదని ఆంక్షలు విధించారు. ఛతర్‌పూర్ సరిహద్దులను మూసివేశారు. అయినా గిరిజనులు బెదరలేదు. తాడోపేడో తేల్చుకుందామని పిల్లాపాపలతో సహా రెండు జిల్లాలను కలిపే కెన్ నది దగ్గరకు చేరుకున్నారు. గుడారాలు వేసుకుని మరీ పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తున్న గిరిజన కుటుంబాలకు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. తమ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల నుంచి ఏళ్ల తరబడి తాము మినహాయింపునకు గురవుతున్నామన్నదే వాళ్ల ఆవేదన.


మహిళల నాయకత్వంలో జరుగుతున్న ఈ గిరిజనుల పోరుబాట చరిత్రలో మరో అధ్యాయానికి నాంది పలుకుతోంది. దశాబ్దాల క్రితం, 1973లో ఉత్తరాఖండ్ అడవుల్లో 'చిప్కో' ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపించారు. తమ జీవనోపాధికి ముప్పుగా పరిణమించిన వాణిజ్య కలప నరికివేతకు వ్యతిరేకంగా మహిళలు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడ్డారు. శాంతి మార్గంలో నడుస్తూ అడవిలోని ప్రతి చెట్టునూ ఒకరికొకరు చేతులు చుట్టుకుని మరీ కౌగిలించుకున్నారు. చెట్లను రక్షించేందుకు ఆ మహిళలు నాడు ఆ పోరాట మార్గం ఎంచుకున్నారు. నేడు ఈ మహిళలు 'చితి'లపై పడుకున్నారు. ఉరితాళ్లు బిగించుకున్నారు. "అడవిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష మాత్రం నిన్నటికీ, నేటికీ ఒకటే." ఆయుధం మారింది. శత్రువు మారలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్